బ్రిటన్ ప్రధాని థెరెసా మే పతనానికి బ్రెగ్జిట్ ఎలా కారణమైంది?

  • 24 మే 2019
థెరెసా మే Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెగ్జిట్ ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం కోసం థెరెసా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు

బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన రెండో మహిళగా చరిత్రకెక్కిన థెరెసా మే అర్ధంతరంగానే ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. బ్రెగ్జిట్ విషయంలో సొంత పక్షం కన్సర్వేటివ్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

బ్రిటన్ తొలి మహిళ ప్రధాని మార్గరెట్ థాచెర్ కూడా ఇలాగే పూర్తి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే, థాచెర్‌లా దేశంపై తనదైన ముద్రను థెరెసా వేయలేకపోయారు.

బ్రిటన్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను రూపుమాపాలని, విస్మరణకు గురైన వర్గాలకు చేరువవ్వాలని ఆమె నిర్దేశించుకున్న లక్ష్యాలను.. ‘బ్రెగ్జిట్’ అన్న ఒకే ఒక్క పదం కమ్మేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భర్త ఫిలిప్‌ మేతో థెరెసా

యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరుపడే ప్రక్రియ పేరే బ్రెగ్జిట్. ఈ విషయంపై 2016లో బ్రిటన్‌లో రెఫరెండం జరిగింది. మెజార్టీ ప్రజలు ఈయూ నుంచి వేరుపడేందుకే మొగ్గు చూపారు.

థెరెసాకు ముందు డేవిడ్ కామెరూన్ ప్రధాని పదవిలో ఉండగా, ఈ రెఫరెండం జరిగింది.

ప్రధాని పదవిలో థెరెసా మూడేళ్లు ఉన్నారు. ఈ మొత్తం పాలనా కాలాన్ని బ్రెగ్జిటే నిర్దేశించింది.

యురోపియన్ యూనియన్, బ్రిటన్ పార్లమెంటు నుంచి ఎదురైన అవమానాలు, శిక్షలను థెరెసా తట్టుకున్న తీరు చూసి ఆమె విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు.

బ్రెగ్జిట్‌ ఒప్పందం కోసం విఫలయత్నాలు

మంత్రుల రాజీనామాలు, పార్లమెంటులో తిరుగుబాటులు ఎదురైనప్పుడు సాధారణంగా ప్రధాని పదవీకాలానికి తెరపడినట్లే. అయితే, థెరెసా ఇలాంటి గండాల నుంచి గట్టెక్కారు.

పార్లమెంటుపై, పార్టీపై అధికారం కోల్పోతున్నా, చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా.. సొంత ఎంపీలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

సుస్థిరత కోసం అంటూ 2017లో బ్రిటన్ పార్లమెంటును రద్దు చేసి థెరెసా ఎన్నికలకు వెళ్లారు.

Image copyright PA
చిత్రం శీర్షిక సొంత ఎంపీలు తన నాయకత్వాన్ని కోరుకోవడం లేదన్న విషయాన్ని చివరికి థెరెసా అంగీకరించాల్సి వచ్చింది

ఫలితాలు ఆమె అనుకున్నట్లుగా రాలేదు. కన్సర్వేటివ్ పార్టీకి అంతకుముందు ఉన్న మెజార్టీ కూడా పోయింది. హంగ్ ఏర్పడింది. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.

ఈ స్వయంకృత గాయం నుంచి థెరెసా కోలుకోలేకపోయారు. బ్రెగ్జిట్ పూర్తయ్యేవరకూ ఆగాలన్న ఉద్దేశంతోనే ఆమెకు ఎంపీలు మద్దతుగా నిలుస్తున్న వాతావరణం కనిపించింది.

ఈ ఏడాది ఆరంభంలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు, 2022 ఎన్నికల కన్నా ముందే పదవి నుంచి తప్పుకొంటానని థెరెసా హామీ ఇవ్వాల్సి వచ్చింది.

బ్రెగ్జిట్ విషయంలో ప్రతిష్ఠంభనకు కారణమని నిందిస్తూ చాలా మంది ఎంపీలను ఆమె దూరం చేసుకున్నారు.

కన్సర్వేటివ్ పార్టీ, సొంత ఎంపీలు తన నాయకత్వాన్ని ఇక ఎంత మాత్రమూ కోరుకోవడం లేదన్న విషయాన్ని చివరికి ఆమె బలవంతంగానైనా అంగీకరించాల్సి వచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తాను వైదొలుగుతున్న విషయాన్ని థెరెసా వణుకుతున్న గొంతుతో ప్రకటించారు. ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు

తుది త్యాగం

ఈయూతో చర్చించిన ఉపసంహరణ ఒప్పందాన్ని ఆమోదిస్తే తాను వైదొలుగుతానని థెరెసా తుది త్యాగానికి సిద్ధపడ్డారు.

అయితే ఈ ఒప్పందం ముసాయిదాపై పార్లమెంటుతో ఆమోద ముద్రను వేయించలేకపోయారు.

2019, జనవరిలో ఆమె ప్రవేశపెట్టిన ఒప్పందాన్ని రికార్డు మెజార్టీతో పార్లమెంటు తిరస్కరించింది.

ఒప్పందానికి మార్పులు చేసి, మరో రెండు సార్లు థెరెసా పార్లమెంటు ఆమోదం కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

థెరెసా ప్రతిపాదించిన ఒప్పందం చాలా కఠినంగా ఉందని ఈయూలోనే బ్రిటన్ కొనసాగాలని వాదించేవారు అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ఈ ఒప్పందంతో ఆశించిన స్థాయిలో ఈయూతో బ్రిటన్‌కు సంబంధాలు తెగడం లేదని కరడు గట్టిన కన్సర్వేటివ్ నేతలు వ్యాఖ్యానించారు.

దిగువ సభలో ఆమోదం తప్పనిసరి కావడంతో, రాజీ కోసం ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత జెరెమీ కోర్బిన్‌ను థెరెసా సంప్రదించారు.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక రాజీ కోసం ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత జెరెమీ కోర్బిన్‌ను థెరెసా సంప్రదించారు

ఆరు వారాల పాటు సాగిన వీరి చర్చలు ఏ అంగీకారమూ లేకుండానే ముగిశాయి. ఇది ఊహించిన పరిణామమేనని కన్సర్వేటివ్ ఎంపీలు చాలా మంది అభిప్రాయపడ్డారు.

యురోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో బ్రిటన్ కూడా పాల్గొనేందుకు అంగీకరించాల్సి రావడంతో థెరెసా మరో అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని గతంలో థెరెసానే అన్నారు.

ప్రస్తుతం చాలా మంది ఎంపీలు ఆమె మాట వినడం మానేశారు. ఎలాంటి బ్రెగ్జిట్ ప్రక్రియకైనా ఆమె అవరోధమన్న భావనకు వచ్చేశారు.

పూర్తిగా ఒంటరైపోయిన థెరెసా, చివరికి ‘తనకు అత్యంత ప్రియమైన పదవి’లో ఇక కొనసాగలేనన్న వాస్తవాన్ని అంగీకరించకతప్పలేదు. ఆమె పదవీకాలానికి ఇంతటితో తెరపడింది.

ప్రధాని పదవితోపాటు కన్సర్వేటివ్ పార్టీ అధినేత పదవి నుంచి తాను వైదొలుగుతున్నాని థెరెసా వణుకుతున్న గొంతుతో శుక్రవారం ప్రకటించారు. ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు.

అధికారికంగా ఆమె ప్రధాని పదవి నుంచి జూన్ 7న వైదొలుగుతారు. బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరన్నది కన్సర్వేటివ్ పార్టీ నిర్ణయిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)