అమెరికా-చైనా ట్రేడ్ వార్: 200 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా

  • 10 మే 2019
అమెరికా చైనా వాణిజ్య యుద్ధం Image copyright Getty Images

అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదిరింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు రెట్టింపు కన్నా ఎక్కువ పెంచేసింది.

చైనా ఉత్పత్తుల మీద ఇప్పటివరకూ 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను అమెరికా శుక్రవారం ఏకంగా 25 శాతానికి పెంచింది. ఈ పెంపును ప్రతిచర్యలతో తిప్పికొడతామని చైనా ప్రకటించింది.

సుంకాల పెంపు పట్ల ‘‘తీవ్ర విచారం’’ వ్యక్తం చేసిన చైనా.. తాము ‘‘అవసరమైన ప్రతి చర్యలు’’ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది.

ఒకవైపు ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమై ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయటానికి ప్రయత్నిస్తుండగానే మరోవైపు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Image copyright Getty Images

చేపలు, హ్యాండ్ బ్యాగ్‌లు, దుస్తులు, పాదరక్షలు తదితరాలతో సహా మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా సరుకుల మీద అమెరికాలో 10 శాతంగా ఉన్న సుంకాలు ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగటంతో ఆ పెంపును అమెరికా వాయిదా వేసింది.

ఇరు దేశాల మధ్య కొన్ని నెలల పాటు సాగిన వాణిజ్య ఉద్రిక్తతలకు ముగింపు పలుకే దిశగా ఉభయ పక్షాలూ పయనిస్తున్నట్లు ఇటీవలి వరకూ కనిపించింది. అయితే చర్చలు చాలా మందకొడిగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అయితే.. గురువారం నాడు చర్చలు ప్రారంభం కావటానికి ముందు.. వాణిజ్య చర్చల్లో ''ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింద''ని ఆయన చెప్పారు.

చైనా ఉత్పత్తుల మీద సుంకాలను అమెరికా పెంచినట్లయితే ''అవసరమైన ప్రతిచర్యల''తో తిప్పికొడతామని చైనా వ్యాఖ్యానించిన అనంతరం ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: మీపై చూపే ప్రభావం ఇదీ...

వాణిజ్య యుద్ధం తీవ్రం

విదేశీ ఉత్పత్తులపై దిగుమతిదారులు చెల్లించే పన్నులనే సుంకాలు (టారిఫ్)గా వ్యవహరిస్తారు. చైనా తయారీ ఎలక్ట్రికల్ పరికరాలు, మెషీన్లు, కార్ల విడిభాగాలు, ఫర్నిచర్ తదితర చాలా రకాల వస్తువుల మీద సుంకాలు శుక్రవారం నుంచి 25 శాతం పెరుగుతాయంటూ రాబర్ట్ లైతీజర్ బుధవారం ఒక అధికారిక నోటీస్ విడుదల చేశారు.

అమెరికా విధించిన 25 శాతం సుంకాలను అమెరికా కంపెనీలు చెల్లిస్తాయి. ‘‘200 బిలియన్ డాలర్ల చైనా ఎగుమతుల మీద అమెరికా సుంకాలను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచింది’’ అని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

‘‘అమెరికా, చైనా పక్షాలు ప్రస్తుతం నెలకొన్న సమస్యలను సహకారం, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని చెప్పింది.

చైనా ఉత్పత్తుల మీద అమెరికా సుంకాల పెంపుతో చైనా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా మార్పులకు లోనయ్యాయి. హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.6 శాతం పెరగగా.. షాంఘై కంపోజిట్ 1.5 శాతం పెరిగింది.

చైనా ఉత్పత్తుల మీద ఈ వారంలో సుంకాలను పెంచుతామని, కొత్త సుంకాలను విధించే అవకాశం కూడా ఉందని ట్రంప్ గత ఆదివారం నాడు ట్వీట్ చేసినపుడు ఈ వారం ఆరంభంలో మార్కెట్ దెబ్బతిన్నది.

Image copyright Getty Images

చైనా ఎలా స్పందిస్తుంది?

ఇంతకుముందు తమ ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు విధించినపుడు చైనా తక్షణమే ప్రతిస్పందించింది.

పరిస్థితి ఇంకా విషమించవచ్చు. ఎందుకంటే.. మరో 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద కూడా అమెరికా 25 శాతం సుంకాలను ''త్వరలో'' విధించవచ్చునని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే.. చైనా ఉప ప్రధానమంత్రి లియూ హె, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లీతీజర్‌, విత్త మంత్రి స్టీవెన్ ముంచిన్‌ల మధ్య గురువారం చర్చలు కొనసాగాయి.

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నుంచి తనకు ‘‘అందమైన లేఖ’’ అందిందని ట్రంప్ గురువారం పేర్కొన్నారు. తామిద్దరమూ ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం ఉందనీ చెప్పారు.

శుక్రవారం చర్చలను కొనసాగించాలన్న చైనా ఉప ప్రధానితో అమెరికా అధికారులు అంగీకరించారని అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు.

Image copyright Getty Images

సుంకాల పెంపు ప్రభావం ఏమిటి?

చైనా ఉత్పత్తుల మీద పెంచిన సుంకాల ప్రభావం అమెరికా ఆర్థికవ్యవస్థ మీద చూపే ప్రభావం పెద్దగా ఉండదని ట్రంప్ కొట్టివేసినప్పటికీ.. ఈ పెంపును దిగుమతి కంపెనీలు వినియోగదారుల మీదే మోపే అవకాశం ఉండటంతో పలు అమెరికన్ కంపెనీలు, వినియోగదారులకు దెబ్బ తగిలవచ్చునని విశ్లేషకుల అంచనా.

‘‘ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ అవుతుంది’’ అని ఏసియన్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డెబొరా ఎల్మ్స్ అభివర్ణించారు.

‘‘ఈ 25 శాతం సుంకాల పెంపును ఎదుర్కొంటున్న సంస్థలన్నీ అమెరికా కంపెనీలే. ఆ ధరల పెంపు భారం ఆ సంస్థల మీదే పడుతుంది. పైగా చైనా ప్రతిచర్యలతో తిప్పికొట్టబోతోందన్న విషయమూ గుర్తుంచుకోవాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు ఇరు దేశాలూ పరస్పర వస్తువులపై సుంకాలు పెంచటం వాణిజ్యరంగంలో అనిశ్చితిని సృష్టించటంతో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థ మీద కూడా భారం మోపుతోంది.

Image copyright Getty Images

అమెరికా - చైనాల మధ్య వాణిజ్యం యుద్ధం ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనా మీద తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమానతలు ఉన్నాయన్నది ఆయన విమర్శ. అలాగే చైనా మేధో సంపత్తి నిబంధనలు అమెరికా కంపెనీలను కుంటుపడేలా చేస్తున్నాయని కూడా ట్రంప్ ఆరోపిస్తున్నారు.

అయితే.. ప్రపంచంలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం పట్ల పశ్చిమ ప్రపంచ ప్రభుత్వాలు కొన్నిట్లో ఆందోళన పెరుగుతోందని.. చైనా ఎదుగదలను నిరోధించటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఈ వాణిజ్య యుద్ధమని చైనాలో కొందరు భావిస్తున్నారు.

అయితే.. అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా చైనా మీద తాజా చర్యలకు పురిగొల్పిన అంశం ఖచ్చితంగా ఏమిటనేది అస్పష్టం.

ఇరు దేశాలూ ఇప్పటికే ఎదుటి దేశానికి చెందిన వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువుల మీద సుంకాలను విధించాయి.

గత ఏడాది 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల మీద అమెరికా సుంకాలు విధించగా.. 110 డాలర్ల విలువైన అమెరికా వస్తువుల మీద చైనా సుంకాలు పెంచింది.

అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతుండటం.. గత ఏడాది చివర్లో ప్రపంచ విస్తరణ గణనీయంగా బలహీనపడటానికి ఒక కారణమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2019 ప్రపంచ వృద్ధి అంచనా గణాంకాలను ఐఎంఎఫ్ తగ్గించింది.

‘‘వాణిజ్య సంఘర్షణను సాగదీయటం వల్ల అందరూ నష్టపోతారు’’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతను కాపాడటానికి ‘‘సత్వర పరిష్కారం’’ అవసరమని పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)