ఆస్ట్రేలియా: మెటల్ డిటెక్టర్‌తో గుప్తనిధి వేట.. రూ.48 లక్షల విలువైన 1.4 కేజీల బంగారం లభ్యం

  • 21 మే 2019
ఆస్ట్రేలియాలో బంగారం Image copyright FINDERS KEEPERS GOLD PROSPECTING
చిత్రం శీర్షిక ఈ 1.4 కిలోల బరువున్న బంగారం ముద్ద విలువ దాదాపు లక్ష ఆస్ట్రేలియా డాలర్లు

ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని బంగారు గనుల ప్రాంతంలో ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ సాయంతో 1.4 కేజీ బరువున్న బంగారం ముద్దను గుర్తించారు. దీని విలువ సుమారు లక్ష ఆస్ట్రేలియా డాలర్లు(69 వేల అమెరికన్ డాలర్లు) ఉంటుందని అంచనా.

కల్ ‌గూర్లీలోని ఒక దుకాణం ఈ పసిడి ముద్ర ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టింది. బంగారం అన్వేషకులకు అవసరమైన వస్తుసామగ్రిని ఈ దుకాణం సమకూరుస్తుంది.

ఆ వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు.

ఆయన స్థానికుడేనని, బంగారం అన్వేషణ ఆయనకు అలవాటని దుకాణం యజమాని మాట్ కుక్ బీబీసీతో చెప్పారు.

ఉపరితలానికి అడుగున్నర కింద (దాదాపు 45 సెంటీమీటర్లు) ఈ బంగారం ముద్ద లభించిందని కుక్ తెలిపారు.

ఈ విధంగా వెతికేవాళ్లకు ఈ స్థాయిలో బంగారం దొరకడం అరుదేనని, ఏడాదిలో కొన్నిసార్లే ఇలా జరుగుతుంటుందని నిపుణులు చెప్పారు.

ఆస్ట్రేలియాలో వెలికితీసే బంగారంలో నాలుగింట దాదాపు మూడొంతుల పసిడి కల్‌గూర్లీ ప్రాంతం, దాని చుట్టుపక్కల నుంచే వస్తుంది.

కల్ ‌గూర్లీ ప్రాంతంలో అన్వేషకులకు చిన్నచిన్న మొత్తాల్లో బంగారం దొరకడం సాధారణమేనని కర్టిన్ యూనివర్శిటీలోని వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కూల్ ఆఫ్ మైన్స్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ శామ్ స్పియరింగ్ చెప్పారు.

ఔత్సాహిక అన్వేషకులు చాలా మంది వారాంతాల్లో అలవాటుగా బంగారం కోసం వెతుకుతుంటారని, ఇతరులు అదే పనిగా అన్వేషిస్తుంటారని ఆయన వివరించారు.

అత్యధిక సందర్భాల్లో దొరికే బంగారం బరువు 15 గ్రాముల్లోపే ఉంటుందని చెప్పారు. కానీ అది తరచూ దొరుకుతుంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)