హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ

  • 27 మే 2019
క్రీ.పూ. 2వ శతాబ్దంలో సముద్రంలో మునిగిన హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO
చిత్రం శీర్షిక సముద్రంలో మునిగిన హెరాక్లియాన్

'హెరాక్లియాన్' సముద్రంలో మునిగిపోయి, కనుమరుగైపోయేవరకూ ఫారోల కాలంలో ఈజిఫ్టు దేశానికి ఒక ప్రధాన రేవు పట్టణంగా, దేశంలోని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇది థోనిస్ కథ, హెరాక్లియాన్‌గా ఇది చాలా మందికి తెలుసు. నైలునది ప్రారంభమయ్యే చోట ఏర్పడిన ఈ నగరం 2500 ఏళ్ల క్రితమే అపార సంపదకు, సంక్షేమానికి చిరునామాగా నిలిచింది.

ఫారోల పతనాన్ని చూసిన హెరాక్లియాన్ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఈజిఫ్టుపై అలెగ్జాండర్ విజయంతో మొదలైన హాల్లెంస్టిక్ కాలానికి సాక్ష్యంగా నిలిచింది.

కానీ తర్వాత దాదాపు వందేళ్లకు అది సముద్రంలో కలిసిపోయింది.

అలా ఎందుకు జరిగిందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుపట్టని ఒక మిస్టరీగా మిగిలింది.

సముద్రగర్భంలో కలిసిపోయిన కొన్నేళ్ల తర్వాత హెరాక్లియాన్ ఉనికి ఒక కల్పిత కథలా అయిపోయింది.

క్రీ.పూ. 2వ శతాబ్దంలో సముద్రంలో మునిగిన హెరాక్లియాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక గ్రీకుల హీరో హెర్కులెస్‌కు గౌరవంగా ఈ నగరానికి హెరాక్లియాన్ అనే పేరు పెట్టారు

'హెర్కులస్' పేరుతో నగరం

రేవు పట్టణంగానే కాదు, గ్రీక్ పురాణాల్లో ఈ నగరానికి ఒక ముఖ్యమైన చోటుంది. ట్రోజన్ యుద్ధానికి ముందు హెలెన్ ఆఫ్ ట్రాయ్, ఆమె ప్రియుడు పారిస్ ఇక్కడే గడిపారు.

రోమన్ పురాణాల ప్రకారం గ్రీకుల దేవుడు హెరాక్లిస్ లేదా హెర్కులెస్ ఈజిఫ్టులో అడుగుపెట్టినపుడు మొట్టమొదట వచ్చింది ఇక్కడికే.

హెర్కులెస్‌కు ఇక్కడ ఆలయం కూడా నిర్మించడంతో ఈ నగరానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఏర్పడింది.

గ్రీకు పురాణాల్లో హీరోగా నిలిచిన హెర్కులెస్‌కు దీనితో సంబంధం ఉండడంతో గ్రీకులు ఈ నగరాన్ని దాని అసలు పేరు 'థోనిస్‌' అనడానికి బదులు 'హెరాక్లియాన్' అని పిలుచుకున్నారు.

రెండు వేల సంవత్సరాలకు పైగా ఈజిఫ్టు తీరంలో ఉన్న హెరాక్లియాన్ తర్వాత మధ్యదరా సముద్రంలో మునిగిపోయి కనుమరుగైంది.

ఒక ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఐదేళ్ల అన్వేషించి 1999లో దీనిని గుర్తించేవరకూ హెరాక్లియాన్ నగరం గురించి ఎవరికీ తెలీదు.

క్రీ.పూ. 2వ శతాబ్దంలో సముద్రంలో మునిగిన హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO

చారిత్రక అన్వేషణ

ప్రస్తుత ఈజిఫ్టియన్ తీరానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున ఫ్రాంక్ గోడ్డియో ఒక గోడను గుర్తించారు.

దాని వెనక ప్రాచీన ఈజిఫ్టుకు చెందిన ఒక విశాలమైన ఆలయం గుర్తించాడు.

కానీ సున్నపురాయితో కట్టిన ఈ ఆలయం అవశేషాలు మాత్రమే అక్కడ కనిపించాయి.

గోడ్డియో , యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌మెరైన్ ఆర్కియాలజీ(ఎల్ఈఏఎస్ఎం) బృందం మొత్తం నగరానికి చెందిన అవశేషాలను గుర్తించింది.

ఒక కిలోమీటరు వెడల్పు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న నగరంలో ఎన్నో ఇళ్లు, రాజ భవనాలు, ఆలయాలను కనుగొంది.

హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO
చిత్రం శీర్షిక ఈ నగరం కిలోమీటరు వెడల్పు, 2 కిలోమీటర్ల వెడల్పు ఉంది.

ఈ ప్రాచీన ఈజిఫ్టు నగరం ఎలా ఉంది

ఇక్కడ పరిశోధకులు భారీ విగ్రహాలు, కంచు కళాఖండాలు, వేడుకలకు ఉపయోగించే నౌకలు, బంగారం, ఆభరణాలు, నాణేలు గుర్తించారు.

ఇక్కడ వారికి దొరికిన ప్రాచీన అవశేషాల్లో అత్యంత ముఖ్యమైనవి చెక్కతో తయారైనవే.

గోడ్డియో, ఆయన సహచరులు ఇక్కడ ఇప్పటివరకూ ఎవరూ గుర్తించని అత్యంత పురాతన నౌకలకు సంబంధించిన అవశేషాలు కనుగొన్నారు.

పురాతన ఈజిఫ్టు నగరంలో అత్యంత ముఖ్యమైన నిర్మాణాల పురోగతిని తెలుసుకోడానికి ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి.

హెరాక్లియాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బరి నౌక చిత్రం

అత్యంత పురాతన నౌక 'బరిస్'

పరిశోధకులు అబూకిర్ బేలో సముద్రం అడుగున గుర్తించిన దాదాపు 70 నౌకల్లో ఒకటి వారికి భిన్నంగా అనిపించింది. దాంతో వారు దాన్ని 'షిప్ 17' అని పిలుస్తున్నారు.

నౌకల మిగతా అవశేషాలు కూడా బయటకు తీసి కొన్ని ఏళ్ల పాటు వాటిపై పరిశోధనలు చేసిన ఈ బృందం మార్చిలో ఈ నౌక గురించి ఒక చారిత్రక ప్రకటన చేసింది.

ఈ అవశేషాలను ఇప్పటివరకూ కల్పితంగానే భావిస్తూ వచ్చిన 'బరి' అనే ఒక పడవకు చెందినవని చెప్పింది.

గ్రీక్ తత్వవేత్త, చరిత్రకారుడు హెరటోడస్ క్రీ.పూ 5వ శతాబ్దంలో ఈజిఫ్టును సందర్శించినప్పుడు 'బరి' అనేవి సరుకులు తీసుకెళ్లే భారీ నౌకలని వర్ణించారు.

ఈ ఈజిఫ్టు నౌకల గురించి ఆయన అప్పట్లో చాలా వివరంగా చెపారు. కానీ అవి నిజమే అనడానికి ఆధారాలేవీ లభించకపోవడంతో చాలా మంది వీటిని కల్పితం అనే అనుకున్నారు.

హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO
చిత్రం శీర్షిక 70 నౌకల అవశేషాలను పరిశోధకులు కనుగొన్నారు. వీటిలో కొన్ని నౌకలను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు

కల్పితం కాదు అక్షరాలా నిజం

అప్పుడు హెరోటోడస్ అబద్ధాలు చెప్పలేదని నిరూపించడానికి 2500 ఏళ్లు పట్టింది.

'బరి' నౌక 28 మీటర్ల పొడవు ఉంటుంది. ఆ కాలంలో ఈ పరిమాణం చాలా పెద్దదనే లెక్క. దీని డిజైన్ అప్పట్లో సమయంలో నైలు నదిలో ప్రయాణించడానికి వీలుగా ఉంది.

దీనితోపాటు కనుగొన్న కొన్ని నౌకల శిథిలాల ద్వారా వారు ఆచారాలు, సంప్రదాయాల కోసం వేరే పవిత్రమైన పడవలు కూడా ఉపయోగించేవారని తెలిసింది.

ఈజిఫ్టు చరిత్ర అంతటా ఇలా వేడుకలకు ఉపయోగించే నౌకల ప్రస్తావన ఉంది.

పడవల్లో కొన్నింటిని దేవుళ్లకు సమర్పించేందుకు పూజారులు కావాలనే సముద్రంలో ముంచేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO
చిత్రం శీర్షిక హెరాక్లియాన్ రాతి శాసనం రోసెట్టా రాయి కంటే పురాతనమైనదని గుర్తించారు

హెరాక్లియాన్ రాతి శాసనం

సముద్రంలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన మరో వస్తువు రెండు మీటర్లకు పైగా పొడవున్న ఒక నల్ల గ్రానైట్ రాయి.

దీనిపై హీరాగ్లఫిక్స్ ఉన్నాయి. వాటిని చెక్కిన ఈ రాయి ప్రముఖమైన రోసెట్టా రాయి కంటే పురాతనమైనదని భావిస్తున్నారు.

'సముద్రం మింగేసిన అతిపెద్ద పురాతన ఈజిఫ్టు నగరం' అనే బీబీసీ డాక్యుమెంటరీలో ఈ అద్భుతమైన రాయిని చూపించారు. దాని విశేషాలను వివరించారు.

ఆ రాయి 2000 ఏళ్ల నుంచీ అన్ని పరిస్థితులనూ తట్టుకుని నిలిచిందని పరిశోధకులు చెప్పారు.

ఈ హీరాగ్లఫీ ఆధారంగా ఇక్కడకు వచ్చే విదేశీ నౌకల నుంచి రేవులో వసూలు చేసిన సుంకాలు వివరాలు తెలుసుకున్నారు.

హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATIO
చిత్రం శీర్షిక ఐదు మీటర్లకు పైగా పొడవున్న ఫారోలు, వారి భార్యల విగ్రహాలను వెలికితీశారు

రాతి పెట్టె 'నాస్'

హెరాక్లియాన్‌ గురించి బయటపడిన ఆధారాల వల్ల ఈ నగరానికి రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలిసింది.

సముద్రం అడుగున హెర్కులెస్ ఆలయం లోపల పరిశోధకులు ఒక పెద్ద రాతి పెట్టెను కూడా గుర్తించారు. దాని పేరు 'నాస్'. అది ఆలయంలో పవిత్రమైన కేంద్రం.

ఆ రాతి పెట్టె చుట్టూ ఫారోలు పొందే అధికారాల గురించి చెక్కారు. దానిపై ఉన్న వివరాల ప్రకారం కొత్త ఫారోలు తమ దైవ శక్తులు పొందడానికి, తమ పాలనను చట్టబద్ధం చేయడానికి హిరాక్లియాన్‌ నగరంలో ఆ ఆలయానికి వెళ్లి, నాస్‌ను సందర్శించేవారు.

ఈ నగరానికి అంత విశిష్టత ఉన్నప్పటికీ అది సముద్రంలో మునిగిపోకుండా ఎవరూ కాపాడుకోలేకపోయారు.

హెరాక్లియాన్ Image copyright CHRISTOPH GERIGK © FRANCK GODDIO / HILTI FOUNDATI
చిత్రం శీర్షిక భారీ రాతి తొట్టె

నైల్ డెల్టాలో భూమి అస్థిరంగా ఉండని వల్లే అది సముద్రంలో కుప్పకూలిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూకంపం లేదా సహజ విపత్తుల వల్ల అది సముద్రంలో కలిసిపోయిందని చెబుతున్నారు.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించేలా, ఏ నేల వల్ల హెరాక్లియాన్ నగరం సముద్రంలో కలిసిపోయిందో... అదే నైలు డెల్టా మట్టి ఆ నగరం అవశేషాలపై పేరుకుని, శతాబ్దాలైనా అవి చెక్కుచెదరకుండా నిలిచేలా చేసింది.

ఆ మట్టి వల్లే ఇప్పుడు ఇన్నివేల ఏళ్ల తర్వాత హెరాక్లియాన్ నగరం కల్పితం కాదని, దానికి ఒక అద్భుత చరిత్ర ఉందని మనకు గోడ్డియో, పరిశోధకుల బృందం ద్వారా తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం