తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం

  • 18 మే 2019
తైవాన్ Image copyright Reuters

స్వలింగ సంపర్కుల వివాహాన్ని (గే మ్యారేజ్‌ను) చట్టబద్ధం చేస్తూ తైవాన్ పార్లమెంటు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆసియాలోని గే మ్యారియేజ్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది.

స్వలింగ సంపర్కులైన జంటకు చట్టబద్ధంగా వివాహం చేసుకునే హక్కు ఉందని తైవాన్ రాజ్యాంగ న్యాయస్థానం 2017లో తీర్పు చెప్పింది.

ఈ మేరకు చట్టంలో మార్పులు చేయటానికి తైవాన్ పార్లమెంటుకు రెండు సంవత్సరాల సమయం ఇచ్చింది. ఈ ఏడాది మే 24వ తేదీ లోగా పార్లమెంటు ఈ మార్పులు తీసుకురావాల్సి ఉంది.

అయితే.. 2017లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు చెప్పినపుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పలుమార్లు ప్రజాభిప్రాయ సేకరణలు నిర్వహించాల్సి వచ్చింది.

Image copyright Getty Images

ఫలితంగా.. ప్రస్తుతం ఉన్న వివాహ చట్టాన్ని మార్చబోమని, స్వలింగ సంపర్కుల వివాహం కోసం ప్రత్యేక చట్టం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయటానికి మూడు రకాల బిల్లుల మీద పార్లమెంటులో చర్చించారు. అన్నిటిలోకీ ప్రగతిశీలంగా ఉన్న ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును ఆమోదించింది.

ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు అనుకూలంగా 66 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. పార్లమెంటులో ఆధిక్యంలో ఉన్న డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బిల్లుకు మద్దతుగా నిలిచింది.

ఈ బిల్లును దేశాధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ ఆమోదించిన తర్వాత చట్టంగా అమలులోకి వస్తుంది.

పార్లమెంటులో బిల్లును ఆమోదించిన విషయాన్ని ప్రకటించగానే దేశంలో స్వలింగ సంపర్కులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఆనందభాష్పాలతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.

''సమానత్వం కోసం చేస్తున్న పోరాటం ఇక్కడితో ఆగదు. వివక్షకు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. లింగ సమానత్వ విద్యను పరిరక్షించుకుంటాం'' అని మ్యారియేజ్ ఈక్వాలిటీ కొయిలిషన్ తైవాన్ సహ వ్యవస్థాపకురాలు జెన్నిఫర్ లూ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో పేర్కొన్నారు.

అయితే.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

''వివాహం, కుటుంబం అనేవి స్త్రీ - పురుషులతో భార్యా - భర్తలతో ఏర్పడతాయన్న తైవాన్ ప్రజల మనోభావాలను పార్లమెంటులో ఆమోదించిన తీర్మానం కాలరాసింది'' అని కొయిలషన్ ఫర్ ద హాప్పీనెస్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ప్రతినిధి త్సెంగ్ సీన్-యింగ్ విమర్శించారు.

Image copyright Reuters

ఆసియా వ్యాప్తంగా హర్షాతిరేకాలు

ఆసియాలో ఒక చిన్న దీవి దేశమైన తైవాన్.. స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో ముందు వరుసలో ఉంది. తైపేలో ప్రతి ఏటా గే ప్రైడ్ పరేడ్ నిర్వహిస్తోంది. ఆసియా ఖండంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఎల్‌జీబీటీ బృందాలు దీనికి హాజరవుతుంటాయి.

తైవాన్ గే మ్యారియేజ్ చట్టం చేయటం పట్ల ఆసియా వ్యాప్తంగా ఎల్‌జీబీటీ బృందాలు సంతోషం వ్యక్తంచేశాయి. తాము తైవాన్ పౌరులం కాకపోయినప్పటికీ ఇది స్వలింగ సంపర్కులందరి విజయమని సింగపూర్‌కు చెందిన పాల్ న్గి బీబీసీతో పేర్కొన్నారు.

తైవాన్ చట్టం చేయటం ఆసియాలోని సింగపూర్ వంటి మిగతా అభివృద్ధి చెందిన దేశాలకు చాలా ముఖ్యమైన సందేశం పంపుతుందని చెప్పారు.

తైవాన్ నిర్ణయం అవగాహనను పెంపొందించేందుకు దోహదపడతుందని హాంగ్‌కాంగ్‌కు చెందిన ఎల్‌జీబీటీ ఆర్టిస్ట్ వాంగ్ కా యింగ్ స్పందించారు. అయితే.. ''చాలా సంప్రదాయ'' ప్రాంతాలైన హాంగ్ కాంగ్, చైనా వంటి ప్రాంతాలపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదన్నది తన అభిప్రాయంగా చెప్పారు.

వియత్నాం 2015లోనే గే మ్యారియేజ్ వేడుకలు నేరం కాదని పేర్కొంది. అయితే.. స్వలింగ సంపర్కుల వివాహానికి పూర్తిస్థాయి చట్టబద్ధ గుర్తింపును మాత్రం ఇవ్వలేదు.

చైనాలో స్వలింగ సంపర్కుల వివాహం ఇంకా చట్టవ్యతిరేకమే. అయితే.. స్వలింగ సంపర్కం మాత్రం నేరం కాదని 1997లో చైనా స్పష్టంచేసింది. అనంతరం మూడేళ్లకు.. స్వలింగ సంపర్కాన్ని మానసిక రోగాల జాబితా నుంచి కూడా తొలగించింది.

ఇక 2018 సెప్టెంబర్‌లో భారత సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పులో స్వలింగ సంపర్కం ఏమాత్రం నేరం కాదని ప్రకటించింది.

అయితే.. ఇతర ఆసియా దేశాల్లో ఈ అంశంపై భిన్న వైఖరులు ఉన్నాయి.

బ్రూనై గత ఏప్రిల్‌లో ఒక చట్టం చేస్తూ.. ఆనల్ సెక్స్, వివేహేతర శారీరక సంబంధాలను.. రాళ్లతో కొట్టి చంపదగ్గ నేరాలుగా ప్రకటిస్తూ కఠినమైన కొత్త ఇస్లామిక్ చట్టాలు చేసింది. కానీ.. స్వలింగ సంపర్కం మీద మరణశిక్షను అమలు చేయబోమని చెప్పింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎల్‌జీబీటీ... తేడాలేంటి?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)