మోదీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌తో పరిస్థితిలో మార్పు వస్తుందా

  • 27 మే 2019
మోదీ, ఇమ్రాన్ Image copyright Getty Images

ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్ దాడి, ఆ తర్వాత బాలాకోట్‌లో భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రైక్స్ జరిపిన తర్వాత మొదటిసారి భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు నేరుగా మాట్లాడుకున్నారు.

ఆదివారం పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలిపారని భారత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాన మంత్రితో ప్రాంతీయ శాంతి, అభివృద్ధి కోసం తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు పోరాడాలని గట్టిగా చెప్పారని భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

"మన ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక విశ్వసనీయమైన, హింస, తీవ్రవాదం లేని వాతావరణం చాలా అవసరం" అని ప్రధాన మంత్రి మోదీ అన్నారని ఈ ప్రకటనలో తెలిపారు.

అటు పాకిస్తాన్ విదేశాంగ శాఖ తమ ప్రకటనలో "టెలిఫోన్ కాల్ చేసిన ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధానితో దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి, పరస్పర సహకారానికి తాము కట్టుబడి ఉన్నాం" అని చెప్పారని తెలిపింది.

భారత ప్రధాన మంత్రితో కలిసి ఈ అంశాలపై పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టు ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

Image copyright Getty Images

2014లో ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్

పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచినపుడు ఆయన తన ప్రమాణ స్వీకార వేడుకకు దక్షిణాసియా దేశాల అగ్ర నేతలను ఆహ్వానించారు.

ఆ ప్రమాణ స్వీకార వేడుకలో పాకిస్తాన్ అప్పటి ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. ఈసారీ నరేంద్ర మోదీ మే 30న ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

మోదీ ఈసారీ ఏయే దేశాల ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానిస్తారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో "ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, నేపాల్ మాజీ ప్రధాన మంత్రి కూడా టెలిఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు" అని చెప్పింది.

చారిత్రక విజయం సాధించినందుకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, మిలిటెంట్లతో పోరాడాల్సిన ప్రాధాన్యం గురించి మాట్లాడారు. బదులుగా ఆయనకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ కూడా... ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, శాంతికి కలిసి పనిచేస్తామని భరోసా ఇచ్చారు.

అటు నేపాల్ మాజీ ప్రధాన మంత్రి మాధవ్ కుమార్ నేపాల్ కూడా నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శక్తిగా భారత అభివృద్ధి మొత్తం ప్రాంతంపై ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)