గ్రీన్‌ల్యాండ్: ఈ దేశంలో... జననాల కన్నా గర్భస్రావాలే అధికం

  • 18 మే 2019
బేబీ బొమ్మలు Image copyright PAARISA
చిత్రం శీర్షిక అవాంఛిత గర్భధారణలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా పిల్లల సంరక్షణ ఎలా ఉంటుందో 'డాల్ ప్రాజెక్ట్' ద్వారా యువతకు తెలియజేస్తున్నారు

‘‘దీని గురించి నేను రెండోసారి ఆలోచించను. అబార్షన్ గురించి మేం ఓపెన్‌గానే మాట్లాడతాం. నా చివరి అబార్షన్ గురించి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ చెప్పాను’’ అని బీబీసీతో చెప్పింది పియా. ఆమె వయసు 19 సంవత్సరాలు.

గ్రీన్‌ల్యాండ్‌ రాజధాని న్యూక్‌లో నివసించే ఈ టీనేజీ యువతి గత రెండేళ్లలో ఐదుసార్లు అబార్షన్ చేయించుకుంది.

‘‘మామూలుగా నేను గర్భనిరోధాలు ఉపయోగిస్తాను. కానీ కొన్నిసార్లు మేం మరచిపోతుంటాం. ఇప్పటికిప్పుడు నేను పిల్లను కనలేను. స్కూల్‌లో ఇంకా చివరి సంవత్సరం చదువుతున్నాను’’ అని చెప్పింది.

ఇలా చెప్తున్నది ఈ యువతి ఒక్కరే కాదు.

గ్రీన్‌ల్యాండ్‌లో 2013 నుంచి ప్రతి ఏటా దాదాపు 700 జననాలు, 800 అబార్షన్లు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ దేశంలో అబార్షన్ రేటు ఇంత అధికంగా ఉండటానికి కారణమేమిటి?

Image copyright CHRISTIAN KLINDT SOELBECK
చిత్రం శీర్షిక గ్రీన్‌ల్యాండ్ రాజధాని న్యూక్‌లో విద్యార్థులు బుధవారాన్ని 'అబార్షన్ డే'గా వ్యవహరిస్తారు

తలవంపుల భావన తక్కువ

ప్రపంచంలో అతి పెద్ద దీవి గ్రీన్‌ల్యాండ్. కానీ అందులో నివసించే జనాభా అత్యంత తక్కువ. స్టాటిస్టిక్స్ గ్రీన్‌ల్యాండ్ ప్రకారం 2019 జనవరి 1వ తేదీ నాటికి జనాభా కేవలం 55,992 మంది.

ఇక్కడ గర్భం ధరించే మహిళల్లో సగం మందికి పైగా అబార్షన్ చేయించుకుంటున్నారు. అంటే.. ప్రతి 1,000 మంది మహిళలకూ 30 అబార్షన్లు జరుగుతున్నాయి.

గ్రీన్‌ల్యాండ్ అధికారికంగా స్వయం పాలిత దేశమే అయినప్పటికీ.. అది డెన్మార్క్‌ మీద ఆధారపడిన ప్రాంతంగానే కొనసాగుతోంది.

అయితే.. గ్రీన్‌ల్యాండ్‌తో పోలిస్తే డెన్మార్క్‌లో ప్రతి 1,000 మంది మహిళలకు 12 అబార్షన్లు జరుగుతున్నాయి.

అబార్షన్ల రేటు ఇంత ఎక్కువగా ఉండటానికి ఆర్థిక ఇబ్బందులు, ఇంటి పరిస్థితులు సరిగా లేకపోవటం, అక్షరాస్యత లోపించటం వంటివి దోహదం చేస్తుండవచ్చు.

అయితే.. గర్భనిరోధకాలు ఉచితంగానూ విస్తారంగానూ అందరికీ లభించే దేశంలో.. అబార్షన్లు ఇంతటి స్థాయిలో ఉండటానికి పై పరిస్థితులు మాత్రమే కారణం కాదు.

అబార్షన్ చట్టబద్ధమే కాదు, ఆ వైద్య సేవ ఉచితంగా కూడా ఉన్న చాలా దేశాల్లో గర్భస్రావాన్ని ఎంచుకోవటాన్ని ఒక దోషంగా పరిగణిస్తారు.

అయితే గ్రీన్ ల్యాండ్‌లో కొంతమంది మహిళల్లో ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఎవరేమంటారో అనే ఆందోళన ఉండదు. అవాంఛిత గర్భాన్ని తలవంపులుగా పరిగణించరు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డెన్మార్క్ నుంచే ప్రధానంగా నిధులు అందుతున్నప్పటికీ.. గ్రీన్‌ల్యాండ్‌‌కు తన సొంత పార్లమెంటు ఉంది

అబార్షన్ డే

కానీ అవాంచిత గర్భాలు ఇంత అధికంగా ఎందుకున్నాయి?

‘‘నా ఫ్రెండ్స్‌లో చాలా మంది అబార్షన్లు చేయించుకున్నారు. మా అమ్మ కూడా నన్ను, నా తమ్ముడిని కనటానికి ముందు మూడు అబార్షన్లు చేయించుకుంది’’ అని చెప్పింది పియా. ‘‘అయితే దాని గురించి మాట్లాడటం ఆమెకు ఇష్టం ఉండదు’’ అని పేర్కొంది.

‘‘న్యూక్‌లో విద్యార్థులు బుధవారాల్లో లైంగిక ఆరోగ్య క్లినిక్‌కు వెళతారు. దానిని ‘అబార్షన్ డే’ అని వాళ్లే వ్యవహరిస్తుంటారు’’ అని చెప్పారు డెన్మార్క్‌లోని రోస్కిల్డ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ పరిశోధకురాలు టూరీ హెర్మన్స్‌డోటిర్. అబార్షన్ అంశం మీద ఆమె అధ్యయనం చేస్తున్నారు.

‘‘గ్రీన్‌ల్యాండ్‌లో అబార్షన్ మీద చర్చను, పెళ్లికి ముందు సెక్స్‌ను, అనుకోని గర్భధారణలను.. నిషిద్ధ అంశాలుగా కానీ, అనైతికంగా కానీ పరిగణిస్తున్నట్లు కనిపించదు’’ అని ఆమె తెలిపారు.

Image copyright Media for Medical
చిత్రం శీర్షిక గ్రీన్‌ల్యాండ్ ఉచితంగా గర్భనిరోధకాలను అందిస్తుంది.. కానీ చాలా మంది మహిళలు వాటిని ఉపయోగించరు

ఉచిత గర్భనిరోధకాలు

‘‘గర్భనిరోధకాలు ఉచితంగా లభిస్తాయి. అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ నా స్నేహితులు చాలా మంది వాటిని వాడరు’’ అని పియా తెలిపింది.

గ్రీన్‌ల్యాండ్‌లో గైనకాలజీ నర్స్‌గా పనిచేస్తున్న స్టీన్ బ్రెనో పలు సంవత్సరాలుగా అబార్షన్ అంశం మీద పరిశోధన చేస్తున్నారు.

‘‘నేను సర్వే చేసిన మహిళల్లో దాదాపు 50 శాతం మంది తమకు గర్భనిరోధకాల గురించి తెలుసునని చెప్పారు. అయితే వారిలో 85 శాతం మందికి పైగా గర్భనిరోధకాలను వాడలేదు. వాడినా కూడా పొరపాటుగా వాడారు’’ అని ఆమె బీబీసీకి తెలిపారు.

మద్య పానం వల్ల అవాంఛిత గర్భాలు ధరిస్తుండవచ్చు: ‘‘స్త్రీ, పురుషులిద్దరూ మద్యం ప్రభావంలో ఉన్నట్లయితే గర్భనిరోధకాలు వాడటం గురించి మరచిపోతారు’’ అని చెప్పారు స్టీన్.

మద్యం మత్తులో...

గ్రీన్‌ల్యాండ్‌లో మహిళలు గర్భనిరోధకాలను ఎందుకు వాడటం లేదనేందుకు తన పరిశోధనలో మూడు ప్రధాన కారణాలను గుర్తించినట్లు టూరీ తెలిపారు.

‘‘మొదటి కారణం.. మహిళలు పిల్లలు కావాలని కోరుకోవటం, రెండో కారణం.. హింస, మద్యం ప్రభావాలకు లోనై కష్టాల్లో ఉన్న మహిళలు గర్భనిరోధకాలను వాడటాన్ని మరచిపోవటం, మూడో కారణం.. పురుషు భాగస్వామి కండోమ్ వాడటానికి తిరస్కరించటం’’ అని వివరించారు.

Image copyright Sean Gallup
చిత్రం శీర్షిక గ్రీన్‌ల్యాండ్‌లో అబార్షన్‌ను 1975 జూన్ 12న చట్టబద్ధం చేశారు

హింస, లైంగిక దాడులు

ఒక మహిళ అత్యాచారానికి గురైన ఫలితంగా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలని కోరుకోవచ్చు. లేదంటే కష్టాల్లో ఉన్న ఇంట్లో బిడ్డలను కనటానికి మహిళలు ఇష్టపడకపోవచ్చు.

‘‘నిరాదరణకు గురయ్యే పిల్లలు, అవాంఛిత పిల్లల కన్నా అబార్షన్ మంచిదేమో’’ అంటారు దక్షిణ గ్రీన్‌ల్యాండ్‌లోని ఓ పట్టణంలో జిల్లా డాక్టర్‌గా పనిచేస్తున్న లార్స్ మోస్గార్డ్.

గ్రీన్‌ల్యాండ్‌లో హింస అనేది తరచుగా పునరావృతమవుతున్న ఆరోగ్య సమస్య. ప్రతి 10 మంది స్కూలు పిల్లల్లో ఒకరు.. తమ తల్లి హింసకు గురవటాన్ని చూశామని చెప్పారని నోర్డిక్ సెంటర్ ఫర్ వెల్ఫేర్ అండ్ సోషల్ ఇష్యూస్ సంస్థ పేర్కొంది.

హింసను చూడటమే కాదు.. ఆ పిల్లలు కూడా తరచుగా హింసా బాధితులు అవుతున్నారు.

‘‘గ్రీన్‌ల్యాండ్‌లోని వయోజనుల్లో మూడో వంతు మంది.. తాము పిల్లలుగా ఉన్నపుడు హింసకు గురయ్యారు’’ అని చెప్పారు డైట్ సోల్బెక్. లైంగిక హింస మీద పోరాటానికి ప్రభుత్వ ప్రణాళికను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలో జనసాంద్రత అతి తక్కువగా ఉన్న ప్రాంతం గ్రీన్‌ల్యాండ్ .. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు కేవలం 0.03 మంది మాత్రమే నివసిస్తున్నారు

గర్భనిరోధకాల గురించి అవగాహన లోపం

గర్భనిరోధకాలు ఉచితంగా, సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ.. అది అంతగా ఉపయోగపడటం లేదు.

‘‘ఉదయం వేసుకునే మాత్ర గురించి కేవలం నెల రోజుల కిందటే నాకు తెలిసింది. ఇటువంటి ఒక అవకాశం అందుబాటులో ఉందని అందరికీ తెలుసునని నేను అనుకోను’’ అని పియా బీబీసీతో చెప్పారు.

‘‘నా లైంగిక ఆరోగ్యం గురించి మా అమ్మ నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. స్కూల్ ద్వారా నాకు కొన్ని విషయాలు తెలిశాయి. అయితే ఎక్కువగా నా ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నాను’’ అని వివరించారు.

గ్రీన్‌ల్యాండ్‌లో కుటుంబాలు లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడటం వాయిదా వేస్తుంటారు. ఆ విషయాలు మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుందని, ఎబ్బెట్టుగా ఉంటుందని భావించటమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్కమ్‌పోలార్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గ్రీన్‌ల్యాండ్ ప్రజల్లో మద్యపాన వ్యసనం చాలా అధికంగా ఉంది

ఆత్మహత్యల రేటు కూడా ప్రపంచంలోనే అత్యధికం

అబార్షన్లు అత్యధికంగా ఉండటమే కాదు.. ఆత్మహత్యలు కూడా గ్రీన్‌ల్యాండ్‌లో చాలా అధికంగానే ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్కంపోలార్ హెల్త్ లెక్కల ప్రకారం ఇక్కడ ప్రతి ఏటా ఒక లక్ష మంది జనాభాకు 83 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

గ్రీన్‌ల్యాండ్‌లో టీనేజర్‌గా, కిశోర వయస్కులుగా ఉన్నవారు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యల్లో సగం మందికి పైగా యువకులే ఉంటున్నారు.

‘‘చాలా ఉదంతాల్లో దాడులు, హింసతో పెరిగే వారు అధికంగా ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు’’ అని చెప్పారు సైకాలజిస్ట్ లార్స్ పెడర్సన్. ఆమె గ్రీన్‌ల్యాండ్‌లో పలు సంవత్సరాలు పనిచేశారు.

1953లో గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్‌ రాజ్యంలో భాగమైంది. డానిష్ భాషను అధికారిక భాషగా అమలుచేశారు. సమాజం, ఆర్థికవ్యవస్థ గణనీయంగా మారిపోయింది.

గ్రీన్‌ల్యాండ్‌లో వాస్తవ ఆదిమవాసులైన ఇన్యూట్‌లు జనాభాలో 88 శాతం మందిగా ఉన్నారు. తమ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకుంటూనే ఆధునిక సమాజానికి అనుగుణంగా మారటానికి వీరు చాలా కష్టపడాల్సి వచ్చింది.

‘‘గ్రీన్‌ల్యాండ్ సంప్రదాయ ఇన్యూట్ సమాజం నుంచి ఆధునిక జీవనానికి చాలా మారింది. మద్యపానం విపరీతంగా పెరిగింది. అది హింసను, లైంగిక దాడులను పెంచిపోషించింది’’ అని చెప్పారు పెడర్సన్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గ్రీన్‌ల్యాండ్‌లోని వయోజనుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు చిన్న వయసులో హింసను చవిచూశారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి

అందరికీ అబార్షన్ ఉచితం

గ్రీన్‌ల్యాండ్‌లో అబార్షన్ల రేటు తగ్గాలంటే ఒక్కో అబార్షన్‌కు ఇంత చెల్లించాలని ఫీజు వసూలు చేయాలని కొందరు సూచిస్తున్నారు.

అయితే.. మహిళలు ఎక్కువగా అబార్షన్లు చేయించుకోవటానికి - అబార్షన్లు ఉచితంగా, సులభంగా అందుబాటులో ఉండటానికి సంబంధం లేదని మరికొందరు వాదిస్తున్నారు.

అయితే డెన్మార్క్‌లో కూడా అబార్షన్లు ఇంతే ఉచితంగా, ఇంతే సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ అబార్షన్లు చేయించుకునే మహిళల సంఖ్య గ్రీన్‌ల్యాండ్ కన్నా చాలా తక్కువ (ప్రతి 1,000 మంది మహిళలకు 12 అబార్షన్లు).

గ్రీన్‌ల్యాండ్‌లో హింస, అకృత్యాల నుంచి కోలుకుంటున్న మహిళలు, చిన్నారులతో నార్వేకి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ జొహాన్ సండ్బీ పనిచేశారు.

అబార్షన్ కోసం పేషెంట్లు డబ్బులు చెల్లించే పరిస్థిత ఉండకూడదని ఆమె అంటారు. ‘‘నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇలా చేస్తే నియంత్రణ లేని మార్కెట్‌కు తలుపులు తెరుచుకుంటాయి. చౌకగా ఉండే ప్రమాదకర అబార్షన్లు మొదలవుతాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

Image copyright PAARISA
చిత్రం శీర్షిక అవాంఛిత టీనేజీ గర్భధారణల సంఖ్యను తగ్గించటం, గర్భనిరోధకాల వినియోగాన్ని పెంచటం, లైంగికంగా సంక్రమించే వ్యాధులను తగ్గించటం 'ద డాల్' ప్రాజెక్ట్ లక్ష్యం

డాల్ ప్రాజెక్ట్

గ్రీన్‌ల్యాండ్‌లో టీనేజీ పిల్లలు 14-15 సంవత్సరాల నుంచే సెక్స్ ప్రారంభిస్తారు. పదిహేనేళ్ల వయసు యువతలో 63 శాతం మంది క్రమంతప్పకుండా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు జాతీయ లెక్కలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లతో కలిసి ‘డాల్ ప్రాజెక్ట్’ను ప్రవేశపెట్టింది. చిన్న వయసులో పిల్లలను కనటం వల్ల ఉండే పర్యవసానాల గురించి తెలియజేయటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

అవాంఛిత టీనేజీ గర్భధారణల సంఖ్యను తగ్గించటం, గర్భనిరోధకాల వినియోగాన్ని పెంచటం, లైంగికంగా సంక్రమించే వ్యాధులను తగ్గించటం ప్రాజెక్టు లక్ష్యం.

నిజమైన చిన్నారిలా కనిపించే, అలాగే స్పందించే బొమ్మలను బాలురు, బాలికలకు ఇస్తారు.

ఆ బొమ్మకు డైపర్లు, దుస్తులు మార్చటం, పాలుపట్టిన తర్వాత భుజానికి ఎత్తుకుని వీపుపై తట్టటం, ఊరటనివ్వటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. టీనేజీ పిల్లలు.. అంటే 13 నుంచి 18 ఏళ్ల వయసులోని విద్యార్థులకు పిల్లలను కంటే ఉండే బాధ్యతల గురించి తెలిసేలా చేసే పద్ధతి ఇది.

‘‘సాంస్కృతిక అవరోధాలు’’

అయితే.. మహిళల వయసుతో నిమిత్తం లేకుండా అబార్షన్‌ను గ్రీన్‌ల్యాండ్‌లో చాలా తేలికగా పరిగణిస్తున్నారన్న వాదనతో స్టీన్ బ్రోన్ విభేదిస్తున్నారు.

‘‘అబార్షన్ అనేది చాలా కష్టమైన నిర్ణయమని చాలా మంది మహిళలకు తెలుసు. దాని గురించి అలోచించటానికి వాళ్లు సమయం తీసుకుంటారు. వాళ్లు ఖచ్చితంగా ఆలోచించుకున్నట్లయితే దీని గురించి మానసికవేదన వారిలో కనిపించదు’’ అని ఆమె అంటారు.

‘‘అబార్షన్‌ను తేలికగా పరిగణించే మహిళ ఒక్కరు కూడా నాకు తారసపడలేదు. నాకు తెలిసినంతవరకూ.. కొందరు మహిళలు తమను తాము కాపాడుకోవటానికి పెద్దగా మాట్లాడరు. ఇది వాళ్ల లెక్కలేనితనంగా కొందరికి కనిపించవచ్చు’’ అని వివరించారు.

అంతేకాదు.. భాషా భేధం కూడా పొరపాటు అవగాహనకు దారిస్తోందని లార్స్ పెడెర్సన్ పేర్కొన్నారు.

‘‘నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలా మంది ధారాళంగా డానిష్ మాట్లాడలేరు. ఆస్పత్రి సిబ్బందిలో చాలా మంది గ్రీన్‌ల్యాండిక్ భాష పెద్దగా తెలియదు’’ అని చెప్పారు.

అలాగే గ్రీన్‌ల్యాండ్ సమస్యలను డెన్మార్క్ పరిష్కారాలు పరిష్కరిస్తాయని కూడా అనుకోరాదని ఆయన అంటారు.

‘‘మనం దేని మీద దృష్టి కేంద్రీకరించాలన్న దానిని పునరాలోచించాల్సిన అవసరముంది. అవాంఛిత గర్భధారణలన్నిటికీ కారణమైన హింస, దాడులు, మద్యపాన వ్యసనాలను పరిష్కరించటం మీద దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు.


(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం