‘ఆమెతో సెక్స్ అంటే ఓ కొట్లాట... ఆమె ఒంటి మీది దుస్తులన్నీ చింపేసేవాడ్ని’

  • 14 మే 2019
మోసెస్, అతడి భార్య జూలియెన్ Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక మోసెస్ తన భార్యను విపరీతంగా కొట్టేవాడు.. ఆమె గర్భంతో ఉన్నపుడు కూడా

ప్రపంచంలో లైంగిక హింస తీవ్రంగా ఉన్న దేశాల్లో డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఒకటి. అయితే, పురుషులు తమ పురుషాధిక్యతను, శారీరక బలాన్ని ప్రదర్శించే తీరును వారే ప్రశ్నించేలా, వారు దాని నుంచి బయటపడేలా చేసేందుకు ఒక ప్రయత్నం జరుగుతోంది. అలాంటి ప్రవర్తన తప్పని వారే తెలుసుకునేలా చేయడమే దీనికి సరైన పరిష్కారమని భావిస్తున్నారు.

అలా తన నడవడిక గురించి చింతిస్తున్న వ్యక్తులలో ఒకరు మోసెస్ బాగ్విజా. ఆయన తన భార్య జూలియెన్‌తో తాను ఎలా వ్యవహరించానో, ఆమెపై ఎలా అత్యాచారం చేశానో గుర్తుచేసుకున్నపుడు.. ఆ వివరాలు చాలా వేదన కలిగిస్తాయి.

''ఆమెతో సెక్స్ అంటే ఓ కొట్లాటలా ఉండేది. ఆమె ఏం తొడుక్కుని ఉందనేది పట్టించుకునే వాడిని కాదు. ఒంటి మీద దుస్తులన్నీ చించేసేవాడిని'' అని చెప్తాడు.

తూర్పు డీఆర్ కాంగోలోని రుత్షురు అనే ఓ చిన్న గ్రామంలో ఒక మోస్తరు బంగళాలో, తన భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉన్నపుడు ఆమెపై చేసిన దాడిని మోసెస్ గుర్తుచేసుకున్నాడు.

''నేను వెనక్కు తిరిగి ఆమె పొట్ట మీద కాలితో చిన్నగా తన్నాను. ఆమె నేల మీద పడిపోయింది.. రక్తమోడుతూ. పొరుగు వారు పరుగున వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు'' అని చెప్పాడు.

ఆమె చేసిన నేరం? ఇంటి ఖర్చుల కోసం స్థానిక మహిళల బృందంతో కలిసి రహస్యంగా కొంత డబ్బులు దాస్తుండటం.

అతడు కొత్త బూట్లు కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వటానికి ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై అతడు దాడిచేశాడు.

''నిజమే, ఆ డబ్బులు ఆమెవే. కానీ మీకు తెలుసు. ఈ రోజుల్లో ఆడవాళ్ల దగ్గర డబ్బులు ఉంటే వాళ్లు తమను తాము బలవంతులుగా భావిస్తారు. అలాగే ప్రవర్తిస్తారు'' అంటాడు మోసెస్.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక తన భర్త కోపంగా ఉన్నపుడు కొట్లాట లేకుండా సెక్స్ ఉండేది కాదని జూలియన్ చెప్పారు

పురుషత్వం గురించి సంప్రదాయ ఆలోచనలు

ఆధునిక ఆఫ్రికా సమాజంలో పురుషుల ఆధిక్యం తగ్గిపోతోందనే అభిప్రాయం వారి హృదయాల్లో బలంగా ఉండటమే ఈ క్రోధభావనకు కారణమని కొందరు భావిస్తున్నారు.

శతాబ్దాల పాటు మగాడు అంటే ఎలా ఉండాలనేది విస్పష్టంగా నిర్దేశించే ఆలోచనలతో పురుషులను పెంచారు. బలంగా ఉండటం, భావోద్వేగాలను అణచుకోవటం, కుటుంబాన్ని రక్షించుకోగలగటం, పోషించుకోగలగటం వంటివి అవి.

అయితే, స్త్రీ, పురుషుల పాత్రలు మారుతుండటం, మహిళా సాధికారత పెరుగుతుండటం, దానికి తోడు పురుష నిరుద్యోగిత స్థాయిలు పెరుగుతున్న పరిణామాలు.. పురుషత్వానికి సంబంధించిన ఈ సంప్రదాయ ఆలోచనలను ఆచరించటంలో పురుషుల సామర్థ్యాలను దెబ్బతీస్తున్నాయి.

మోసెస్ వంటి కొందరు పురుషులకు.. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న మహిళ తమ పురుషాధిక్య ఆలోచనలకు, ఆ రకమైన మనుగడకు ఓ ముప్పుగా పరిణమించారు. దీంతో, వీరు సంక్షోభంలో పడిపోయారు.

స్థానిక గ్రామంలో బిల్డర్‌గా పనిచేస్తున్న మోసెస్.. తన భార్యతో మాట్లాడటానికి హింస ఒక్కటే మార్గమని తనకు అనిపించిందని చెప్తాడు.

''ఆమె నాకు చెందినదని నేను అనుకున్నాను. ఆమెను నేను ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చునని అనుకున్నాను. నేను ఇంటికి వచ్చినపుడు ఆమె నన్ను ఏదైనా అడిగితే ఆమె మొఖం మీద బలంగా గుద్దేవాడిని'' అని వివరించాడు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక తన భార్య జూలియన్ తన సొంతమని అనుకునేవాడినని, ఆమెను తాను ఏమైనా చేయవచ్చునని తాను భావించేవాడినని మోసెస్ చెప్పాడు

పురుషత్వ 'వైఫల్యా'నికి పరిహారం

మోసెస్ కేసు ఏదో చాలా అరుదైనది కాదు. ప్రపంచంలో మహిళలపై అత్యాచారాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో డిఆర్ కాంగో ఒకటి. ఈ దేశంలో ప్రతి గంటలో 48 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హల్త్ జర్నల్ నిర్వహించిన అధ్యయనం చెప్తోంది.

అయితే.. దేశంలోని తూర్పు ప్రాంతంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ ఈ అత్యాచారాల సంక్షోభానికి కారణమని చాలా మంది నిపుణుల విశ్లేషణలు ఆపాదిస్తున్నాయి. అక్కడ ప్రత్యర్థులైన సాయుధ బృందాలు సామూహిక అత్యాచారాలు, లైంగిక బానిసలను యుద్ధంలో ఆయుధంగా ఉపయోగిస్తుంటాయి.

కానీ, డీఆర్ కాంగోలో అత్యాచారాలకు మూల కారణం ఇంకా లోతైనదని.. గోమా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కాంగో మెన్స్ నెట్‌వర్క్ (కోమెన్) సహ వ్యవస్థాపకుడు ఇలాట్ అల్ఫోన్స్ పేర్కొన్నారు.

''బాలికలను మన పాలితులుగా వ్యవహరించే విధానం మనకు వారసత్వంగా వచ్చింది. సెక్స్ హక్కు తమకు ఎల్లవేళలా ఉంటుందని పురుషులు నమ్ముతారు. లైంగిక హింసకు కారణం.. కాంగోలీస్ పురుషులు తమకు ఉండాలని నిరంతరం కోరుకునే అధికారం, హోదాకు సంబంధించినది'' అని ఆయన వివరించారు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక కాంగో మెన్స్ నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకుడు ఇలట్ అల్ఫోన్స్ కూడా తనకు సైతం విషపూరిత పురుషత్వ అనుభవాలున్నాయని చెప్పారు

చర్చల్లో మహిళలకు చోటు కల్పించటం

దక్షిణాఫ్రికాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ జస్టిస్ అండ్ రికన్సీలియేషన్ (ఐజేఆర్) ప్రాజెక్ట్ ఆఫీసర్ డానియెల్ హాఫ్‌మీస్టర్ దీనితో ఏకీభవిస్తున్నారు.

పురుషులు చిన్న వయసులో.. అంటే బాలురుగా ఉన్నపుడు వారి సామాజీకరణ ఎలా జరిగిందనే దానితోను, సంప్రదాయ ఆఫ్రికా మగతనపు ఖచ్చితమైన నిబంధనలకు అనుగుణంగా జీవించటంలో వారి వైఫల్యంతోను - లింగ ప్రాతిపదికగా జరిగే హింసకు నేరుగా సంబంధం ఉందని ఆమె విశ్వసిస్తారు.

''కుటుంబాన్ని పోషించటం అనేది మగతనానికి ఒక బలమైన చిహ్నం. తమ కుటుంబాలను పోషించలేకపోవటం, మద్దతునివ్వలేకపోవటం అనేది.. మగతనంలో తమ ఈ 'వైఫల్యా'న్ని పురుషులు తరచుగా హింసాత్మక పద్ధతుల్లో పూరించుకోవటానికి చేసుకుంటున్నారు'' అని ఆమె విశ్లేషించారు.

పురుషుడు కేవలం హింసకు పాల్పడేవాడు మాత్రమే కాదని.. ఆ హింస బాధితుడు కూడా అని అల్ఫోన్స్ అంటారు. ''స్కూల్‌లో మమ్మల్ని కొట్టారు. ఇంట్లో మమ్మల్ని కొట్టారు. గ్రామంలో మేం కొట్లాట కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్లం'' అని ఆయన చెప్పారు.

అలా హింసను తాను అలవరచుకున్నానని.. అది తర్వాత తన సంభాషణ పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. ''కొన్నిసార్లు నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను కొడతాను. క్షమాపణ చెప్పాల్సింది ఆమే. మేం చిన్న పిల్లలుగా ఉన్నపుడు ఒకసారి నా సోదరితో నేను కొట్లాడటం, ఆమె పైకి నేను కత్తి విసరటం నాకు గుర్తుంది'' అని వివరించారు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక తూర్పు డీఆర్ కాంగోలో తమ సమావేశాలకు హాజరవటం పెరుగుతోందని కాంగో మెన్స్ నెట్‌వర్క్ చెప్తోంది

ఆఫ్రికాలోని ప్రభావిత ప్రాంతాల్లో అత్యాచార వ్యతిరేక కార్యక్రమాలు ప్రధానంగా మహిళల మీద దృష్టి కేంద్రీకరించాయి. అందులోనూ అత్యాచార బాధితులే కేంద్రబిందువుగా ఆ కార్యక్రమాలు ఉండేవి. అయితే.. ఈ దాడులకు పాల్పడే పురుషులను విస్మరించాయి.

ఈ కార్యక్రమాలు లైంగిక హింస లక్షణాలను పరిష్కరించటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాయి తప్ప.. దాని మూల కారణాన్ని పరిష్కరించటానికి కాదని అల్ఫోన్స్ అంటారు.

''లింగ ప్రాతిపదికగా జరుగుతున్న హింస మీద మనం పోరాడుతున్నాం. అది జరగాలంటే.. ఆ సమస్యలో భాగంగా ఉన్న పురుషులను, బాలురను కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. సమాజంలో వారికి ప్రాబల్యం ఉంటుంది కనుక పరిస్థితులను మార్చే వీలు వారికి కూడా ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఆయన, ఆయన సహచరులు అదే పని చేస్తున్నారు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక పురుషత్వం మీద పురుషుల వైఖరిని తిరగరాయటం లక్ష్యంగా ఈ బృందం చర్చలు జరుగుతాయి

బారాజా బాదిలికా అనే ఒక వేదికను వీరు నిర్మించారు. సమాజంలో తీవ్రంగా ఉన్న సమస్యలను పరిష్కరించటానికి పురుషులు కలిసే ప్రాచీన సమావేశానికి.. బాలురు పురుషులుగా మారే పాతకాలపు సమావేశాలకు.. ఆధునిక రూపం ఇది.

వరుస ఘర్షణలతో గ్రామాలు దగ్ధమై, జీవితాలు ధ్వంసమైపోతుండటంతో ఈ పాతకాలపు సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టకుపోయాయని.. దీంతో యువకులకు మార్గదర్శకులైన పురుషులు లేకుండాపోయారని అల్ఫోన్స్ పేర్కొన్నారు.

అయితే.. సంప్రదాయ బారాజా బాదిలికా (అంటే మార్పు వలయం అని అర్థం చెప్పొచ్చు)కు కేవలం పురుషులు మాత్రమే హాజరయ్యేవారు. ఈ 21వ శతాబ్దపు నవీన బారాజా బాదిలికాలో మహిళలకు ప్రధానమైన నాయకత్వ పాత్ర ఇస్తున్నారు.

''ఈ స్థానాన్ని మహిళలు ఆక్రమించాల్సిన సమయం నిజంగా ఆసన్నమైంది'' అని అల్ఫోన్స్ అంటారు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక కాంగో మెన్స్ నెట్‌వర్క్ సమావేశాలకు మోసెస్ క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు

'భర్తలు మారుతున్నారు'

లింగ సమానత్వం గురించి, పితృత్వం గురించి, సానుకూల పురుషత్వం గురించి తెలుసుకోవటానికి.. ప్రతి వారం రెండు గంటల పాటు జరిగే బారాజాలో దాదాపు 20 మంది పురుషులు సమావేశమవుతున్నారు.

ఈ వర్క్‌షాపులను ఒక పురుష, ఒక మహిళా సమన్వయకర్తలు పర్యవేక్షిస్తారు. లైంగిక హింస దాడులకు పాల్పడే పురుషుల ''మెదళ్లును మార్చివేయటానికి'' వీడియో ఫిల్మ్‌లు, వర్ణచిత్ర పుస్తకాలు, సైకోడ్రామా కార్యక్రమాలను ఉపయోగిస్తున్నారు.

ఈ వర్క్‌షాపులకు హాజరైన తర్వాత తమ భర్తలు మారారని చాలా మంది మహిళలు తనకు చెప్పినట్లు అల్ఫోన్స్ తెలిపారు.

''ఇమామ్ దగ్గరకు, పాస్టర్ల దగ్గరకు, సంప్రదాయ పెద్దల దగ్గరకు వెళ్లాం కానీ అతడు మారలేదు. అతడిని పలుమార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా మారలేదు. కానీ అకస్మాత్తుగా అతడు హింసను విడిచిపెట్టటం.. ఇంటికి టైమ్‌కి రావటం చూస్తున్నాం' అని వాళ్లు చెప్తున్నారు'' అని ఆయన వివరించారు.

Image copyright Fiona Lloyd-Davies/BBC
చిత్రం శీర్షిక కాంగో మెన్స్ నెట్‌వర్క్ సమావేశంలో ఒక సమన్వయకర్త చర్చకు సారథ్యం వహిస్తాడు

మోసెస్ కూడా తన గర్భిణి భార్యను కొట్టినప్పటికి, ఇప్పటికి చాలా మారాడు.

''అది నూరు శాతం కాదు. మేం మనుషులం. కానీ చాలా విషయాలు నాటకీయంగా మారిపోయాయి. ఇప్పుడు మేం సక్రమంగా మాట్లాడుకుంటున్నాం. మా లైంగిక సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి'' అని అతడు చెప్పాడు.

ఈ సానుకూల పురుషత్వం అనే తన సిద్ధాంతంతో డిఆర్ కాంగోలోని ప్రతి పురుషుడినీ చేరుకోవాలని అల్ఫోన్స్ దృఢనిర్ణయంతో ఉన్నారు.

''ఈ దేశంలో అన్ని రకాల హింసా సమసిపోయేలా చేయాలన్నది మా కల. పురుషులు, మహిళలు, బాలురు, బాలికలు అందరూ నివసించగల దేశంగా మారాలన్నది మా ఆకాంక్ష.'' అంటారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)