ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు

  • 28 మే 2019
మోనాలీసా కృత్రిమ మేధ చిత్రం Image copyright SAMSUNG

లియొనార్డో డా విన్సీ గీసిన ప్రఖ్యాత మోనా లీసా పెయింటింగ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యయనకారులు ప్రాణం పోశారు.

డా విన్సీ సృష్టించిన మోనా లీసా పెయింటింగ్ ఆధారంగా ఆమె కళ్లు, పెదాలు, ముఖం కదులుతున్నట్లు చూపించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, మాస్కోలోని 'శామ్‌సంగ్ ఆర్టిఫిషియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ' ఈ కదలికలను సృష్టించింది.

అయితే, డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగపరచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ నుంచి సేకరించిన 7 వేలమంది సెలెబ్రిటీల ఫొటోలకు అనుగుణంగా శామ్‌సంగ్ ఆల్గరిథమ్స్‌ను తయారుచేశారు. ఫొటోకు ప్రాణం పోయడానికి, ముఖ ఆకృతి, కదలికలను కృత్రిమ మేధ ద్వారా చిత్రించారు.

ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే సాల్వడోర్ డాలి, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఫీదోర్ దోస్తెయెవ్‌స్కీతోపాటు, మార్లిన్ మన్రో వీడియోలను కూడా రూపొందించారు.

శామ్‌సంగ్‌ బృందం, తాము సృష్టించినవాటి గురించి ఒక పేపర్‌లో వివరిస్తూ.. 'ఇవన్నీ నాడీనిర్మితమైన ముఖాలతో మాట్లాడుతున్నట్లే కనిపిస్తాయి' అన్నారు.

ఈ విధానం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ రూపొందించిన వీడియో పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Image copyright SAMSUNG

ఫేక్ ఒబామా

టెల్ అవివ్ యూనివర్సిటీ అధ్యయనకారులు కూడా 2017లో ఇలాంటి విధానాన్నే ప్రదర్శించారు.

డా.సుపసోర్న్ సువాజానకోర్న్ అనే వ్యక్తి 2017లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నకిలీ(ఫేక్) వీడియోను సృష్టించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ఈ టెక్నాలజీని దుర్వినియోపరచవచ్చు కానీ, కుటుంబ సభ్యులను కోల్పోయి, తీవ్రమైన దుఃఖంలో ఉన్న బంధులకు సాంత్వన కలిగించడానికి కూడా ఈ టెక్నాలజీని వాడొచ్చు అన్నారు.

అయితే, రాజకీయనాయకుల ఫేక్ వీడియోల ద్వారా మొత్తం ప్రజలందర్నీ మోసం చేసే అవకాశం ఉందని, ఈ మోసం అంతటితో ఆగదు అని ఇప్పటికే నిపుణులు చెప్పారు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ఫొటోలను ఉపయోగించి పోర్న్ వీడియోలను కూడా సృష్టించారు.

‘‘'ద ఎన్‌విజనర్స్' అనే ఆర్టిఫిషియల్ కన్సల్టెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ కాప్లిన్ మాట్లాడుతూ, ''నిజం వీడియోల్లాగ అనిపించే ఈ డీప్‌ఫేక్ వీడియోలు నిజంగా ప్రమాదకరమే. ఫేక్ వీడియోలను రూపొందించడం, నమ్మించడం ఎంత సులువో ప్రజలు గుర్తించాలి’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు