ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు.. పార్లమెంటు ఎన్నికల్లో ఆస్ట్రేలియా ప్రధాని అనూహ్య విజయం

  • 19 మే 2019
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ Image copyright Getty Images

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ నేతృత్వంలోని కూటమి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది.

ప్రతిపక్ష లేబర్‌ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. మారిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది.

ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, '9 గెలాక్సీ' ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 76 సీట్లు రావాలి. ఇప్పటి వరకు 75 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా, అధికార కూటమి 73 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

ఒకవేళ మారిసన్ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు రాకపోతే, ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్ర ఎంపీల మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

మరికొన్ని గంటల్లో తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

తమ కూటమికి మరోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ప్రధాని మారిసన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు లేబర్ పార్టీ నేత బిల్ షార్టెన్ ప్రకటించారు.

చిత్రం శీర్షిక ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత షార్టెన్

ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు వేయడం తప్పనిసరి. శనివారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 1.60 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు.

గత రెండేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం గెలుస్తుందని చాలామంది భావించారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అలాగే అంచనా వేశాయి. కానీ, ఆ అంచనాలు తారుమారయ్యాయి.

విజయం సాధించిన ప్రధాని మారిసన్‌కు అభినందనలు తెలిపిన ప్రతిపక్ష నేత షార్టెన్... "ఇక మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనికాదు" అన్నారు.

మూడేళ్లకోసారి ఎన్నికలు

ఆస్ట్రేలియాలో మూడేళ్ల‌కు ఒక‌సారి జాతీయ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే, 2007 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు.

2015 నుంచి 2018 ఆగస్టు వరకు లిబరల్ పార్టీ నేత టర్న్‌బుల్‌ ప్రధానిగా ఉండగా, పార్టీలో అంతర్గత తిరుగుబాటు కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తొమ్మి నెలలుగా అదే పార్టీకి చెందిన స్కాట్ మారిసన్ ప్రధాని పీఠం ఎక్కారు.

ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం, పర్యావరణం, ఆరోగ్యం లాంటివి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని సర్వేలు చెప్పాయి. వాతావరణ మార్పుల పట్ల యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపాయి. ఈ పరిస్థితుల్లోనూ అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు