జపాన్‌లో స్కూలు పిల్లలపై దుండగుడి దాడి, తర్వాత ఆత్మహత్య

  • 28 మే 2019
ఘటనా స్థలంలో అత్యవసర సేవలు Image copyright Reuters
చిత్రం శీర్షిక ఘటనా స్థలంలో అత్యవసర సేవలు

జపాన్ రాజధాని టోక్యోలోని ఓ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి 18మందిని కత్తితో పొడిచి దాడి చేశాడు. వీరిలో కొందరు స్కూలు పిల్లలు కూడా ఉన్నారు అని అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం జరిగిన ఈ దాడి వెనక కారణాలేంటనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ దాడిలో 12 ఏళ్ల ఓ బాలికతోపాటు 39 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మరణించారు.

దాడి ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఓ వ్యక్తిని కావసాకి నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రభుత్వ మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ఈ దాడి అనంతరం రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కూడా తెలిపింది.

అరెస్టు చేయడానికి ముందు అనుమానితుడు తన భుజంపై, మెడపై కత్తితో పొడుచుకున్నాడని ప్రభుత్వ మీడియా చెప్పింది. అతను కూడా తర్వాత మరణించాడు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గాయపడినవారికి వైద్యసేవలకు సిద్ధం అవుతున్న సిబ్బంది

దాదాపు 50ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కత్తితో స్కూలు పిల్లలపై దాడి చేశాడంటూ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.44 గంటలకు ఓ అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందని కావసాకి అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

ఓ బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న స్కూలు పిల్లలపై ఉన్నట్లుండి అనుమానితుడు దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మరణించారని తెలుస్తోంది. ఒక బాలిక మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

బస్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్న పిల్లల వైపు అనుమానితుడు రావడాన్ని చూశానని ఓ బస్సు డ్రైవర్ చెప్పాడని ఎన్‌హెచ్‌కే తెలిపింది.

దాడికి పాల్పడ్డ వ్యక్తి బస్టాప్‌లో ఉన్న పిల్లలపై కత్తితో దాడి చేసి, ఆ తర్వాత బస్సు లోపలకి ప్రవేశించి, లోపలున్న పిల్లలపై కూడా దాడికి దిగాడని టోక్యోలోని బీబీసీ ప్రతినిధి తెలిపారు.

బస్టాప్ దగ్గర రక్తమోడుతూ పడి ఉన్న వ్యక్తిని చూశాను అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పాఠశాల విద్యార్థులు కూడా నేలపై పడి ఉన్నారు. ఇది చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం, ఇక్కడ ఇలాంటి భయానక వాతావరణాన్ని చూడటం కష్టంగా ఉంది అని ఆ సాక్షి అన్నారు.

అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి రావడం, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడానికి చర్యలు చేపడుతున్న దృశ్యాలు స్థానిక ప్రసారమాధ్యమాల్లో వచ్చాయి.

ట్రంప్ సంతాపం

గాయపడిన వారి కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

జపాన్ మిలటరీ నౌకపై నిలబడిన ట్రంప్... దుండగుడి దాడిలో గాయపడినవారి కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేస్తున్నానని, అమెరికా ఈ సమయంలో జపాన్‌కు అండగా ఉంటుందని అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత తక్కువగా హింసాత్మక ఘటనలు జరిగే జపాన్‌లో ఈ మధ్య ఇలాంటి కత్తి దాడులు పెరుగుతున్నాయి.

2016లో ఓ మానసిక వికలాంగుల సేవా కేంద్రంలో మాజీ ఉద్యోగి 19 మందిపై దాడి చేశాడు. వారు ఈ ప్రపంచంలో ఉండటం తనకిష్టం లేదని అతడు అప్పట్లో వ్యాఖ్యానించాడు.

2001లో ఒసాకాలోని ఓ పాఠశాలలో ప్రవేశించిన దుండగుడు కత్తితో విద్యార్థులపై దాడికి తెగబడ్డాడు. 8 మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యాడు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు