భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్‌లో ఉత్కంఠ ఎందుకు

  • 16 మే 2019
పాక్ ఎన్నికలు Image copyright Getty Images

సాధారణంగా భారత రాజకీయ వ్యవహారాలపై పాకిస్తాన్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కూడా పాక్ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

భారత్‌లో ఏ పార్టీ గెలుస్తుందా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అందుకే భారత ఎన్నికల ఫలితాల ప్రభావం పాకిస్తాన్‌పై ఎలా ఉండబోతోందో బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Image copyright Getty Images

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి ఘటనలో 40 మంది భారత సైనికులు ప్రాణాలను కోల్పోయారు.

ఈ దాడితో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ ఆరోపణలను ఆ దేశం ఖండిస్తూ వచ్చింది.

పుల్వామా దాడితో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పాకిస్తాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionభారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్‌లో ఉత్కంఠ

భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాకిస్తాన్ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది.

పుల్వామా దాడి ప్రస్తుత ఎన్నికల కోసం బీజేపీ చేసిన గిమ్మిక్కనేది పాకిస్తాన్ వాదన.

అప్పట్లో దీనిపై పార్లమెంటులో మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ "దీనికి సంబంధించిన ఆధారాలను భారత్ మాకు అందిస్తుందా లేదా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. వాటిపై పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోకపోతే అప్పుడు భారత్ తదుపరి చర్యకు వెళ్లొచ్చు. కానీ మాకు అర్ధమయిన విషయం ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సృష్టించడం వారికి అనివార్యం" అన్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వమే కాదు, ఆ దేశంలోని విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ వ్యతిరేక సెంటిమెంటుతో, ఎన్నికల్లో లబ్ది పొందాలని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

"హిందుత్వ ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్లను తృప్తి పరిచేందుకు బీజేపీకి పాకిస్తాన్ అంశం చాలా కీలకం. దీన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే వాళ్లకు అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయి" అని పాక్ రక్షణ విశ్లేషకులు డాక్టర్ సల్మా మాలిక్ అన్నారు.

కర్తార్‌పూర్ కారిడార్లో అభివృద్ధి, రెండు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణ అంశాలకు సంబంధించి భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చాలా కీలకమని పాకిస్తాన్ భావిస్తోంది.

మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇందులో పెద్దగా మార్పు రాకపోవచ్చు.

రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి లేకపోయినా వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తయితే ఉద్రిక్తలు తగ్గవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)