బ్రూనై: ఈ ఇస్లాం దేశంలో రాజు మాటే శాసనం

  • 11 మే 2019
బ్రూనై

వ్యభిచారం, అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలపై కఠినమైన ఇస్లామిక్ శిక్షలను అమలు చేస్తూ బ్రూనై అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది.

అయితే, ఆ దేశంలో నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తుంటుందని బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ పేర్కొన్నారు.

ఆ దేశంలో అడుగుపెట్టగానే మీకు సింగపూర్‌లో ఉన్నామా అని అనిపిస్తుంది. రహదారులు చాలా చక్కగా ఉంటాయి. వేలాది చెట్లతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు. పాదచారులు వెళ్లేలా రహదారుల పక్కన స్థలాన్ని వదిలారు.

పెద్ద గోపురాలతో ఉన్న మసీదులు కనిపిస్తాయి. వాటిపై అరబిక్‌లో పెద్ద పెద్ద సంకేతాలు, గడ్డంతో ఉన్న సుల్తాన్ హస్సనల్ బొకై చిత్రాలు కనిపిస్తాయి. అప్పుడే ఈ దేశం బ్రూనై అని మీకు తెలుస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రూనై సుల్తాన్

పూర్తిస్థాయిలో రాజరిక పాలన కొనసాగుతున్న కొన్ని దేశాల్లో ఇదీ ఒకటి. సుల్తాన్‌కే పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి.

ఆయనే దేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, బ్రూనైలోని ఇస్లామిక్ మత పెద్ద కూడా.

ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఆయన చెప్పిందే చట్టం.

మత పాలన వైపు అడుగులు

1984 వరకు బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న బ్రూనై స్వాతంత్ర్యం వచ్చాక మలయ్ ముస్లిం రాజ్యం అని సుల్తాన్ ప్రకటించారు.

ఇప్పుడు బ్రూనియన్లలో ఈ భావన స్థిరపడింది. ''మలయ్ భాష, సంస్కృతి, ఆచారాలు, రాజరిక వ్యవస్థ అనేవి ఇస్లామిక్ బోధనలు, విలువల సారాంశం. వీటిని అందరూ పాటించాలి'' అని మలయ్ భావనను ప్రభుత్వం వర్ణించింది.

బ్రూనైలో ఉండేవారంతా మలయ్ జాతి వారు కాదు. ఇండోనేసియా సంతతి ముస్లింలు కూడా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కఠినమైన ఇస్లామిక్ సిద్ధాంతాలను ఆచరించే దేశంగా బ్రూనైను తీసుకెళ్లారు.

బ్రూనైపై చక్కటి అవగాహన ఉన్న ఇస్లాం ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియా నిపుణుడు డొమినిక్ ముల్లెర్ బీబీసీతో మాట్లాడుతూ, ''గత మూడు దశాబ్దాల నుంచి సుల్తాన్ మతపాలన వైపు పూర్తిస్థాయిలో వెళ్లిపోతున్నారు. 1987లో మక్కా యాత్ర తర్వాత ఈ పరిస్థితి కనిపిస్తుంది. షరియా చట్టాలను అమలు చేయాలని పదే పదే చెబుతున్నారు.'' అని పేర్కొన్నారు.

బ్రూనైలో ప్రతిపక్షమే లేదు. స్వతంత్ర పౌర సమాజం ఊసే లేదు. 1962లో విధించిన ఎమర్జెన్సీ కిందే ఇంకా ఆ దేశం పాలన నడుస్తోంది. గుమిగూడి మాట్లాడుకోవడం, భావప్రకటన స్వేచ్ఛ పై కఠిన ఆంక్షలు ఉన్నాయి.

మీడియా కూడా స్వేచ్ఛగా పని చేయలేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ మీడియాను మూసివేస్తారు. 2016లో బ్రూనై టైమ్స్‌కు ఇలానే జరిగింది. ఇక్కడ అనేక చట్టాలున్నాయి. 'స్వీపింగ్ సెడిషన్ చట్టం' ముఖ్యమైనది. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ఈ చట్టాన్ని వారిపై ప్రయోగిస్తారు. అందువల్లే జర్నలిస్టులు ఈ దేశాన్ని సందర్శించడం కష్టం.

Image copyright Getty Images

ఇక్కడ ప్రజలు మంచి ఆతిథ్యాన్ని ఇస్తారు. సాయం అందిస్తారు. అయితే, కొత్తగా వచ్చిన షరియా పీనల్ కోడ్ గురించి మాట్లాడమంటే పెదవి విప్పడానికి కూడా నిరాకరిస్తారు. చాలా మంది బీబీసీ బృందాన్ని కలవడానికి కూడా ముందుకురాలేదు.

ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో మేం కొందరు ముస్లింలను కలిశాం. ''లెస్బియన్‌తో మేం సోషల్ మీడియాలో కూడా చాట్ చేయం.'' అని ఒకరు చెప్పారు. బ్రూనై బయట కొందరు గేలను కూడా మేం కలిశాం.

దేశంలో కొత్తగా అమలు చేస్తున్న శిక్షా స్మృతిలో రాళ్లతో కొట్టిచంపడం తదితర కఠినమైన శిక్షలు ఉన్నాయనే విషయాన్ని వారు నమ్మడం లేదు. ఎల్జీబీటీ సమూహానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాలపై బ్రూనియన్లు రెండుగా విడిపోయారు.

దీనిపై ఒక గే మాట్లాడుతూ,'గే అనే విషయం బయటకు తెలియకుండా బ్రూనైలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.ప్రాథమిక మానవ హక్కులను ఎవరూ అణచివేయలేరు' అని పేర్కొన్నారు.

మరో లెస్బియన్ మాత్రం కొత్త చట్టం వల్ల స్వలింగసంపర్కులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు.

''సుల్తాన్ మాటలే చట్టం. ఇప్పుడు స్వలింగ సంపర్కానికి సంబంధించి మరణశిక్ష ఉండదని ఆయన చెబుతున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. బ్రూనియన్లు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.'' అని అన్నారు.

చిత్రం శీర్షిక మలేసియాలోని ఒక బార్

వారాంతాల్లో మలేసియావైపు పరుగులు

బ్రూనైకి సిరిసంపదలు తెచ్చిపెడుతున్న చమురు, గ్యాస్ నిక్షేపాలు మరో రెండు దశాబ్దాల్లో అంతరించిపోవచ్చు.

చమురు రేట్లు తగ్గడంతో గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోటు బడ్జెట్‌తో దేశం నడుస్తోంది. ఆర్థికవృద్ధి పెద్దగా లేదు. ఆగ్నేయాసియాలోనే అత్యంత నిరుద్యోగం ఈ దేశంలోనే కనిపిస్తోంది.

శనివారం రాత్రి రాగానే బ్రూనైకి సరిహద్దుగా ఉన్న మలేసియా వైపు జనసందోహం కనిపించింది. వారాంతాన్ని మద్యం తాగుతూ, పొగ పీల్చుతూ, సంగీతం వింటూ ఆస్వాదించాలని చాలా మంది బ్రూనియన్లు సరిహద్దు వద్ద వేచిచూస్తున్నారు. వారికి తమ దేశంలో ఇవేవి అందుబాటులో లేవు. అందుకే గంటన్నరలో చేరుకునే మలేసియావైపు వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)