నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్‌ల ‘వ్యక్తి పూజ రాజకీయాలు’

  • 22 మే 2019
మోదీ, ట్రంప్ Image copyright Getty Images

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో విడత అధికారం కోసం ఈ ఎన్నికల ప్రచారంలో 140కి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ కూడా ఇంతే సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించారు. వీరిద్దరి పర్సనాలిటీ రాజకీయాలు - అంటే వ్యక్తి ఆరాధన రాజకీయాల మధ్య సారూప్యతను బీబీసీ ప్రతినిధి రజిని వైద్యనాథన్ వివరిస్తున్నారు.

దేశ రాజధాని దిల్లీలో ఆ రోజు ఎండ వేడిమి సాయంత్రం కూడా సెగలు పుట్టిస్తోంది. గాలిలో దుమ్ము రేగుతోంది. రామ్‌లాలా మైదానంలో జనం గుమిగూడుతున్నారు.

అక్కడికి వెళ్లే దారి పొడగునా ప్రధాని నరేంద్రమోదీ కార్డ్‌బోర్డ్ కటౌట్లు వరుసగా నిలబెట్టి ఉన్నాయి. అవి మనిషికన్నా చాలా ఎత్తుగా ఉన్నాయి.

మైదానం లోపలికి వెళ్లటానికి అధికార భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు గుంపులు గుంపులుగా లైన్లలో వేచివున్నారు. ఆ పక్కనే ఒక బ్యాండ్ పార్టీ బాలీవుడ్ పాటలను మోగిస్తోంది. మామూలుగా భారతీయ పెళ్లిళ్లలో కనిపించే దృశ్యమది.

కొంత మంది చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకొందరు ''మోదీ.. మోదీ...'' అని నినాదాలు చేస్తున్నారు.

అకస్మాత్తుగా విక్రేతలు నా ముందు వాలారు. ''బీజేపీ గొడుగు కావాలా?'' అని ఒక వ్యక్తి అడిగాడు. అడుగుతూనే ఒక గొడుగును విప్పాడు. దాని మీద ఆకుపచ్చ, నారింజ రంగులు విచ్చుకున్నాయి.

ఈ రకం రాజకీయ ఉన్మత్తత నాకు ఎక్కడో చూసినట్లు అనిపించింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ బహిరంగ సభల్లోనూ ఇదే ఉద్రేకం, ఉద్వేగం కనిపించాయి.

''అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం'' అనే హామీ పునాదిగా ట్రంప్ ప్రచారం సాగింది. ''మళ్లీ నమో'' అని ఇక్కడ బీజేపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు.

Image copyright BBC/GETTY IMAGES
చిత్రం శీర్షిక బీజేపీ 'నమో అగైన్' నినాదం.. ట్రంప్ ’మేక్ ఇండియా గ్రేట్ అగైన్’ నినాదం తరహాలోనే ఉంది

అరుణ్ బన్సల్ వయసు 27 సంవత్సరాలు. అతడు బీజేపీ కార్యకర్త. 'నమో అగైన్' అని రాసివున్న టీ-షర్ట్ ధరించివున్నాడు.

''ఈ ఎన్నికల్లో అత్యంత పెద్ద విషయాలు జాతీయ భద్రత, పాకిస్తాన్'' అని నాతో చెప్పాడు.

అమెరికాకు దక్షిణాన ఉన్న పొరుగు దేశం మెక్సికో గురించి ట్రంప్ మాట్లాడిన కఠిన మాటలు 2016 అధ్యక్ష ఎన్నికల పోటీని నిర్వచించాయి. ఇప్పుడు 2019 ఎన్నికలు.. భారత పొరుగు దేశం పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో తానే బలమైన వ్యక్తినని చూపించే నరేంద్రమోదీ కాంక్ష నిర్వచిస్తోంది.

సభ జరిగే మైదానంలోకి వెళ్లటానికి ముందు నరేంద్రమోదీలా కనిపించే చాలా మందిలో మొట్టమొదటి వ్యక్తి నాకు ఎదురయ్యాడు. అతడి పేరు ఆత్రి. వయసు ఏడు సంవత్సరాలు. నాలుగేళ్ల వయసు నుంచే మోదీ సభలకు హాజరవుతున్నాడు. అతడిని 'లిటిల్ మోదీ' అని తల్లిదండ్రులు పిలుస్తుంటారు.

అకస్మాత్తుగా.. ఇంతే వేడి, ఉక్కపోత సాయంత్రం వేళ ఫ్లోరిడాలో జరిగిన ట్రంప్ సభ నాకు గుర్తొచ్చింది. అక్కడ ట్రంప్‌లా కనిపించే పలువురు వ్యక్తులను నేను కలిశాను. వాళ్లు ట్రంప్‌లా కనిపించటానికి ప్రకాశవంతమైన పసుపుపచ్చ విగ్గులు ధరించారు. నకిలీ ట్యాన్ పూసుకున్నారు. ఎర్రటి టైలు కట్టుకున్నారు.

ఇక్కడి వారు మోదీలాగా తెల్ల గడ్డం, కళ్లద్దాలు ధరించారు.

''మోదీ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు. పేదవాళ్లకి, అందరికీ సాయం చేస్తాడు'' అని చెప్పాడు ఆత్రి. తను కూడా ఏదో ఒక నాటికి ప్రధానమంత్రి కావాలన్నది అతడి ఆశయం.

Image copyright GETTY IMAGES/BBC
చిత్రం శీర్షిక ట్రంప్ తరహాలోనే మోదీ మీది భక్తి కూడా దుస్తులకు పాకింది

దేశభక్తి సంగీతం వెల్లువగా ప్రవహిస్తుండగా మేం సభా ప్రాంగణంలోకి ప్రవేశించాం. సీట్లు నిండుతున్నాయి. ఇద్దరు నాయకులకూ ఒక ఉమ్మడి నేర్పు ఉంది. తమ మూలాధారమైన మద్దతుదారులు.. తాము వారికి బాగా దగ్గరివారిమని భావించేలా చేయటం.

ఇక తర్వాతి దశ వస్త్రధారణ.

ఇద్దరి సభల్లోనూ ప్రాధమిక యూనిఫాం.. శిరోధారణం నుంచి మొదలవుతుంది. అమెరికాలో ట్రంప్ ట్రేడ్‌మార్క్ 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అని రాసిన ఎరుపు రంగు టోపీలు. ఇక్కడ 'నమో అగైన్' అని రాసిన నారింజ రంగు టోపీలు.

నరేంద్రమోదీ వెయిస్ట్‌కోట్ ధరించి వచ్చాడు హర్మీందర్ సింగ్ భాటియా. అది పాలిస్టర్ ఫినిషింగ్‌తో సాయంత్రపు వెలుగులో కాంతులీనుతోంది.

''మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ ఈ ప్రాంతంలో ఆయన పాల్గొన్న ప్రతి సభకూ నేను వెళ్లాను'' అని చాలా ఉత్సాహంగా చెప్పాడు.

''ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. దేశం గురించి పట్టించుకుంటాడు. ఆయన ఒక బలమైన నాయకుడు. అందుకే ఆయనంటే నాకు ఇష్టం'' అని తెలిపాడు.

మైదానం నిండుతూ ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ జనంలో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉండటం నా దృష్టిని ఆకర్షించింది.

మృదులా అనేజా దిల్లీలో సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె మోదీ సభకు హాజరవటం ఇది మూడో సారి.

చిత్రం శీర్షిక మోదీ ‘బలమైన నాయకుడు’ కాబట్టి ఆయనంటే తనకు ఇష్టమని హర్మీందర్ సింగ్ భాటియా చెప్తారు

వేదిక మీద కోలాహలం మొదలైంది. అసలు కార్యక్రమం మొదలవటానికి ముందు పార్టీ అభ్యర్థులు, ఇతర నాయకులు సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓ రాక్ సంగీత కచేరీ దగ్గర సూపర్ ఫ్యాన్స్ తరహాలోనే.. రాజకీయ గ్రూపులు కూడా ఒకరిని మించి మరొకరు భక్తి చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఒకవైపు ఇదంతా జరుగుతోంటే మరోవైపు నరేంద్ర మోదీ నుంచి నాకు ట్విటర్ నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి.

ట్రంప్ లాగానే మోదీ కూడా తన మద్దతుదారులతో నేరుగా మాట్లాడటానికి సోషల్ మీడియాను వాడుకుంటారు. మోదీ ఈ సభ వద్దకు ప్రయాణిస్తూ ఉంటే.. నా ఫోన్ అలర్ట్‌లతో పింగ్ చేస్తూ ఉంది.

''ప్రధాని మోదీ, నేనూ సోషల్ మీడియాలో ప్రపంచ నాయకులం'' అని ట్రంప్ చెప్పాడు. 2017లో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో వీరిద్దరూ భేటీ అయినపుడు ఆయన ఆ మాట అన్నాడు. ట్రంప్‌కి 6.04 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. మోదీకి 4.73 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

నా ఫోన్ మీద నుంచి కళ్లు పైకెత్తి చూస్తే.. మోదీలా కనిపించే మరో వ్యక్తి పక్క నుంచి కనిపిస్తూ పోయాడు. సరిగ్గా చూడటానికి నేను మళ్లీ చూపు సారించాను.

అతడి పేరు రణ్‌వీర్ ధియామ్. మాజీ ప్రభుత్వ అధికారి. ఇప్పుడు మోదీ సభలకు తిరుగుతున్నాడు. ''ఈ ఎన్నికల్లో నాతో సెల్ఫీ కోసం ఐదు వందల మంది అడిగారు'' అని గర్వంగా చెప్పాడు.

ఆ జాబితాలో నేను 501వ వ్యక్తిగా చేరాను. మోదీకి నేను అత్యంత దగ్గరగా వెళ్లగలిగింది ఇంతవరకే. ఇది కూడా లెక్కలోకి వస్తుందని మీరు అసలు అనుకుంటే.

ట్రంప్ తరహాలోనే మోదీ కూడా తాను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న వాళ్లకే ఇంటర్వ్యూ ఇస్తారు. బీజేపీ పట్ల ఎక్కువ సానుభూతితోనూ, ఎక్కువగా ప్రశ్నించని సంస్థలనే ఎంచుకుంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇలాగే చేస్తారు. ఆయన తను మాట్లాడటానికి ఎక్కువగా ఫాక్స్ న్యూస్‌కే ప్రాధాన్యం ఇస్తారు.

Image copyright BBC/GETTY IMAGES
చిత్రం శీర్షిక ఏడేళ్ల ‘లిటిల్ మోదీ’ ఆత్రి నాలుగేళ్ల వయసు నుంచే మోదీ సభలకు హాజరువున్నాడు

సభలో సమూహం కొంతసేపు మౌనం దాల్చింది. అసలు మోదీ దారిలో ఉన్నారని మాకు చెప్పారు.

కొన్ని నిమిషాలకు ప్రధాని మోదీని వేదిక మీదకు ఆహ్వానించారు. ''వైమానిక దాడి''లా అందరూ చప్పట్లను హోరెత్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ లోపల నిర్వహించామని భారతదేశం ప్రకటించిన వైమానిక దాడులకు పరోక్ష ప్రస్తావన అది.

జనం అంతకన్నా ఎక్కువే చేశారు. పెద్ద పెట్టున కేకలు, అరుపులతో హోరెత్తారు. మొబైల్ ఫోన్లను గాలిలో ఊపుతూ ''మోదీ.. మోదీ...'' అంటూ స్వరాలు కలుపుతూ నినదించారు.

''భారత్ మాతా కీ జై'' అంటూ నరేంద్రమోదీ తన ప్రసంగం ప్రారంభించారు.

నాకు మరోసారి 2016 అమెరికా ఫ్లాష్‌బ్యాక్‌ కనిపించింది. నాడు అక్కడ ''అమెరికా... అమెరికా...'' అంటూ కోరస్ వినిపించింది.

ట్రంప్ సభల్లో కనిపించిన నాటకీయ శైలిలోనే మోదీ కూడా సభికులతో సంభాషణను ప్రోత్సహిస్తారు.

''ఉగ్రవాదులను మనం వారి ఇళ్లలో చంపాలా వద్దా? అని అడుగుతారు. ''నాకు చెప్పండి.. వద్దా?'' అని మళ్లీ అడుగుతారు.

''కాదు.. మనం చంపాలి'' అని సమూహం బదులిస్తుంది.

చిత్రం శీర్షిక మోదీ లాగా కనిపించే వ్యక్తి రణ్‌వీర్ ధియామ్‌తో బీబీసీ సిబ్బంది

మోదీ తన ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని విమర్శించటానికి కూడా సమయం కేటాయిస్తారు.

మోదీ, ట్రంప్ ఇద్దరూ.. రాచరిక పాలక వర్గానికి చెందిన వారుగా తాము పరిగణిస్తున్న వారిని తిరస్కరించే బయటి నాయకులుగా తమను తాము ప్రదర్శిస్తారు. ఇద్దరూ రాజకీయ వారసత్వాలకు వ్యతిరేకంగా పోటీ చేశారు. మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య అయిన హిల్లరీ క్లింటన్ మీద ట్రంప్ పోటీ చేస్తే.. నెహ్రూ - గాంధీ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీతో మోదీ తలపడ్డారు.

''ఖాన్ మార్కెట్ గ్యాంగ్'' అంటూ మోదీ గేలిచేస్తారు. దిల్లీలోని అత్యంత విశేషమైన ప్రాంతంలో నివసించే దేశంలో అత్యంత విశిష్టులైన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యానం అది.

అంతకుముందు ఎన్నడూ ప్రభుత్వ పదవి చేపట్టని ట్రంప్ కూడా.. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్నత వర్గాన్ని.. ''బురద'' మందగా అభివర్ణించారు.

''వాళ్లు తమ పూర్వీకుల పేర్లతో ఓట్లు అడుగుతారు. కానీ వాళ్ల పూర్వీకులు ఏం చేశారని, ఈ దేశానికి ఏం చేశారని నేను అడిగినపుడు.. వాళ్లకి కోపం వస్తుంది'' అంటారు మోదీ. ఆయన మాటలను ఆమోదిస్తూ వందలాది మంది గర్జిస్తారు.

ప్రతిపక్షం మీద దాడి చేయటంలో ఆయన సంశయించలేదు. అంతేకాదు.. తన ప్రత్యర్థి దివంగత తండ్రిని విమర్శించటం ద్వారా మోదీ ఇంకా దిగజారారని చాలా మంది భావించారు.

1991లో హత్యకు గురైన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీని ''నంబర్ వన్ అవినీతిపరుడు'' అని ఆయన అభివర్ణించారు.

Image copyright BBC/GETTY IMAGES
చిత్రం శీర్షిక మోదీ, ట్రంప్ మద్దతుదారులు ఇరువురూ తమ నాయకులు ఉన్నత వర్గాల వారిని సవాల్ చేస్తున్నారని భావిస్తుంటారు

క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయిన సెనెటర్ జాన్ మెక్‌కెయిన్ మీద డోనల్డ్ ట్రంప్ కూడా ఇదే తరహా విమర్శలు చేయటం నాకు గుర్తొచ్చింది.

ట్రంప్, మోదీ ఇద్దరూ తాము సూటిగా మాట్లాడతామని గర్విస్తూ ఉంటారు. కానీ.. వారి ప్రసంగాలు కొన్నిసార్లు వికారంగా దిగజారుతుంటాయి.

కానీ వీరిద్దరి మాటలు రాజకీయ సభ్యతను ఉల్లంఘించినా కూడా పట్టించుకోనంతగా వారి వారి మద్దతుదారుల నుంచి ఆమోదం లభిస్తోంది.

వ్యక్తి ఆరాధన రాజకీయాలు అనేది ఈ ఇద్దరు నాయకులనూ కలుపుతుంది. పాలక వర్గాలు సాధారణంగా విస్మరించే గొంతుల తరఫున నిలబడటానికి ట్రంప్, మోదీ వంటి వ్యక్తులు సిద్ధంగా ఉంటారని.. ఆ నాయకుల మద్దతుదారులు విశ్వసిస్తారు.

''మోదీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఆకర్షణ'' అని చెప్పాడు దిల్లీకి చెందిన ఒక మెకానిక్ సంతోష్. అతడి చేతుల్లో ఉన్న అతడి 18 నెలల కూతురు వస్త్రధారణ కూడా ప్రధాని మోదీ తరహాలోనే ఉంది.

''ఒకపూట భోజనం మానేయటానికి నేను సిద్ధం. కానీ మన దేశాన్ని ఎవరైనా అవమానించటానికి నేను ఒప్పుకోను. అందుకే మోదీ అంటే నాకు ఇష్టం'' అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం