కారులో ఏ సీట్లో కూర్చుంటే భద్రత ఎక్కువ?

  • 12 మే 2019
కారులో చిన్నారితో మహిళ Image copyright Getty Images

కారులో అన్నింటికన్నా భద్రమైన సీటు వెనుక సీటేనని చాలా మంది అనుకుంటుంటారు.

అందుకే, తల్లిదండ్రులు చిన్నారులను ఎక్కువగా ఆ సీట్లలో కూర్చోబెడుతుంటారు.

కానీ, వెనుక సీటు మనం అనుకుంటున్నంత భద్రమైనది కాకపోవచ్చని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంటోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వెనుక సీట్ల కోసం కూడా ఎయిర్‌బ్యాగులు ఉండాలని ఐఐహెచ్‌ఎస్ సూచించింది.

వెనుకున్నవారికే తీవ్ర గాయాలు

వెనుక సీట్ల కన్నా ముందు సీట్లపైనే కార్ల తయారీదారులు ఎక్కువగా ద‌ృష్టిపెడుతున్నట్లు అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేప్టీ (ఐఐహెచ్‌ఎస్) అధ్యయనంలో తేలింది.

2000 సంవత్సరం తర్వాత తయారవుతున్న చాలా కార్లు ముందు సీట్లలో కూర్చునేవారికి ఎయిర్‌బ్యాగుల ఏర్పాటుతో వస్తున్నాయి. ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గించేలా సీటు బెల్టులూ వాటిలో ఉంటున్నాయి.

కానీ, చాలా కార్లలో వెనుక సీట్లకు ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదని ఐఐహెచ్ఎస్ పరిశోధకులు అంటున్నారు.

అమెరికాలో 2004 నుంచి 2015 మధ్య వెనుక సీట్లలో కూర్చున్నవారు గాయపడ్డ, మరణించిన కారు ప్రమాదాల సమాచారాన్ని వారు విశ్లేషించారు.

వారు పరిశీలించిన 117 ప్రమాదాల్లో.. సగానికిపైగా ఘటనల్లో వెనుక సీట్లలో కూర్చున్నవారే ముందు సీట్లలో ఉన్నవారి కన్నా తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఎక్కువగా ఛాతీ గాయాలయ్యాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐఐహెచ్ఎస్ విశ్లేషించిన 117 ప్రమాదాల్లోని సగానికిపైగా ఘటనల్లో వెనుక సీట్లలో కూర్చున్నవారే ముందు సీట్లలో ఉన్నవారి కన్నా తీవ్రంగా గాయపడ్డారు.

వెనుక సీట్లకు ఏర్పాటు చేస్తున్న సీటు బెల్ట్‌లు కూడా ప్రభావవంతంగా ఉండట్లేదు. కొన్నిసార్లు అవే గాయాలకు కారణమవుతున్నాయి.

‘‘వెనుక సీట్లలో ఉండేవారిపై సీటు బెల్ట్‌లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముందు సీట్లలో ఉన్నవారు బయటపడుతున్న ప్రమాదాల్లోనూ వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు’’ అని ఐఐహెచ్ఎస్ పేర్కొంది.

ముందు సీట్ల లాగానే వెనుక సీట్లకూ భద్రత ప్రమాణాలను పెంచడంపై తయారీదారులు దృష్టిసారిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ఛాతీ గాయాల ముప్పును తగ్గించాలంటే ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు వీగిపోయేలా ఈ సీటు బెల్ట్‌లకు మార్పులు చేయాలని సూచించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వెనుక సీట్లకు ఏర్పాటు చేస్తున్న సీటు బెల్ట్‌లు కూడా అంత ప్రభావవంతంగా ఉండట్లేదు.

‘వెనుక సీట్లను విస్మరించారు’

ముందు సీట్ల విషయంలో ఎన్నో భద్రత ఏర్పాట్లు రాగా, వెనుక సీట్లు మాత్రం విస్మరణకు గురయ్యాయని రహదారి భద్రత అంశంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ షాన్ కిల్డేర్ అన్నారు.

మరోవైపు ‘ఉబెర్’ లాంటి క్యాబ్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల వెనుక సీట్లలో కూర్చొని ప్రయాణం చేసేవారి సంఖ్య పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్‌ల తరహాలో గాలితో విచ్చుకునే సీటు బెల్ట్‌లు ఉంటే శరీరానికి గాయాలు కాకుండా అడ్డుకునే అవకాశం ఉందని ఐఐహెచ్ఎస్ నివేదిక పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎయిర్ బ్యాగ్‌ల తరహాలో గాలితో విచ్చుకునే సీటు బెల్ట్‌లు కొన్ని కార్లలో ఉంటున్నాయి.

ముందు సీట్ల వెనుక భాగంలో ఎయిర్ బ్యాగ్‌ల సదుపాయం కల్పించడం ద్వారా వెనుక సీట్లలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడొచ్చని అభిప్రాయపడింది.

భవిష్యత్తులో కారు పైభాగం నుంచి ఎయిర్ బ్యాగులు కిందకి వచ్చేలానూ తయారీదారులు ఏర్పాట్లు చేయొచ్చని పేర్కొంది.

వెనుక సీట్ల భద్రతకు సంబంధించిన సమస్యకు త్వరలోనే తయారీదారులు పరిష్కారాలతో ముందుకు రావొచ్చని ఐఐహెచ్ఎస్ అధ్యక్షుడు డేవిడ్ హార్కీ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)