మెరియానా ట్రెంచ్‌ అన్వేషణ: మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు

  • 15 మే 2019
మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright TAMARA STUBBS
చిత్రం శీర్షిక తాజా డైవ్‌తో ప్రపంచ రికార్డు(10,927 మీటర్లు) సాధించిన విక్టర్

మహా సముద్రంలో అత్యంత అడుగుకు చేరి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఒక అమెరికా సముద్ర అన్వేషకుడు అక్కడ తన కంటే ముందే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

విక్టర్ వెస్కోవో పసిఫిక్ మహా సముద్రంలో 11 కిలోమీటర్ల అడుగున అత్యంత లోతైన ప్రాంతం అయిన మెరియానా ట్రెంచ్ దగ్గరకు చేరుకున్నారు.

సముద్రంలో అంత లోతులో ఉండే ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించిన మినీ జలాంతర్గామిలో ఆయన నాలుగు గంటలపాటు ట్రెంచ్ అడుగున అన్వేషించారు.

సముద్రం అడుగున సముద్ర జీవులే కాదు, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, చాక్లెట్ రేపర్లు కూడా ఆయనకు కనిపించాయి.

ఒక మనిషి మహా సముద్రంలో అత్యంత లోతుకు చేరుకోవడం ఇది మూడోసారి.

మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright ATLANTIC PRODUCTIONS FOR DISCOVERY CHANNEL
చిత్రం శీర్షిక నాలుగు కొత్త చేప జాతులను కనుగొన్న శాస్త్రవేత్తలు

ఆయనను సముద్రం లోతుకు చేర్చిన జలాంతర్గామి పేరు డీఎస్‌వీ లిమిటింగ్ ఫ్యాక్టర్. దీని పొడవు 4.6 మీటర్లు, ఎత్తు 3.7 మీటర్లు.

ఇద్దరు కూర్చోగల దీని బాడీని 9 సెంటీమీటర్ల మందం ఉన్న టైటానియంతో చేశారు.

సముద్రం అడుగున అంత లోతులో వెయ్యి బార్ల ఒత్తిడి ఉంటుంది. అది ఒక మనిషి తలపై 50 విమానాలను ఒకదానిపైన ఒకటి పేర్చితే ఉండే ఒత్తిడికి సమానం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమహా సముద్రం అట్టడుగున ప్లాస్టిక్ సంచి

1960లో బాతీస్కాఫీ ట్రియెస్టే అనే జలాంతర్గామిలో అమెరికా నౌకాదళ లెఫ్టినెంట్ డాన్ వాల్ష్, స్విస్ ఇంజనీర్ జాక్వస్ పిక్కార్డ్ మొట్టమొదటిసారి మెరియానా ట్రెంచ్ అడుగుకు చేరారు.

అర్థ శతాబ్దం తర్వాత 2012లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తన జలాంతర్గామిలో ఒంటరిగా దీనిలోకి దిగారు.

మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright REEVE JOLLIFFE
చిత్రం శీర్షిక విక్టర్ వెస్కోవో(కుడి)కు 1960లో మెరియానా ట్రెంచ్‌లో డైవ్ చేసిన డాన్ వాల్ష్(ఎడమ) అభినందనలు

విక్టర్ ఇప్పుడు మెరియానా ట్రెంచ్‌లో సముద్ర మట్టానికి 10,927 మీటర్లు (35,849 అడుగులు) అడుగుకు చేరుకున్నారు. అంతకు ముందు కంటే 11 మీటర్లు లోతులోకి వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించారు.

రికార్డు సాధించినందుకు ఉద్వేగంగా ఉందని, ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేనని వెస్కోవో చెప్పారు.

ఈ రికార్డు ప్రయత్నంలో విక్టర్, ఆయన టీమ్ అక్కడ నాలుగు కొత్త చేప జాతులను కూడా గుర్తించింది.

మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright ATLANTIC PRODUCTIONS FOR DISCOVERY CHANNEL
చిత్రం శీర్షిక మహా సముద్రం అడుగున నాలుగు గంటల పాటు విక్టర్ అన్వేషణ

అంత లోతులో కూడా ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించడం పర్యావరణంపై మానవాళి ప్రభావం ఏ స్థాయికి పెరిగిందనేది స్పష్టం చేస్తోంది.

ఇంతకు ముందు అంత లోతులో ఇలాంటి వాటిని అన్వేషకులు ఎప్పుడూ గుర్తించలేదు.

ప్రతి ఏటా మిలియన్ టన్నుల ప్లాస్టిక్.. మహా సముద్రాల్లో కలుస్తోంది. కానీ అదంతా ఎక్కడికి చేరుతోంది అనేది తెలిసింది చాలా తక్కువ.

సముద్రాల్లో ప్లాస్టిక్ అంతకంతకూ విస్తరిస్తుండడంతో సముద్రంలోని జీవులకు ముప్పు తెచ్చిపెడుతోందని ఇటీవల అధ్యయనం గుర్తించింది.

మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright REEVE JOLLIFFE
చిత్రం శీర్షిక 'డీఎస్‌వీ లిమిటింగ్ ఫాక్టర్' జలాంతర్గామిని అమెరికా సంస్థ ట్రిటాన్ సబ్‌మెరైన్స్ తయారు చేసింది

సముద్రాల్లో ఉన్న జీవులను సేకరించి, వాటిలోపల మైక్రో ప్లాస్టిక్ చేరిందోమో పరీక్షించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రపంచంలోని ఐదు మహా సముద్రాల్లో అత్యంత లోతుల్లోకి చేరే ప్రయత్నంలో విక్టర్ డైవ్ ఒక భాగం.

ఇప్పుడు మహా సముద్రాల్లో అత్యంత లోతులను అన్వేషిస్తున్న విక్టర్ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాలను అధిరోహించారు.

మెరియానా ట్రెంచ్‌లో ప్లాస్టిక్ సంచులు Image copyright REEVE JOLLIFFE
చిత్రం శీర్షిక అన్వేషణ తర్వాత జలాంతర్గామిని తిరిగి 'డీఎస్‌వీ ప్రెజర్ డ్రాప్' అనే ప్రధాన నౌకలోకి తీసుకొచ్చారు

విక్టర్ గత ఆరు నెలలుగా మహా సముద్రాల లోతుల్లోకి వెళ్తున్నారు.

ఇప్పటివరకు ఆయన అట్లాంటిక్ మహాసముద్రంలోని 'ప్యూర్టోరికో ట్రెంచ్', అంటార్కిటిక్ మహా సముద్రంలోని 'సౌత్ శాండ్‌విచ్ ట్రెంచ్', హిందూ మహా సముద్రంలోని 'జావా ట్రెంచ్‌'లో లోతైన ప్రాంతాలకు వెళ్లారు.

2019 ఆగస్టులో ఆయన చివరిదైన ఆర్కిటిక్ మహాసముద్రంలోని 'మాల్లీ డీప్‌' అడుగుకు వెళ్లబోతున్నారు.

ఐదు మహా సముద్రాల్లోని లోతులకు చేరిన తర్వాత ఈ అన్వేషణలకు ఉపయోగించిన డీఎస్‌వీ లిమిటింగ్ ఫ్యాక్టర్ జలాంతర్గామిని పరిశోధనల కోసం సైన్స్ సంస్థలకు అప్పగిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)