పోర్న్‌హబ్‌లో ఎన్నికల ప్రచారం.. ఓట్లేయాలని అభ్యర్థన.. యూరప్ దేశాల్లో ఎన్నికల పర్వం

  • 16 మే 2019
పోర్న్ హబ్, మొబైల్ వినియోగదారులు Image copyright Getty Images

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు.

ఈ ఇంటర్నెట్ యుగంలో ఓవైపున క్షేత్రస్థాయిలో ప్రచార హోరు కొనసాగిస్తూనే మరోవైపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విభిన్నమైన పోస్టులు, ప్రకటనలతో జనాల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు పోర్న్‌హబ్‌ కూడా నేతల ప్రచారాలకు ఒక వేదికగా మారిపోయింది.

ఆన్‌లైన్‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు ఎంచుకుంటున్న కొన్ని విచిత్రమైన మార్గాలను చూద్దాం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జోవాచిమ్ బి.ఓల్సెమ్

పోర్న్‌హబ్‌లో ఎన్నికల ప్రచారం

జూన్ 5న డెన్మార్క్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం ప్రస్తుతం నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.

అందరి కంటే ఓ అడుగు ముందుకేసిన రాజకీయ నేత, మాజీ షాట్‌పుట్ అథ్లెట్ జోవాచిమ్ బి.ఓల్సెమ్ తనకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. వీక్షకులు ఆ వెబ్‌సైట్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు అది ప్రత్యక్షమవుతుంది.

ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడిచింది. ఓల్సెమ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో వందలమంది నెటిజన్లు కామెంట్లు కురిపించారు. దాంతో స్పందించిన ఆయన ఆ ప్రకటన తాను ఇచ్చినదేనని ధ్రువీకరించారు.

Image copyright Getty Images

డేటింగ్ యాప్‌లో ప్రచారం

జర్మనీలోని బెర్లిన్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు 2016లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థి అలెగ్జాండర్ ఫ్రెయిరెర్ తన ప్రచారం కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండర్‌ను వినియోగించారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల నినాదాలను, వ్యాఖ్యలను టిండర్‌లో పోస్ట్ చేసేవారు. అయితే, ఆయన తన ఫొటోలను మాత్రం అందుకు ఉపయోగించేవారు కాదు.

"ప్రజలు ఎక్కడుంటారో అక్కడ ప్రచారం చేస్తేనే ఫలితం ఉంటుంది" అని ఆయన చెప్పారు. టిండర్ ద్వారా చాలా మందిలో తన పట్ల సానుకూలత పెరిగిందని అలెగ్జాండర్ చెప్పుకొచ్చారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక డెమోక్రటిక్ పార్టీ నేత బెటో ఓ రూర్క్

సెలూన్ నుంచి లైవ్

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ నేత బెటో ఓ రూర్క్ బుధవారం సెలూన్‌లో క్షవరం చేయించుకోవడాన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో చూపించారు. అంతకుముందు జనవరిలో దంతవైద్యం చేయించుకుంటూ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో ప్రజల జీవనం ఎలా ఉందన్నది తెలిపేందుకు ఆయన వరుసగా ఇలాంటి పనులు చేస్తున్నారు.

దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటున్నారంటూ కొందరు ఆయన్ను ప్రశంసిస్తుంటే, మరికొందరేమో ప్రచారం కోసమే అలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సీషెల్స్ దేశ అధ్యక్షుడు డానీ

సముద్ర గర్భంలో ప్రసంగం

సముద్రాలను పరిరక్షించేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిస్తూ ఆఫ్రికాలోని సీషెల్స్ దేశ అధ్యక్షుడు డానీ ఫారే సముద్ర గర్భంలో ప్రసంగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

హిందూ మహాసముద్రంలో 406 అడుగుల లోతుకు ఒక ప్రత్యేక నౌకలో వెళ్లి ప్రసంగిస్తూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. "మన భూమికి సముద్రం గుండెకాయ లాంటిది. అది గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ప్రమాదంలో ఉంది" అని ఆయన అన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా కృషి చేయాలని డానీ ఫారే కోరారు.

Image copyright youtube/Levi Tillemann

పెప్పర్ స్ప్రే కొట్టుకున్న నేత

అమెరికాలోని కొలరాడోకు చెందిన రాజకీయ నాయకుడు లెవి టిల్లెమాన్ 2018 జూన్‌లో ఎన్నికల ప్రకటన కోసం తన కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకున్నారు.

"ఇది ప్రాణాలను కాపాడుతుంది" అనే శీర్షికతో ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. పాఠశాలల్లో సాయుధులు కాల్పులకు పాల్పడినప్పుడు ఉపాధ్యాయులు తమను తాము రక్షించుకునేందుకు పెప్పర్ స్ప్రే ఉపయోగపడుతుందని చెప్పడం దాని ఉద్దేశం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు