భారత ఎన్నికలపై బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: భారత ఎన్నికలపై బంగ్లా ప్రజలు ఏమంటున్నారు?

  • 18 మే 2019

భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు కేవలం దేశ ప్రజలకు మాత్రమే ఉపఖండంలోని ఇతర దేశాలకు కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల సరళిని సరిహద్దు దేశాలు నిశితంగా పరిశీలిస్తుంటాయి. మరి పొరుగున ఉన్న బాంగ్లాదేశ్ ప్రస్తుత భారత సార్వత్రిక ఎన్నికలను ఎలా చూస్తోంది?

అక్కడి రాజకీయ పార్టీలు ఇక్కడి ప్రభుత్వాల గురించి ఏమనుకుంటున్నాయి? భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాల విషయంలో మార్పులు ఏమైనా వస్తాయని బాంగ్లాదేశ్ భావిస్తోందా? బీబీసీ ప్రతినిధి సాయెదా అక్తర్ కథనం.

పొరుగు దేశమైన భారత్‌లో జరిగే ఎన్నికలపై బాంగ్లాదేశ్ ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఎవరు అధికారంలోకి వస్తారన్నది కూడా వీరికి ముఖ్యమే. భారత ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారని ఢాకా వీధుల్లో కనిపించిన కొందరిని అడిగాను.

‘‘భారతదేశానికి వెళ్లిన ప్రతిసారీ మమ్మల్ని భద్రతాదళాలు ఇబ్బంది పెట్టాయి. ఈ తీరు మారాలని కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నా’’ అని ఒకరు చెప్పారు.

‘‘కొత్త ప్రభుత్వం వచ్చినా మాకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. మా మార్కెట్లు భారత ఉత్పత్తులతో వెల్లువెత్తుతున్నాయి. కానీ వాళ్లు మా నుంచి కొనేది చాలా తక్కువ. మా టీవీ చానళ్లను అక్కడ ప్రసారం కానివ్వరు కానీ, చాలా భారతీయ టీవీ చానళ్లను మేం చూస్తుంటాం’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

బాంగ్లాదేశ్‌లోని పార్టీలు భారత ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాయి. భారత అనుకూల పార్టీగా బాంగ్లాదేశ్ అవామీ లీగ్‌కు పేరుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్‌తో తమకు సత్సంబంధాలుంటాయని ఆ పార్టీ అంటోంది.

బాంగ్లాదేశ్ జాతీయవాద పార్టీ బీఎన్‌పీతో భారత్‌కున్న సంబంధాలు అవామీ లీగ్‌ కంటే భిన్నమైనవి. ఒకప్పుడు భారత వ్యతిరేక భావజాలంతో ఉండే బీఎన్‌పీ, గత కొద్ది సంవత్సరాలుగా భారత్ విషయంలో మౌనంగా ఉంటూ వస్తోంది.

సత్ససంబంధాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది బీఎన్‌పీ సీనియర్ నాయకులు భారతదేశంలో పర్యటించి కాంగ్రెస్, బీజేపీ నేతలను కలిశారు. గతంలో ఉన్న విభేదాలను తొలగించుకోవాలని ఈ పార్టీ భావిస్తోంది.

మరోవైపు.. బీజేపీ హిందుత్వ భావజాలం రానున్న రోజుల్లో బాంగ్లాదేశ్‌కు ఇబ్బందులు కలిగించొచ్చని కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘ఈసారి కూడా బీజేపీ గెలిచి, నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే హిందుత్వ రాజకీయాలు మరింత పెరుగుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య భారతంలో వాళ్లేం చేశారో ఇక్కడే అదే చేస్తారు. ఇది బాంగ్లాదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ ఢాకాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

‘‘భారత్‌లో మత రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయకూడదని బాంగ్లాదేశ్‌లోని మతతత్వ పార్టీలు వాదించొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటు భౌగోళికంగా అటు దౌత్యపరంగా భారత్ ఎన్నికలు బాంగ్లాదేశ్‌కు ఎంతో ముఖ్యం. బాంగ్లాదేశ్ రాజకీయ నాయకులు తమ దేశ ప్రయోజనాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా పరిష్కారం కానీ వివాదాలు ఒక కొలిక్కి రావాలని కోరుకుంటున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)