భారత్-చైనా 'క్లబ్' పెట్రోల్ ధరలను తగ్గించగలుగుతుందా?

  • 21 మే 2019
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు Image copyright Getty Images

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరల సరళినే మార్చేయగల ఒక ప్రతిపాదనపై చర్చ పెరుగుతోంది. ఆ ప్రతిపాదనే భారత్-చైనా చమురు కొనుగోలుదారుల క్లబ్.

ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువు ఈ నెల 2తో ముగిసిపోయింది. ఇరాన్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

ఈ పరిణామంతో భారత్, చైనా రెండూ ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చమురు కొనుగోలుదారుల క్లబ్‌ ప్రతిపాదనపై చర్చ ఊపందుకొంది.

క్లబ్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే చమురు ధరలపై రెండు దేశాలు ఉమ్మడిగా బేరమాడేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. అదే సమయంలో చమురు ఎగుమతిచేసే దేశాల సంఘం(ఒపెక్) ప్రాబల్యం తగ్గిపోతుంది.

ప్రపంచ చమురు ఉత్పత్తిలో 40 శాతాన్ని ఒపెక్ సభ్యదేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి.

Image copyright Getty Images

చమురు ఉత్పత్తిపై ఒపెక్ ఆంక్షల కారణంగా ధరలు పెరిగాయి. ఇది చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగించింది. ఈ రెండు దేశాలూ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడతాయి.

భారత్, చైనా ఒకదాన్ని మరొకటి నమ్మవు. కొనుగోలుదారుల క్లబ్ ఏర్పాటు కోసం ఈ రెండు దేశాలు పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేయగలవా అన్నది తేలాల్సి ఉంది.

భారత్, చైనాల్లో ఇంధన డిమాండ్ పెరుగుతోంది. దీనిని తీర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రంగాల్లో ప్రాబల్యం పెంచుకొనేందుకు రెండూ పోటీపడ్డాయి.

'క్లబ్' ప్రతిపాదన ఈనాటిది కాదు

చమురు కొనుగోలుదారుల క్లబ్ ప్రతిపాదన తొలిసారిగా 2005లో తెరపైకి వచ్చింది. కానీ పెద్దగా పురోగతి లేదు.

Image copyright Getty Images

2005లో అప్పుడు భారత చమురుశాఖ మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ ఈ ప్రతిపాదన చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్న సంక్లిష్టతల కారణంగా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ 2018లో రాసింది.

ఇలాంటి క్లబ్ ఏర్పాటు కోసం 2014 ప్రథమార్ధంలోనూ భారత్ మరోసారి ప్రయత్నించింది. అప్పుడు కూడా ఈ ప్రయత్నం అంతగా ఫలించలేదు.

ఈ క్లబ్ ఏర్పాటు కోసం ప్రయత్నించినప్పుడు ప్రతిబంధకాలు ఎదురయ్యాయని, దీని ఏర్పాటును ఇష్టపడని దేశాలే దీనికి కారణమని ఒక అధికారి నిరుడు ఏప్రిల్లో లైవ్‌మింట్ మీడియా సంస్థతో చెప్పారు.

క్లబ్ ఏర్పాటుపై గత సంవత్సరం కొన్ని సానుకూల సంకేతాలు వెలువడ్డాయి.

Image copyright PA

ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తామని, మరో రెండు ఆసియా దేశాలు జపాన్, దక్షిణ కొరియాలను ఈ క్లబ్‌లోకి తీసుకొస్తామని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచనప్రాయంగా చెప్పారు.

''అతిపెద్ద వినియోగదారులు అధిక ధరలు ఎందుకు చెల్లించాలి? 'ఏసియన్ ప్రీమియం' పేరిట ఈ దేశాలు ఎందుకు ఎక్కువ చెల్లించాలి? ఆసియాలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు చేతులు కలపాలి" అని 2018 ఏప్రిల్లో చెప్పారు.

'ఏసియన్ ప్రీమియం' కింద ఒపెక్ దేశాలకు తాము ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావడంపై సుదీర్ఘకాలంగా భారత్, చైనా, ఇతర ఆసియా దేశాల్లో అసంతృప్తి ఉంది. ఈ విధానం వివక్షాపూరితమని కూడా ఆసియా దేశాలు భావిస్తున్నాయి.

గత ఏడాది ఏప్రిల్ తర్వాతి నుంచి కూడా ఈ క్లబ్ ఏర్పాటు విషయమై భారత్, చైనా అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఉభయ దేశాల్లో పర్యటిస్తున్నారు.

ఈ ఏడాది మార్చిలో చైనా జాతీయ ఇంధన నిర్వహణ శాఖ డిప్యూటీ చీఫ్ లీ ఫాన్‌రాంగ్ దిల్లీ వచ్చారు. తర్వాత రెండు దేశాలూ కలిసి కార్యాచరణ గ్రూపును ఏర్పాటు చేశాయి.

ఈ గ్రూపు తొలి సమావేశం త్వరలోనే జరిగే అవకాశముంది.

Image copyright AFP

అంతర్జాతీయ చమురు వినియోగంలో 17 శాతం వాటా చైనా, భారత్‌లదే. కలసికట్టుగా ప్రయత్నిస్తే ధరల విషయంలో రెండు దేశాలకూ ప్రయోజనం ఉంటుంది.

భారత్, చైనాలతోపాటు జపాన్, దక్షిణ కొరియాలను పరిగణనలోకి తీసుకొంటే, అంతర్జాతీయ చమురు వినియోగంలో మూడో వంతు వాటా ఈ నాలుగు ఆసియా దేశాలదే.

ఈ నాలుగూ సభ్య దేశాలుగా క్లబ్ ఏర్పడితే, బేరమాడటంలో దీని శక్తి పెరుగుతుంది.

భారత్, చైనాల ప్రయత్నాలతో ప్రపంచ చమురు మార్కెట్లలో పెను మార్పు సంభవించే అవకాశముందని 'ది ఎకనమిక్ టైమ్స్' పత్రిక ఈ నెల 1న తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. కొనుగోలుదారుల క్లబ్బు ఏర్పాటుతో బేరసారాలు కొనుగోలుదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని, అదే జరిగితే చమురులో అతిపెద్ద శక్తులు కూడా భారత్, చైనా చెప్పినట్లు వినాల్సిన పరిస్థితులు వస్తాయని అభిప్రాయపడింది.

ఈ క్లబ్ ఏర్పడితే విజయవంతమయ్యే అవకాశాలు ఇంతకుముందు కన్నా ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో షేల్ గ్యాస్ బూమ్ ఉండటం, పునర్వినియోగ ఇంధన వనరుల వినియోగం పెరుగుతుండటంతో ఒపెక్ ప్రాబల్యం తగ్గిపోతోంది.

Image copyright Getty Images

తన సత్తా చాటేందుకు ప్రతిపాదిత క్లబ్‌కు ఇరాన్ సంక్షోభం ఒక మహదవకాశమని సింగపూర్‌ కేంద్రంగా సేవలందించే ఇంధన నిపుణురాలు వందనా హరి అభిప్రాయపడ్డారు.

చమురు విషయంలో ఈ క్లబ్ వ్యవహారం నెరపాల్సింది ఒపెక్‌తో మాత్రమే కాదని ఆమె జపాన్‌ పత్రిక 'నిక్కీ ఏసియన్ రివ్యూ'‌లో ఈ నెల 17న రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అమెరికాతోనూ చర్చించాల్సి ఉందని, ఇది ఒపెక్‌తో వ్యవహారం నెరపడం కన్నా ముఖ్యమైనది కావొచ్చని తెలిపారు.

చైనా పెట్రోలియం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ జిన్ లీ నిరుడు ఏప్రిల్లో చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ- ఓ సంక్షోభ సమయంలో ఒపెక్ పురుడు పోసుకుందని, అలాగే ప్రస్తుత సందర్భంలోనూ ఒక వ్యవస్థ ఏర్పడగలదని ప్రతిపాదిత క్లబ్‌ను ఉద్దేశించి చెప్పారు.

Image copyright Getty Images

ఈ క్లబ్ ఏర్పాటులో రాజకీయపరమైన సవాళ్లు ఇమిడి ఉన్నాయి.

కొనుగోలుదారుల క్లబ్ ఏర్పాటుచేయడం, దీని ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగించడం పెద్ద సవాలేనని సౌల్ కవోనిక్ అనే ఇంధన విశ్లేషకుడు నిరుడు జూన్‌లో 'ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పత్రికతో వ్యాఖ్యానించారు.

ఈ క్లబ్ ఏర్పడి ప్రభావవంతంగా సాగాలంటే భారత్, చైనా, ఈ రెండు దేశాల్లోని ఇంధన కంపెనీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)