బాంబు దాడిలో నిలువెల్లా కాలిపోయి అమ్మకు దూరమైన పసివాడు 30 ఏళ్ల తరువాత మళ్లీ ఎలా కలిశాడు

  • 29 మే 2019
అమర్

కొత్త సంవత్సరం. చలి తీవ్రంగా ఉంది. ఇంగ్లండ్‌ని ఒక ఫ్లాట్. అమర్ ఒక సీల్డ్ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అందులో ఒక దూది ఉండ ఉంది. దానిని ఎలా వాడాలో ఓ పేపర్ మీద సూచనలు ఉన్నాయి.

అమర్ వాటిని అప్పటికే ఎన్నోసార్లు చదివాడు. కాబట్టి మళ్లీ చదవలేదు. అద్దం ముందు నిలుచున్నాడు. ప్యాకెట్‌లోని దూది ఉండని బుగ్గన పెట్టుకున్నాడు. ముప్ఫయి సెకన్లు గడిచాయి.

దూది ఉండని తీసి మరో 30 సెకన్ల పాటు గాలిలో ఊపాడు. మళ్లీ ప్యాకెట్‌లో పెట్టేశాడు. దాని మీద 'డీఎన్ఏ శాంపిల్' అని రాసుంది.

మొత్తం అరవై సెకన్లు. అది అతడి జీవితాన్ని మార్చేసే సమయం.

అమర్

అమర్ కనీమ్. 1990ల ఆరంభంలో అంతర్జాతీయ వార్తాల్లో నిలిచాడు. రాయబారులు, దౌత్యవేత్తలు అతడిని కలిశారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలోనూ పాల్గొన్నాడు. అప్పుడతడి వయసు పదేళ్లు. అతడి ముఖమంతా కాలిపోయిన మచ్చలు.

నాపామ్ దాడిలో సర్వస్వం కోల్పోయిన బాలుడు. అతడిని చూసి ప్రపంచం బాధపడింది. నాటి ఇరాక్ పాలకుడు సద్దాం హుసేన్. సొంత నాయకుడి చేతిలో దేశ ప్రజలు పడుతున్న బాధలకు అతడు ప్రతిరూపం. ప్రపంచం అలాగే భావించింది.

అది 1991 మార్చి. ఇరాక్ దక్షిణ ప్రాంతం. బస్రా నగరం. షియా ముస్లింల ఆవాసం. బాంబులు కురిశాయి. సద్దాం హుసేన్ కురిపించాడు. అప్పటికి గల్ఫ్ యుద్ధం ముగిసింది. అమెరికా సంకీర్ణం చేతిలో దెబ్బతిని ఉన్నాడు. కువైట్ నుంచి మడమ తిప్పక తప్పలేదు.

దేశంలో నిరసనలు పెల్లుబికాయి. సద్దాం పాలన వద్దంటూ. ఉత్తరాన కుర్దులు. దక్షిణాన షియాలు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారిని భీకరంగా అణచివేయటానికి సద్దాం సైనిక దళాలను పంపాడు.

మ్యాప్

అలా సద్దాం వేసిన బాంబులవి. ఆ మంటల్లో కాలిపోయిన బాలుడు అమర్. కానీ ప్రాణాలతో ఉన్నాడు. ఆ రోజు అతడికి ఇంకా గుర్తుంది.

''ఆ మధ్యాహ్నం చాలా అందంగా ఉంది. మేం బయట ఆడుకుంటున్నాం. తుపాకీ మోతలు వినిపించాయి. సైరన్లు మోగాయి. మా మీద విమానాలు ఎగురుతున్నాయి. నేను, నా అక్క పరుగులు పెట్టాం. పక్కనే ఒక గోడన్‌‌లోకి వెళ్లాం. దానిని 'సిలో' అనే వాళ్లం. అందులో దాక్కున్నాం. మాతో పాటు మరో 30 మంది వరకూ ఉన్నారు.

మా పైన భారీ పేలుడు శబ్దం. పై అంతస్తులను కూల్చుకుంటూ ఒక బాంబు వచ్చింది. తెల్లటి మెరుపు. కళ్లు కనిపించకుండా పోయాయి. నా అక్క కనిపించలేదు. చేతులతో కళ్లు మూసుకున్నాను.

మిగతా వాళ్లందరూ గోడౌన్ లోపలికి వెళ్లారు. అక్కడే చిక్కుకుపోయారు. నేను తలుపు పక్కనే ఉన్నాను. దానిని తెరుచుకుని బయటకు పరుగుతీశాను. ప్రాణాలు దక్కించుకోవటానికి. అక్కడి నుంచి సజీవంగా బయటపడింది నేనొక్కడినే.

అమర్

నా ఒంటిమీద చర్మం మండిపోతోంది. భరించలేనంత మంట. కొద్ది దూరంలోనే ఉంది షాత్ అల్-అరబ్ నది. అందులో దూకేశాను. మంట చల్లారుతుందని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. గుర్తులేదు. తెలివి తప్పిపోయింది.''

ఆ తర్వాత కచ్చితంగా ఏం జరిగింది? అది అస్పష్టం. అయితే.. నది ఒడ్డును అపస్మారకంగా పడివున్న అమర్‌ను సద్దాం వ్యతిరేక సైనిక బలగాలు చూసి.. అతడిని సరిహద్దుకు అవతల ఇరాన్‌లోని శరణార్థి శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది.

అమర్ కళ్లు తెరిచేసరికి ఒక ఆస్పత్రిలో ఉన్నాడు.

‘‘ఒంటి నిండి కాలిన గాయాలతో పడి ఉన్నాను. భీకరమైన నొప్పి. ప్రతి క్షణం నరకం. మాట్లాడలేను. తినలేను. తాగలేను. మింగలేను. అమ్మా నాన్నా ఎక్కడ? అక్కా అందరూ ఏమయ్యారు? తెలీదు. బతుకుతానన్న ఆశ లేదు.''

ఆరు నెలలు గడిచాయి. 1991 సెప్టెంబర్. ఇరాన్‌లో అహ్వాజ్ నగరం. ఆస్పత్రిలో మౌనంగా ఉన్నాడు అమర్. ఓ మహిళ వచ్చారు. పేరు ఎమ్మా నికోల్సన్. బ్రిటిష్ పార్లమెంటు సభ్యురాలు.

అమర్, ఎమ్మా

''చాలా భయమేసింది.. ఆ పిల్లాడ్ని చూడగానే. తల నుంచి పాదం వరకూ కాలిపోయి ఉన్నాడు. భరించలేని బాధతో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు.. పాపం'' అని చెప్తారామె.

ఆమె నిజనిర్ధారణ కోసం వచ్చారు. దక్షిణ ఇరాక్‌లో మార్ష్ అరబ్బుల పరిస్థితిని పరిశీలించటానికి. వారి దయనీయ స్థితి గురించి ప్రపంచానికి తెలియజేయటానికి.

అమర్ ఒక్కడే ప్రాణాలతో మిగిలాడని ఎమ్మాకు చెప్పారు. అతడి కుటుంబ సభ్యులందరూ చనిపోయారని చెప్పారు. అతడికి సాయం చేయాలనుకున్నారామె. అతడి పరిస్థితి ఏమీ బాగోలేదన్నారు డాక్టర్లు. సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ అత్యవసరమని చెప్పారు. అది బ్రిటన్‌లోనే సాధ్యమన్నారు.

ఎమ్మా నడుం కట్టారు. ఫండ్ సమీకరించటానికి. సండే టైమ్స్‌తో జతకట్టారు. భీతావహమైన బాలుడి ఫొటోలు పాఠకులను కలచివేశాయి. అమర్ కోసం వేలాది పౌండ్లు విరాళంగా వచ్చాయి.

అమర్

1992 ఫిబ్రవరి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం. ఫొటోగ్రాఫర్లు, రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. ఒక బాలుడి కోసం. ఎంపీ ఎమ్మా చేయి పట్టుకుని ఆ బాలుడు వచ్చాడు.

అతడికంటూ ఏమీ లేవు. వంటి మీద దుస్తులు తప్ప. ''ఓ అనాథ. సర్వస్వం కోల్పోయాడు. ఇల్లు, కుటుంబం, జీవితం.. అన్నీ'' ఎమ్మా ఒక ఇంటర్వ్యూలో చెప్పారప్పుడు.

''ఎమ్మా దగ్గర నాకు భద్రంగా అనిపించింది. నాకు ఇంకెవరూ లేరు'' అని అంటాడు అమర్.

ఒక సంవత్సరం. గై హాస్పిటల్ పదో అంతస్తు. 27 ప్లాస్టిక్ సర్జరీలు. పేరు మోసిన డాక్టర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అమర్ తొడ నుంచి చర్మం తీశారు. మెడ మీద అమర్చారు. ఆ సర్జరీని వాల్జింగ్ అంటారు.

అమర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆ పురోగతిని బీబీసీ రికార్డు చేసింది. మొదట బిడియంగా ఉండేవాడు. నెమ్మదిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంత ఇంగ్లిష్ మాట్లాడుతున్నాడు. కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు. అతడి ముఖంలో నవ్వు వచ్చింది.

సర్జరీ

''అమర్ ఇక్కడే ఉంటాడనుకోలేదు. తిరిగి వెళ్లిపోతాడనుకున్నా. ఎవరైనా బంధువులు తీసుకెళ్తారనుకున్నా. అలా జరగలేదు. డాక్టర్లు వద్దన్నారు. అతడిని కదిలిస్తే చనిపోతాడన్నారు'' అని చెప్పారు ఎమ్మా.

అమర్‌ను లండన్‌లోనే ఓ ఇంటి వాడిని చేయాలనుకున్నారు. ఒక బ్రిటిష్-ఇరాకీ కుటుంబంతో పాటు ఉంచే ప్రయత్నం చేశారు. అతడు ఉండలేకపోయాడు. నగర జీవితం నుంచి పారిపోయేవాడు.

ఎమ్మా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతం డేవన్‌కు అతడిని తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మా, ఆమె భర్త మైఖేల్ కెయిన్ నివసిస్తుంటారు. వాళ్ల ఇంట్లోనే ఉంచుకున్నారు. వాళ్లు లీగల్ గార్డియన్లు అయ్యారు. కానీ అమర్ దత్తత వెళ్లలేదు. అతడికి ఓ ఆశ ఉంది. ఏదో ఒక రోజు తన వాళ్లు కనిపిస్తారని. మళ్లీ తన దేశానికి తిరిగి వెళ్తానని.

అమర్, ఎమ్మా

ఊళ్లో స్కూలుకు వెళ్లాడు. కొందరు మిత్రులు దొరికారు. రాక్ బ్యాండ్‌లో డ్రమ్ వాయించాడు. ఫుట్‌బాల్ ఆడేవాడు. ఫిషింగ్ చేసేవాడు.

''ఎమ్మా నా జీవితం కాపాడారు. ఎంతో కృతజ్ఞుడ్ని. ఊళ్లో నాకు చాలా భద్రంగా అనిపించేది. జనం నన్ను ఆదరంగా చూసుకునేవారు. కానీ కొన్నిసార్లు.. అంతా శూన్యంగా అనిపించేది. నా వాళ్లందరినీ కోల్పోయాను. నాకు తెలిసినదంతా పోయింది. ప్రపంచమంతా నన్ను వదిలేసినట్టు అనిపించేది. ఏకాకిగా అనిపించేది'' అంటాడు అమర్.

మైఖేల్ అతడికి తండ్రిలా ఉండేవాడు. 1999లో చనిపోయాడు. టీనేజీలో ఉన్న అమర్‌ మరోసారి కుంగిపోయాడు. కొన్నాళ్లు డేవన్ వదిలి వెళ్లిపోయాడు. లండన్ చేరుకున్నాడు. దారీతెన్నూ తెలియలేదు. స్నేహితుల ఇళ్లలో సోఫాల మీద పడుకున్నాడు. కారులోనే నివసించేవాడు.

''ఎమ్మాతో గొడవపడ్డాను. ఒంటరిగా బతకాలనుకున్నాను. నాకేం కావాలో నాకు తెలీదు. నేనెవరో నాకు తెలీదు'' అని చెప్తాడు.

అమర్, ఎమ్మా

2018 వేసవి కాలం. సెయింట్ డేవిడ్ రైల్వే స్టేషన్. ఒక వ్యక్తి ఎవరి కోసమో నిరీక్షిస్తున్నాడు. పేరు ఆండీ అల్క్రాఫ్ట్. వృత్తి బీబీసీ కెమెరామన్. మరొక మనిషి వచ్చాడు. అతడు అమర్ ఫ్రెండ్.

''అమర్ గురించి ఒక స్టోరీ చేస్తే బాగుంటుంది. అదే.. ఇరాక్ నుంచి వచ్చిన కుర్రాడు.. గుర్తున్నాడా? అద్భుతమైన కథ'' అని చెప్పాడతడు.

కాంటాక్ట్ వివరాలు తీసుకున్నాడు ఆండీ. డేవన్ వెళ్లాడు. అమర్‌ను కలవటానికి. ఓ ఫీచర్ రాయవచ్చు అనుకున్నాం మేం. 'ఇరాకీ అనాథ అమర్ ఇప్పుడేం చేస్తున్నాడు?' తరహాలో.

అమర్

అమర్ ఒక విషయం చెప్పాడు. సోషల్ మీడియాలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని. దాంతో కథ అనుకోని మలుపు తిరిగింది.

ఓ ఖాళీ ఫ్లాట్‌లో కనిపించాడు అమర్. పదేళ్ల కిందట లండన్ నుంచి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నాడు. కానీ అందులో ఏమీ లేవు. కొన్ని బిల్లు కాగితాలు. కిచెన్‌లో కొన్ని పాత్రలు తప్ప.

ముప్పయ్యో పడి చివర్లో ఉండి ఉంటాడు. అంత వయసు కనిపించటం లేదు. కానీ రూపంలో తేడా లేదు. చిన్నప్పుడు పేపర్లు, టీవీల్లో చూపిన ఫొటోల్లో లాగానే. మృదువుగా మాట్లాడాడు.

అమర్

ఏడాదిగా ఇంట్లో గ్యాస్ లేదు. బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు. సెంట్రల్ హీటింగ్ కూడా లేదు. ఎముకలు కొరికే చలిలో అలాగే గడిపేస్తున్నాడు.

ఉద్యోగం లేదు. ఉపాధీ లేదు. బిల్లులు కట్టగలిగే పరిస్థితి లేదన్నాడు. ఒంటరిగా జీవిస్తున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఆసరా. ఖర్చులకూ డబ్బులూ లేవు. ఫిషింగ్ రాడ్ అమ్మేస్తున్నాడు. ఎంతో ఇష్టమైన సైకిల్‌ను కూడా.

''జీవితం చాలా కష్టం. రోజు గడవటం కనాకష్టం'' అంటాడు అమర్.

అమర్

ఒక గదిలో గోడ మీద బొమ్మలు ఉన్నాయి. పెన్సిల్‌తో గీసిన చిత్రాలవి. అమర్ కాస్త ఇబ్బందిగా కనిపించాడు. తను గీసిన చిత్రం ఏమిటో వివరించలేకపోయాడు.

జ్ఞాపకాల పొరల్లో అట్టడుగున కనిపించే చిత్రాలని చెప్పాడు. ఇరాక్‌లో చిన్నప్పటి సంఘటనల దృశ్యాలన్నాడు. నదీ తీరాలు. తీరంలో పచ్చికబయళ్లు. నీళ్ల లోంచి ఎగిరే చేపలు. ఆకాశం నుంచి కిందికి దూసుకొచ్చే పక్షులు.

''నా జీవితంలోని ఆ కాలం పెద్దగా గుర్తులేదు. నా కుటుంబం గుర్తలేదు. నా ఇల్లు గుర్తు లేదు. కానీ ఒక్క విషయం తెలుసు. అప్పుడు సంతోషంగా ఉన్నాను. బాంబుల వర్షం మొదలవటానికి ముందు. ఆ బొమ్మలే గీస్తున్నా. కాస్త ఊరటనిస్తుంది'' అని చెప్పాడు.

అమర్ మెసేజ్

'అతడు నా కొడుకు'

అది అతడి రోజు వారీ జీవితం. మౌనంగా సాగిపోయేది. ఇప్పుడు ఒక్కసారిగా అలజడి రేగింది. అకస్మాత్తుగా సందేశాలు వచ్చాయి. ఫేస్‌బుక్‌లో. మధ్య ప్రాచ్యం నుంచి. ఓ అపరిచిత వ్యక్తి నుంచి.

ఆ మెసేజ్‌లు మాకు చూపించాడు. వాటిలో ఒక మహిళ వీడియో కూడా ఉంది. దృశ్యాలు కొంత అస్పష్టంగా ఉన్నాయి. అమర్ తల్లినని ఆమె చెప్తోంది. మూడు దశాబ్దాల కిందట బస్రాలో చనిపోయిందని అమర్ నమ్మిన తల్లిని తానే అంటోంది.

అమర్ మెసేజ్

స్క్రీన్ మీద దృశ్యాన్ని తదేకంగా చూశాడు. తల విదిలించాడు. ''ముందు అది ఒక స్కామ్ అనుకున్నా. ఎవరో డబ్బులు గుంజటానికి ప్రయత్నిస్తున్నారనుకున్నా. డిలీట్ చేశా'' అని చెప్పాడు.

''కానీ.. ఇంకో మెసేజ్ వచ్చింది. మరో మెసేజ్ వచ్చింది. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. అంటే అది నిజమా? నిజం కాదు కదా?'' అని ప్రశ్నించాడు.

ఆ వీడియో దృశ్యాలు అస్పష్టంగా ఉన్నాయి. బాగా పిక్సిలేట్ అయ్యాయి. పైగా అమర్ ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉంది. అందులో అసలు ఏముంది? ఏం జరుగుతోంది? స్పష్టంగా అర్థంకావటం లేదు.

అమర్

ఆ వీడియో ఓ కుర్దిష్ టీవీ చానల్ నుంచి తీసుకున్నవి. రిపోర్టర్ ఒక ఫుడ్ మార్కెట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. అతడి దగ్గరకు ఒక మహిళ వచ్చింది. నల్లటి హిజాబ్ ధరించి ఉంది.

గొంతు అస్పష్టంగా ఉంది. తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. కళ్లు కనిపించకుండా పోతున్నాయంది. అంటూ ఒక ఫొటోను కెమెరా ముందు చూపించింది. ఆ ఫొటో 1992 నాటి ప్రఖ్యాత ఫొటో. హీత్రూ విమనాశ్రయంలో తీసింది. ఎమ్మా నికోల్సన్‌తో కలిసి అమర్ వస్తున్న ఫొటో అది.

అమర్, ఎమ్మా

''అతడు నా కొడుకు'' అంటూ ఆమె కన్నీళ్లతో చెప్పింది. ''అతడు నా అమర్'' అని ఆ రిపోర్టర్‌తో చెప్పింది.

అక్కడికి వేలాది మైళ్ల దూరంలో ఉన్నాడు అమర్. డేవన్‌లోని తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నాడు. ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ ఉన్నాడు.

''నా అమ్మ లాగే కనిపిస్తోంది'' అన్నాడు. ''కానీ నాకు గుర్తున్న అమ్మకన్నా ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తోంది'' అని చెప్పాడు. ''కొంచెం నా లాగే కనిపిస్తోంది'' అన్నాడు. అంతలోనే ఫొటో చూసి చెప్పటం కష్టమనీ అన్నాడు.

అమర్

'ఇది నిజమైతే బాగుండు'

మమ్మల్ని సాయం చేయమని అడిగాడు. నేను, ఆండీ, మా ప్రొడ్యూసర్ అలెక్స్ లిటిల్‌వుడ్ పరిశోధన మొదలుపెట్టాం. అమర్‌కి ఆ వీడియో ముస్తఫా అనే ఇరాక్ వ్యక్తి పంపాడు. అతడికి ఫోన్ చేశాం. అతడు అమర్‌కి బంధువు కాదు. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో నివసిస్తన్నాడు.

''అమర్ గురించి నాకేమీ తెలీదు. అతడి కథ అసలే తెలీదు. కానీ టీవీలో ఒక వృద్ధ మహిళ వేదనను చూశా. సాయం చేయాలనుకున్నా'' అని చెప్పాడు. ఆమె చూపిన ఫొటోలోని బాలుడి కోసం వెదికాడు. సమాచారం కోసం ఇంటర్నెట్‌లో అన్వేషించాడు. రోజులు, వారాల పాటు.

అమర్ కనీమ్‌ను ఎమ్మా నికోల్సన్ 1992లో బ్రిటన్ తీసుకెళ్లిన కథ, ఫొటోలు దొరికాయి. అక్కడి నుంచి అమర్ కోసం గాలింపు మొదలుపెట్టాడు. చివరికి ఫేస్‌బుక్‌లో ఆచూకీ దొరికింది.

అమర్

మరి ఆ మహిళ చెప్తున్నది నిజమేనా? మరి కొన్ని వారాలు కృషి చేశాం. ముస్తఫా, బీబీసీ అరబిక్ సహచరులు సాయం చేశారు. ఇరాక్‌లో జుమా అనే వ్యక్తిని పట్టుకున్నాం.

ఆ వీడియోలో అమర్ తల్లినని చెప్తున్న మహిళ భర్త ఆమె పేరు జారా అని చెప్పాడు. అమర్ కన్నతండ్రి ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. అదికూడా బాస్రా మీద సద్దాం బాంబు దాడికి చాలా ముందే చనిపోయాడన్నాడు.

అది నిజమేనని అమర్ ధ్రువీకరించాడు.

జారా, తాను కర్బలాలో నివసిస్తున్నామని చెప్పాడు జుమా. అమర్ పుట్టిపెరిగిన బస్రాకు ఉత్తరంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అమర్

జారా తన కొడుకు కోసం తపిస్తోందని చెప్పాడు. అతడిని వెదకటానికి చేతనయిందంతా చేస్తానని మాట ఇచ్చానన్నాడు. మేం తనను సంప్రదించటం ఓ కలలా ఉందన్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

జారా, జుమాలు ఒక ఫొటో పంపించారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో. వెలిసిపోయింది. అక్కడక్కడా చిరిగిపోయింది. అమర్ స్కూల్ ఫొటో అని చెప్పారు.

కానీ అమర్‌కి నమ్మశక్యంగా లేదు. అది తన ఫొటోనే అంటే. ఎందుకంటే తను ఎలా ఉండేవాడో తనకి తెలీదు. బాంబు దాడిలో కాలిపోకముందు. ముఖం రూపురేఖలు చెదిరిపోక ముందు.

కొన్ని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల కాపీలను కూడా పంపించింది జారా. అమర్ తల్లిని తానే అని నిరూపించటానికి. ఆమె చెప్పిన వివరాలు కొన్ని సరిగానే ఉన్నట్లు అనిపించింది అమర్‌కి.

ఆమె చెప్పిన అతడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల పేర్లు కరెక్టుగానే ఉన్నాయి. ఆమె చెప్పిన కొన్ని సంఘటనలు అతడికి గుర్తుకొచ్చాయి. ఆమె వివరించిన నాపామ్ దాడి సంగతులు సరిపోయాయి. ఆ దాడిలో తన చిన్న కూతురు ఎలా చనిపోయిందో ఏడుస్తూ చెప్పింది.

అమర్ ఫొటో

''ఆమె శరీరాన్ని స్మశానానికి తీసుకెళ్లాను. నా చిన్నారి అమర్ కోసం ఆ భవనం దగ్గరికి మళ్లీ వచ్చాను. శిథిలాల్లో రోజుల తరబడి వెదికాను. కానీ జాడ దొరకలేదు'' అని వివరించింది.

''అమర్ గాయపడ్డాడని బతికే ఉన్నాడని చెప్పుకునేవారు. స్థానిక సైనికులు తీసుకెళ్లారని అనేవాళ్లు. కొన్నేళ్ల తర్వాత.. అతడిని యూరప్ తీసుకెళ్లి ఉండొచ్చని ఓ కథ విన్నాను. అమర్ కోసం ముప్పై ఏళ్లుగా వెదుకుతూనే ఉన్నాను'' అని చెప్పింది.

ఆమె కుటుంబ మిత్రుడు ఒకరికి ఈ విషయం తెలుసు. అతడికి రెండేళ్ల కిందట ఇంటర్నెట్‌లో ఒక ఫొటో కనిపించింది. 1990ల్లో ఇంగ్లండ్ రాజకీయ నాయకురాలి చేయి పట్టుకుని వెళుతున్న అమర్ ఫొటో అది.

ఆ ఫొటోను జారాకు చూపించాడు. అందులో ఉన్నది తన కొడుకేనని జారాకు అనిపించింది. ''అప్పట్నుంచీ అధికారుల చుట్టూ తిరిగాను. రాయబారులను కలిశాను. స్వచ్ఛంద సంస్థలను కోరాను. ఎవరూ సాయం చేయలేదు. ఇరాక్‌లో అధికారులను కలవటం మాబోటి వాళ్లకు చాలా కష్టం పేపర్‌లో ప్రకటన ఇచ్చాం. రోడ్ల మీద ఎదురుపడ్డ జర్నలిస్టులకు చెప్పాం'' అని వివరించింది.

జారా

అమర్ అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. అతడికి పెద్దగా జ్ఞాపకం లేదు. ఆమె చెప్తున్నది అంగీకరించలేకపోతున్నాడు. ఆమె, ఆమె చుట్టూ ఉన్న వాళ్లు కథ అల్లుతున్నారేమోనని అనుమానం. ఇరాక్ నుంచి బయటపడటానికో. డబ్బుల కోసమో డ్రామా చేస్తున్నారని సందేహం.

''ఆ మహిళ, ఆమె కుటుంబం పేదరికంలో మగ్గుతోంది. వారికి చదువు లేదు. ఇంటర్నెట్ అందుబాటులో లేదు. స్మార్ట్‌ఫోన్లు అసలే లేవు. అధికారులతో సంబంధాలు లేవు. అందుకే వాళ్లు అమర్‌ని చేరలేకపోయారు'' అంటాడు ముస్తఫా.

''ఆమె నా అమ్మేనని నమ్మాలనే ఉంది. ఇది నిజమైతే బాగుంటుందనే ఉంది'' అన్నది అమర్ అంతరంగం. ''కానీ నా వాళ్లందరూ చచ్చిపోయారని ముప్పై ఏళ్ల పాటు నాకు చెప్తూ వచ్చారు. వాళ్లు బతికే ఉండి ఉండొచ్చు. ఇది సినిమాలా ఉంది. నమ్మశక్యంగా లేదు'' అనేది అతడి సంశయం. నమ్మటానికి ఆధారాలు కావాలంటాడు.

అమ్మని అంటున్న మహిళతో మాట్లాడాడు. ఇద్దరం డీఎన్ఏ పరీక్ష చేయించుకుందామని సూచించాడు. ఆమె అంగీకరించింది.

అమర్, ఎమ్మా

ఈ పరిణామం అమర్‌ను రక్షించిన నికోల్సన్‌కి ఒక షాక్. అమర్ బ్రిటన్‌కు వచ్చిన మొదట్లో కొందరు మహిళలు ముందుకొచ్చారు. అమర్ తల్లిని నేనే అంటూ. వారివి అబద్ధాలని తేలిపోయింది.

''1990ల మధ్యలో అమర్ చిన్నమ్మను వెదికిపట్టుకున్నాం. ఇరాక్‌లోనే. అమర్ మాట వినగానే ఆమె భయంతో వణికిపోయింది. స్పృహ తప్పిపోయింది. ఎందుకంటే సద్దాం పాలన సాగుతూనే ఉంది. మమ్మల్ని మళ్లీ కనిపించవద్దని వేడుకున్నాడు ఆమె భర్త'' అని నికోల్సన్ వివరించారు.

అమర్‌ పేరుతో ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. అమర్ ఫౌండేషన్ దాని పేరు. మధ్యప్రాచ్యంలో కల్లోలిత ప్రాంతాల్లో ప్రభావిత ప్రజలకు సాయం చేస్తుంది. అమర్ పుట్టిపెరిగిన బస్రాలో అనాథ పిల్లల కోసం ఒక స్కూల్ కూడా నడుపుతోంది.

అమర్

ఫలితాలు

డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి. అమర్ రెండు వారాలు ఉత్కంఠగా ఎదురు చూశాడు. అది జీవితకాల నిరీక్షణలా అనిపించింది. రాత్రిళ్లు నిద్రపోలేదు. నిజమైతే బాగుండు అని ప్రార్థించాడు.

కవర్ తెరిచాడు. లోపల ఓ పేపర్ ఉంది. దాని మీద అంకెలు, సంఖ్యలు, చిహ్నాలు. గందరగోళంగా ఉన్నాయి. అతడి కళ్లు పేజీ చివరి వరకూ వెళ్లాయి.

జారా తన కన్నతల్లి అవునా? కాదా? చివరికి ఫలితం వచ్చింది. ఆమె 99.9999 శాతం తనని కడుపున కన్న తల్లేనని నిరూపితమైంది.

అమర్ ఆనందానికి అవధుల్లేవు. ఆశ్చర్యంతో స్థాణువయ్యాడు. ''నాకు ఓ అమ్మ ఉంది. నా అమ్మ దొరికింది.'' అతడి మొహంలో నవ్వు విరిసింది.

మేం కలిసిన ఆరు నెలల్లో అతడు నవ్వటం అదే మొదటిసారి. ఆ కాగితాన్ని ఫ్రేమ్ కట్టిస్తానన్నాడు. ''అమ్మ కన్నా మిన్నగా ప్రేమించే మనిషి ఇంకెవరుంటారు?'' అంటాడు. అమ్మను కలవాలన్న ఆత్రుత అమాంతం పెరిగిపోయింది.

అమర్

కన్నతల్లి దగ్గరికి.. జన్మభూమికి..

ఒళ్లంతా కాలిన గాయాలతో బ్రిటన్ వచ్చాడు అమర్. మూడు దశాబ్దాల కిందట హీత్రూ విమానాశ్రయంలో దిగాడు. అదే విమానాశ్రయం నుంచి బాగ్దాద్ బయలుదేరాడు. అప్పుడతడు ఎమ్మా నికోల్సన్ చేయిపట్టుకు వచ్చాడు. ఇప్పుడతడి చేతిలో బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది.

1992లో ఇరాక్ నుంచి వచ్చాక మొదటిసారి స్వదేశానికి ప్రయాణం. పది గంటలు విమానంలో కూర్చోవాలి. ఇంటికి చేరువయ్చే కొద్దీ అతడి గుండె వేగం పెరుగుతోంది.

జారా

ఉదయం 11 గంటలు. సూర్యుడు అప్పుడే మండటం మొదలైంది. పావురాలు ఎగురుతూ వెళుతున్నాయి. మసీదు నమాజ్ పిలుపు బాగ్దాద్ ఆకాశ వీధుల్లో వినిపిస్తోంది.

బాగ్దాద్‌లోని బీబీసీ ఆఫీస్. తోటలోని ఓ చెట్టు కింద నిలుచుని ఉన్నాడు అమర్. మళ్లీ తల్లి ఒడి చేరే సమయం వచ్చేసింది.

తోట దగ్గర కారులోంచి ఒక స్త్రీ దిగింది. పొడవైన నల్లటి దుస్తులు. తల మీద హిజాబ్.

''అమ్మా'' అన్నాడు అమర్. ''అమౌరి.. అమౌరి...'' అందామె. ''నా చిట్టి అమర్'' అంటూ వణికింది ఆమె గొంతు. ముప్పై ఏళ్ల కిందట వేరుపడ్డ తల్లీబిడ్డలు మళ్లీ కలుసుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మళ్లీ మళ్లీ పిలుచుకున్నారు.

అమర్, జారా

అమర్ ముఖం మీద కాలిన గాయాల మచ్చలను ఆమె వేళ్లతో తడిమింది. అతడి కళ్లూ వేళ్లూ, కాళ్లూ చేతులూ తడిమి చూసింది. ఆనాటి తీవ్ర గాయాల వల్ల నడవలేని స్థితిలో ఉంటాడేమోనని అనుకుంది. కానీ నిటారుగా నిలుచున్న కొడుకుని చూసి సంతోషంతో నిండిపోయింది.

అమర్ అకస్మాత్తుగా అరబిక్‌లో మాట్లాడాడు. మరచిపోయానని అనుకున్న భాష అతడికి అనుకోకుండా వచ్చేసింది. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అమర్ తన ఫోన్ తీసి ఫొటోలు చూపించాడు. బస్రాలో అతడి జ్ఞాపకాలను గుర్తుచేసింది జారా.

అమర్, తమ్ముడు

వీరిద్దరి జీవితాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.

అమర్ తమ్ముడు తాహ్రిర్ కూడా కలిశాడు. మళ్లీ ఆలింగనాలు. ఆనందభాష్పాలు. ఇద్దరూ తాము చేసిన చిలిపి పనులు గుర్తుచేసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు.

కుటుంబంతో అమర్

మరుసటి రోజు అమర్ కర్బలా వెళ్లాడు. అమ్మ ఇంటికి. అమ్మ, తమ్ముడు అందరూ ఎంత పేదరికంలో బతుకుతున్నారో చూశాడు. కొంతసేపు బాధపడ్డాడు. ఇంట్లో కలిసిపోయాడు.

చిన్నప్పుడు డాక్టర్లు అంచనా వేసిన దానికన్నా మూడేళ్లు పెద్దవాడు అమర్. అతడి అమ్మ చూపిన బర్త్‌సర్టిఫికెట్‌లో అసలు పుట్టినరోజు ఉంది.

అమర్, జారా, జుమా

''వచ్చే వారం నా నాలుగో పుట్టిన రోజు'' అంటూ ఆనందంగా నవ్వాడు.

జీవితంలో సెలబ్రేట్ చేసుకోవటానికి తనకంటూ ఒక రోజు దొరికిందన్నాడు.

పచ్చబొట్లు

మరో సర్‌ప్రైజ్. అమర్ కుడి చేతి మీద ఒక వింత చుక్క ఉంది. అదెలా వచ్చిందో అప్పటి వరకూ ఎవరికీ తెలీదు. నిజానికది అతడి కుటుంబ పచ్చబొట్టు. అతడి తల్లికి, తమ్ముడికి అలాంటి చుక్కలే ఉన్నాయి.

చిన్నప్పుడు ఎక్కడైనా తప్పిపోతే ఈజీగా గుర్తుపట్టటానికి తాహ్రీర్ ఆలోచనతో ఆ పచ్చబొట్టు వేయించుకున్నారు. ఇప్పుడు తమ అమర్‌ను మళ్లీ కనుగొన్నామన్నాడు తాహ్రీర్.

కాసేపు ముగ్గురూ తమ చేతులపై పచ్చబొట్టను పోల్చి చూసుకున్నారు.

కుటుంబంతో అమర్

ఐదు రోజుల తర్వాత అమర్ బ్రిటన్ తిరుగు ప్రయాణమయ్యాడు. అందరికీ బాధగానే ఉంది. కానీ సంతోషంగానే వీడ్కోలు చెప్పుకున్నారు.

మళ్లీ వస్తానని మాట ఇచ్చాడు అమర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)