పాకిస్తాన్‌లో తుపాకీతో బెదిరించి భారతీయ యువతికి పెళ్లి.. చిత్రహింసలు

  • 22 మే 2019
సుష్మ స్వరాజ్, ఉజ్మా అహ్మద్ Image copyright Getty Images

పాకిస్తాన్‌లో కొంతకాలం చిక్కుకుపోయి, భారత్‌కు తిరిగి వచ్చిన ఉజ్మా అహ్మద్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు.

రెండేళ్ల కిందట పాక్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది.

అక్కడ తాహిర్ అలీ అనే వ్యక్తి తుపాకితో బెదిరించి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని, ఆయన కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేసిందని ఉజ్మా ఆరోపణలు చేశారు. తన ఇమిగ్రేషన్ పత్రాలను కూడా వారు లాక్కున్నారని చెప్పారు.

అయితే, ఉజ్మా ఆరోపణలు అవాస్తవమని తాహిర్ అలీ అన్నారు.

స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ భారత హైకమిషన్ సహకారంతో పాక్‌లోని ఓ కోర్టును ఉజ్మా ఆశ్రయించారు. భారత్‌లో తన కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉజ్మా వ్యవహారంలో భారత విదేశాంగమంత్రి సుష్మ స్వరాజ్ చొరవ చూపారు. భారత హైకమిషన్ ఉజ్మాకు ఆశ్రయం కల్పించి, న్యాయపోరాటంలో అండగా నిలిచింది.

తాహిర్ నుంచి ఇమిగ్రేషన్ పత్రాలను ఉజ్మాకు పాక్ కోర్టు ఇప్పించింది. 2017, మే 25న వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లో ఉజ్మా అడుగుపెట్టారు.

ఆమెను 'ఇండియాస్ డాటర్' (భారత్ పుత్రిక)గా వర్ణిస్తూ సుష్మ స్వరాజ్ ట్విటర్ వేదికగా స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వయంగా కలిశారు కూడా.

Image copyright Kamlesh and Manish Jalui

భారత్‌కు ఉజ్మా తిరిగొచ్చి రెండేళ్లు అవుతోంది.

ఈ కాలంలో ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.

పాక్‌లో తాను అనుభవించిన విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ తనకు వణుకు పుడుతుందని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

''నేను మలేసియాలో ఉండగా తాహిర్ పరిచయమయ్యాడు. పాక్ సందర్శనకు రావాలని పదేపదే అతడు అడగడంతో అంగీకరించి, వెళ్లా. అక్కడ జరిగిన విషయాలను తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. వాటిని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నా'' అని చెప్పారు.

తన కుమార్తె ఫలక్ పేరుతో దిల్లీలోని సీలమ్‌పుర్‌లో ఉజ్మా ఓ పార్లర్ తెరిచారు.

ఉజ్మా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.

ఆర్థికంగా, మానసికంగా నిలదొక్కుకునేందుకు ఆ చిత్ర నిర్మాత తనకు సహకరిస్తున్నారని ఆమె చెప్పారు.

Image copyright Kamlesh and Manish Jalui

కుటుంబ సభ్యుల నుంచి తనకు ఇప్పుడు ఎలాంటి మద్దతూ లేదని, ఒంటరి తల్లిగానే జీవితం వెళ్లదీస్తున్నానని ఆమె అన్నారు.

అయితే, ప్రస్తుతం తమ పరిస్థితి మెరుగ్గా ఉందని, తన కుమార్తెకు ఎయిమ్స్‌లో చికిత్సలు జరుగుతున్నాయని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు