ఫిలిప్పీన్స్‌లో వీధి కుక్క పిల్లను కాపాడి రేబిస్‌తో చనిపోయిన నార్వే మహిళ

  • 11 మే 2019
రేబిస్ వ్యాధితో మరణించిన నార్వే మహిళ Image copyright BIRGITTE KALLESTAD
చిత్రం శీర్షిక ఫిలిప్పీన్స్ వెళ్లేవారకి రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరి చేయాలని బిర్జిట్ కుటుంబం నార్వే ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఫిలిప్పీన్స్‌ పర్యటనకు వెళ్లిన ఓ మహిళ.. అక్కడ ఓ వీధిలో ఒంటరిగా ఉన్న కుక్కపిల్లను కాపాడి రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ఆమె కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. బిర్జిట్ కలెస్టాడ్ వయసు 24 ఏళ్లు. సెలవు కోసం స్నేహితులతో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లారు. వీరంతా అక్కడో వీధిలో ఒంటరి కుక్కపిల్లను చూశారు.

ఆ కుక్కపిల్లను కాపాడి తాము బసచేస్తున్న రిసార్టుకు తీసుకువెళ్లారు. అక్కడ బిర్జిట్‌ను ఆ పప్పీ కరిచింది. దాంతో ఆమెకు రేబిస్ వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు.

నార్వే తిరిగి వచ్చిన వెంటనే ఆమె జబ్బుపడ్డారు. తాను పనిచేసే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.

Image copyright Getty Images

నార్వేలో చివరిసారి రేబిస్ సంబంధిత మరణం సంభవించి 200 సంవత్సరాలకు పైనే గడిచిపోయింది. ఆ తర్వాత ఇదే మొదటి మరణం.

బిర్జిట్ ఆ కుక్కపిల్లతో ఆడుకుంటున్నపుడు తన శరీరం మీద అయిన కుక్కపిల్ల పళ్ల గాట్లను కడిగి మందు వేశారు కానీ వైద్యచికిత్స కోసం వెళ్లలేదు.

ఆమె నార్వే తిరిగి వచ్చిన తర్వాత ఆస్పత్రిలో అత్యవసర విభాగానికి చాలా సార్లు వెళ్లారు. కానీ.. ఆమెకు వచ్చిన జబ్బు ఏమిటనేది డాక్టర్లు సకాలంలో గుర్తించలేకపోయారు.

రేబిస్ వ్యాధిని చికిత్సతో నయం చేయవచ్చు. కానీ చికిత్స అందించకపోతే మనిషి మెదడుకు, నాడీ వ్యవస్థకు సోకి ప్రాణాంతకంగా మారగలదు.

ఈ వ్యాధి ప్రతి ఏటా వేలాది మందిని బలితీసుకుంటోంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల్లో అధికంగా ఉంది. దాదాపు 150 దేశాల్లో ఈ వ్యాధి ప్రబలంగా ఉందని.. ఇదో పెద్ద ఆరోగ్య సమస్య అని నిపుణులు చెప్తున్నారు.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్‌లో రేబిస్ వైరస్

రేబిస్ వ్యాధి ఏమిటి?

  • మొదట ఆందోళన, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి
  • వ్యాధి ముదిరేకొద్దీ భ్రాంతికి లోనుకావటం, శ్వాస సమస్యలు రావచ్చు
  • రోగి మింగడానికి ఉపయోగించే కండరాలు బిగుసుకుపోవటం వల్ల ద్రవాలు తాగటం కష్టమవుతుంది
  • రేబిస్ సోకటానికి, రోగం లక్షణాలు కనిపించటానికి మధ్య మూడు వారాల నుంచి 12 వారాల వరకూ సమయం పట్టవచ్చు
  • ఏదైనా జంతువు మిమ్మల్ని కరిచినా, గోకినా, నాకినా.. శరీరం మీద ఆ గాయాన్ని, ప్రాంతాన్ని చాలా నీరు, సబ్బు ఉపయోగించి శుభ్రంగా కడగటంతో పాటు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి
  • ఒకసారి రేబిస్ వ్యాధి లక్షణాలు ముదిరిపోతే అది దాదాపు ప్రాణాంతకమవుతుంది
  • లక్షణాలు ముదరకముందు రేబిస్‌కు వాక్సిన్ ద్వారా చికిత్స చేయవచ్చు. ఏదైనా జంతువు కరిచిన వెంటనే ఈ వ్యాక్సిన్ ఇస్తే అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవసరమైతే వ్యాక్సిన్‌తో పాటు రేబిస్‌ ఇమ్యునోగ్లోబులిన్ కూడా వాడతారు.
  • ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 1.5 కోట్ల మందికి పైగా జంతువు కరిచిన తర్వాత వాక్సిన్ తీసుకుంటున్నారు. ఇది వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. అయితే అవసరమైన వారికి సమర్థవంతమైన చికిత్స తక్షణమే అందుబాటులో ఉండటం లేదు.

(ఆధారం: పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ / ప్రపంచ ఆరోగ్య సంస్థ )

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)