హువావే స్మార్ట్‌ ఫోన్లకు ఇక ఆండ్రాయిడ్ అప్‌డేట్లు రావు - గూగుల్ ప్రకటన

  • 20 మే 2019
హువాయ్ Image copyright Getty Images

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫోన్ల తయారీ సంస్థ హువావే ఫోన్లకి ఇక కొన్ని ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ రావు అని గూగుల్ ప్రకటించింది.

ఈ తాజా నిర్ణయం వెనుక ట్రంప్ గవర్నమెంట్ అధికారిక ఉత్తర్వుల పాత్ర ఉంది. 'హువావే'తో అమెరికన్ సంస్థలు లైసెన్స్ లేకుండా వ్యాపారం చెయ్యలేని జాబితాలో చేర్చడం వల్లనే గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

కొత్త హువావే ఫోన్ల మోడళ్లకు ఇక కొన్ని గూగుల్ యాప్స్ ను వాడుకునే సామర్ధ్యం ఉండదు. కానీ, ప్రస్తుతం వాడుకలో ఉన్న హువాయ్‌ ఫోన్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదని గూగుల్ పేర్కొంది.

"మేం సురక్షితమైన, స్థిరమయిన సాఫ్ట్‌వేర్లను భవిష్యత్తులో కుడా తయారు చేస్తూనే ఉంటాం. మా వినియోగదారుల అనుభవమే మాకు ముఖ్యం" అని హువావే పేర్కొంది.

అమెరికా-చైనా మధ్యలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణం వల్లనే హువావేకి ఇన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.

"మేం హువావేకి ఈ విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తాం, తన చట్టబద్ధమైన హక్కులను హువావే రక్షించుకోడానికి మా సాయం పూర్తిగా ఉంటుంది" అని చైనా ప్రభుత్వం.. విలేకరుల సమావేశంలో పేర్కొంది.

Image copyright Getty Images

ప్రస్తుత హువావే ఫోన్ వినియోగదారుల పరిస్థితి ఏంటి ?

ప్రస్తుతం ఉన్న అన్ని గూగుల్ సర్వీసులను హువావే వినియోగదారులు వాడుకోవడం కొనసాగిoచవచ్చు. అలాగే గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌డేట్లకు కుడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

కానీ, గూగుల్ ఈ సంవత్సరం విడుదల చెయ్యబోతున్న కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ మాత్రం అందుబాటులో ఉండదు. భవిష్యత్తులో వచ్చే హువావే మోడళ్లకు మాత్రం యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ లాంటి గూగుల్ యాప్స్ అందుబాటులో ఉండవు.

హువావే మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఆండ్రాయిడ్ వెర్షన్ ని ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా వాడుకోవడం కొనసాగించచ్చు.

"ఈ నిర్ణయంతో హువావే వ్యాపారానికి చాలా పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది" అని సీసీఎస్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీ ప్రతినిధి బెన్ వుడ్ అన్నారు.

Image copyright Getty Images

ఈ పరిస్థితుల్లో హువావే ఏం చెయ్యగలదు?

ట్రంప్ ప్రభుత్వం హువావేను ఈ జాబితాలో చేర్చడం వల్ల ఇక మీదట హువావే అమెరికన్ కంపెనీల నుంచి టెక్నాలజీ కొనుగోలు చెయ్యాలంటే అమెరికన్ ప్రభుత్వ అనుమతి పొందాలి.

"మేం ఇలా జరుగుతుందని ముందే ఊహించాం. దీనికి మేం సిద్ధంగా ఉన్నాం" అని హువావే సీఈఓ రెన్ జ్హేంగ్ఫ్య్ జపాన్ మీడియాతో చెప్పారు.

ప్రతి ఏడాది దాదాపు రూ.47000 కోట్ల విలువచేసే విడి భాగాలను కొనుగోలు చేసే హువావే కంపెనీ ఇక మీదట సొంతంగా ఈ భాగాలను తయారు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

5జీ వస్తున్న నేపథ్యంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాలలో హువావే వాడకంపై గత కొంత కాలం నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకంగా హువావే ఫోన్లను చైనా ప్రభుత్వం ఇతర దేశాలపై నిఘా పెట్టడానికి వాడుతోందని చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ, అటువంటి ప్రసక్తి అస్సలు లేదని, తాము ఒక స్వతంత్ర సంస్థ అని హువావే ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తోంది.

ఇప్పటికే కొన్ని దేశాలు హువావే ఉత్పత్తులను తమ దేశ కంపెనీలు వాడకుండా ఉత్తర్వులు జారీ చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)