డేటింగ్ యాప్ నుంచి అధునాతన కార్ల వరకు అన్నీ కెనడాలోనే ఎందుకు పరీక్షిస్తారు?

  • 14 మే 2019
మొబైల్ ఫోన్లు Image copyright Getty Images

సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా తన సాఫ్ట్‌వేర్‌లో ఒక కీలకమైన మార్పు చేసింది. అయితే, ఆ మార్పు తొలుత కెనడాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఆ మార్పు అమలులోకి వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలకు, వీడియోలకు ఎన్ని లైకులు వచ్చాయన్నది వాటిని అప్‌లోడ్ చేసినవారికి మాత్రమే కనిపిస్తుంది. మరెవరికీ కనిపించదని ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ తెలిపింది.

పోస్టులకు ఎన్ని లైకులు వస్తున్నాయన్న దానిపై కాకుండా, ఎంత విలువైన సమాచారాన్ని పోస్టు చేస్తున్నామన్న దానిపై వినియోగదారులు దృష్టి పెట్టేలా చూసేందుకు ఈ మార్పు చేశామని ఆ సంస్థ వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర అమెరికాలోని పెద్ద నగరాల్లో టొరంటో ఒకటి

కెనడా ప్రజలు సోషల్ మీడియా, టెక్నాలజీ వాడకంలో చాలా ముందుంటారని, ఇక్కడ తమ యాప్‌ను ప్రతి నెలా 2.4 కోట్ల మంది వినియోగిస్తున్నారని ఫేస్‌బుక్ చెబుతోంది. ఫేస్‌బుక్ తన కొత్త అప్లికేషన్లను మొదటిసారి కెనడాలోనే పరీక్షించడం ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ అనేక సార్లు ఇలా చేసింది.

గతేడాది 'ఫేస్‌బుక్ డేటింగ్' పేరుతో తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ను కొలంబియా, థాయ్‌లాండ్‌తో పాటు కెనడాలో పరీక్షించింది.

Image copyright COURTESY FACEBOOK

కెనడాలోనే ఎందుకు?

ఫేస్‌బుక్ మాత్రమే కాదు, చాలా టెక్నాలజీ సంస్థలు కెనడాను ప్రయోగాలకు క్షేత్రంగా వినియోగిస్తున్నాయి. తమ కొత్త యాప్‌లను ముందుగా కెనడాలో పరీక్షించి తర్వాతే విస్తృత మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.

చాలా దేశాలతో పోల్చితే కెనడాలో ఇంటర్నెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ వినియోగదారుల సంఖ్య మరీ తక్కువా లేదు, ఎక్కువా లేదు. దాంతో, తమ యాప్‌లను పరీక్షించి, వినియోగదారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం ఇక్కడ సులువవుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

"కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్న ఒక అప్లికేషన్ నుంచి వినియోగదారుల ఏం ఆశిస్తున్నారు? మనం ఏం అందిస్తున్నాం? ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి? అన్నది తెలుసుకోవడం అత్యంత కీలకం. వినియోగదారుల నుంచి సలహాలు తీసుకునేందుకు కెనడా అత్యంత అనుకూలమైన దేశం" అని టొరంటోకు చెందిన బ్రాండ్‌స్పార్క్ అనే మార్కెట్ అధ్యయన సంస్థ నిర్వాహకుడు రాబర్ట్ లెవీ వివరించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక పానసోనిక్ సంస్థ తన కొత్త ఉత్పత్తులను కెనడాలో పరీక్షిస్తుంది.

200 భాషలు

"కెనడాలో విభిన్నమైన నేపథ్యాలు కలిగిన వారు, భాషలు మాట్లాడేవారు ఉన్నారు. దేశవ్యాప్తంగా 200కు పైగా భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వారిలో అనేక దేశాలకు చెందిన వారు ఉంటారు. టెక్నాలజీ సంస్థలు ఈ దేశాన్ని పరీక్షల కోసం ఎంచుకోవడానికి ఈ అంశాలే ప్రధాన కారణం" అని ఎన్విరానిక్స్ అనలిటిక్స్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి డానీ హూమాన్ చెప్పారు.

అంతర్జాతీయ సంస్థలు కొత్త ఉత్పత్తులతో పాటు, పాతవాటిలో మార్పులను పరీక్షించేందుకు కెనడా అత్యంత అనుకూలమైన దేశంగా ఉందని పానసోనిక్ కెనడా అధ్యక్షుడు మైఖేల్ మోస్కోవిట్జ్ అన్నారు. కొన్ని సంస్థలు మాత్రం దీనిని చిన్న దేశంగా పరిగణిస్తున్నాయని చెప్పారు.

Image copyright NURPHOTO
చిత్రం శీర్షిక ఇక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులను కార్లు తట్టుకోవాల్సి ఉంటుంది

టెక్నాలజీ సంస్థలే కాదు, ఆటోమొబైల్, ఏరోస్పేస్ లాంటి భారీ సంస్థలు కూడా కెనడాలో పరీక్షలు నిర్వహిస్తుంటాయి.

టయోటా, హుందాయి, జీఎం (జనరల్ మోటార్స్) తమ వాహనాలను స్వీడన్, రష్యా, చైనా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇక్కడ కూడా పరీక్షించాయి. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో ఉండే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తమ వాహనాలు తట్టుకుంటున్నాయా.. లేదా? అనేది పరిశీలించేందుకు సంస్థలు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)