అమ్మలు లేని ఊళ్లు: 'అమ్మా నిన్ను చూసి తొమ్మిదేళ్లవుతోంది, ఒకసారి వస్తావా...'

  • 12 మే 2019
అమ్మాయి, యువతి, ఇండోనేషియా
చిత్రం శీర్షిక ఫాతిమా

పేదరికం... ఎంతో మంది పిల్లలకు మాతృప్రేమను దూరం చేస్తోంది. పిల్లలను ఊహ తెలియని వయసులో పెద్దవాళ్ల దగ్గర వదిలేసి తల్లులు బతుకుదెరువు కోసం విదేశాలకు వలసవెళ్తున్నారు. ఏళ్లు గడిచినా తమ బిడ్డల ముఖం చూడటంలేదు. ఇది తూర్పు ఇండోనేషియా ప్రాంతంలోని గ్రామాల్లో పరిస్థితి.

దాదాపు ఇక్కడి మహిళలందరూ పనుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. దాంతో, చాలా ఇళ్లలో పిల్లలు, పురుషులు, వృద్ధులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. అందుకే ఈ గ్రామాలను ఇండోనేషియన్లు "అమ్మలు లేని ఊళ్ళు" అంటారు.

తల్లి ప్రేమకు దూరంగా గడుపుతున్న ఇక్కడి పిల్లలతో బీబీసీ ప్రతినిధి రెబెక్కా హెన్సెకె మాట్లాడారు.

చిత్రం శీర్షిక ఇలీ సుసియావటి

వనసబా గ్రామానికి చెందిన యువతి పేరు ఇలీ సుసియావటి. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం ఆమెను తన అమ్మమ్మ దగ్గర వదిలేసి తల్లి ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి ఇళ్లల్లో పనులు చేస్తున్నారు.

ఇప్పటికీ ఆమె తిరిగి రాలేదు. తండ్రి కూడా దూరంగా ఉంటున్నారు.

"చదువుకుంటున్నాను. ఎప్పుడూ మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉంటాను. అమ్మను చూడాలనిపిస్తోంది. తను మా దగ్గర ఉంటే బాగుండేది. ఇంకా మూడేళ్ల తర్వాత వస్తానంటోంది" అని ఇలీ దీనంగా చెప్పారు.

చిత్రం శీర్షిక కరీమాతుల్‌కు ఏడాది వయసు ఉన్నప్పుడే వాళ్ల అమ్మ విదేశాలకు వలస వెళ్లిపోయారు.

కరీమాతుల్ అడీబియా అనే మరో బాలిక పరిస్థితి కూడా అలాంటిదే. కరీమాకు ఏడాది వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి విదేశాలకు వలసవెళ్లారు. దాంతో, తల్లి ఎవరన్నది ఈ బాలికకు గుర్తుకులేదు.

"నన్ను ఆంటీ దగ్గర వదిలేసి మా అమ్మ వెళ్లిపోయింది. ఆంటీ వాళ్ల ఇంట్లోనే పెరిగాను. నేను అయిదో తరగతి పూర్తి చేసేంత వరకూ అమ్మ రాలేదు. కనీసం తన ఫొటో కూడా మా దగ్గర లేదు. దాంతో, పదేళ్ల తర్వాత అమ్మ వస్తే తను ఎవరో గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు అమ్మ బోరున ఏడ్చింది" అని కరీమాతుల్ గుర్తు చేసుకున్నారు.

ఇక్కడి గ్రామాల్లో ఏ ఇంటి తలుపు తట్టినా ఇలాంటి గాథలే వినిపిస్తాయి.

ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. ఇతర పనులు దొరకడంలేదు. దాంతో, చాలామంది విదేశాలకు వెళ్లి ఇళ్ళల్లో, చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.

విదేశాల్లో పనిచేస్తున్న ఇండోనేషియా కార్మికుల్లో మూడింట రెండొంతులకు పైగా మహిళలే ఉన్నారు. ఒకవైపు పిల్లలకు మాతృ ప్రేమ దూరమవుతోందన్న బాధ, మరోవైపు వలస వెళ్లకుంటే ఇల్లు గడవదన్న బాధ ఇక్కడి ప్రజలది.

తమలా తమ బిడ్డల భవిష్యత్తు ఉండకూదన్న ఆలోచనతో చాలామంది మహిళలు విదేశాల్లో ఉంటూ సొంతూళ్లలో బిడ్డలను చదివించుకుంటున్నారు.

"మా అమ్మ సౌదీ నుంచి డబ్బులు పంపిస్తుంది. ఆ డబ్బుతోనే నేను చదువుకోగలుగుతున్నాను. అమ్మ అక్కడికి వెళ్లకపోతే నన్ను చదవించే ఆర్థిక స్తోమత మా కుటుంబానికి ఉండేది కాదు. మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. తను మానసికంగా చాలా ధృడంగా ఉంటారు" అని ఇలీ అంటున్నారు.

చిత్రం శీర్షిక తల్లి ప్రేమకు దూరంగా ఉంటున్న పిల్లలు మానసికంగా ఎంతో వేదన ఎదుర్కొంటున్నారు.

"కొన్నాళ్లుగా రోజూ వాట్సాప్‌లో అమ్మతో మాట్లాడుతున్నాను. ముఖాముఖిగా మాత్రం తొమ్మిదేళ్లుగా కలవలేదు. అమ్మా.. కొన్ని రోజులు సెలవులు తీసుకుని ఇంటికి రావొచ్చుగా.. అని ఎప్పుడూ అడుగుతుంటాను. అమ్మకు నా బాధ తెలుసు. కానీ, ఆమెకు కుదరడంలేదట" అని ఇలీ చెప్పారు.

సౌదీలో ఉన్న ఇలీ తల్లి మార్టియాతోనూ మేము మాట్లాడాం.

తన బిడ్డను, కుటుంబాన్ని చూసుకోవాలని ఎంతగా ఉన్నా, ఆర్థిక పరిస్థితుల కారణంగా దూరంగా ఉండాల్సి వస్తోందని మార్టియా అన్నారు.

"భవిష్యత్తులో నా బిడ్డ నాలాంటి కష్టాలు పడకూడదు. తను బాగా చదువుకుంటున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. తను డిగ్రీ పూర్తి చేసేలోగా ఇంటికి వస్తా (అంటే మరో మూడేళ్లకు)" అని ఆమె చెప్పారు.

1980ల నుంచి ఇండోనేషియా నుంచి మహిళల వలసలు ప్రారంభమయ్యాయి. అయితే, న్యాయపరమైన భద్రత లేకపోవడంతో వారు విదేశాల్లో ఎక్కువగా వేధింపులకు గురవుతుంటారు. యజమానులు వేధింపులకు పాల్పడిన ఘటనలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి.

చిత్రం శీర్షిక ఇలీ

కొందరు మహిళలు బలవంతపు శృంగారం, అక్రమ సంబంధాల కారణంగా తమకు జన్మించిన పిల్లలను తీసుకుని సొంతూరికి వస్తుంటారు. అలా వచ్చిన చిన్నారులు ఇక్కడి గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి బాధితుల్లో 18 ఏళ్ల ఫాతిమా ఒకరు. ఆమె తల్లిది ఇండోనేషియా, తండ్రిది సౌదీ అరేబియా.

ఆమె తల్లితో పాటు ఇండోనేషియా వచ్చి ఉంటున్నారు. తండ్రి సౌదీ నుంచి డబ్బులు పంపిస్తుండేవారు. కానీ, ఇటీవలే ఆయన మరణించారు. దాంతో, ఆర్థిక భరోసా లేక వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

విదేశాల్లో యజమానులు భౌతిక దాడులకు పాల్పడినా చాలామంది మహిళలు మౌనంగా భరిస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసవెళ్లిన వారి పిల్లలు మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: ‘బీజేపీలో టీడీపీ ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్’

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు