చైనాలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు

  • 29 మే 2019
చైనా ముస్లింలు

పాకిస్తాన్‌లోని మదరసాలో చదువుకుంటున్న చైనా విద్యార్థి 22 ఏళ్ల ఉస్మాన్(పేరు మార్చాం) తన దేశంలో రంజాన్ ఉపవాసం, నమాజు, ఇతర మతపరమైన విధులు నిర్వహించడం అంత సులభం కాదు. కానీ అతడు కరాచీలో ఉంటూ తన మతపరమైన విధులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతున్నాడు.

చైనాలో ముస్లింలకు మతపరమైన స్వేచ్ఛ లేదు. అక్కడి ముస్లింలకు గత ఏడాది కూడా ఉపవాసం ఉండడానికి అనుమతి లభించలేదు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిని తీవ్రంగా ఖండించింది. ముస్లిం దేశాలు దీనికి వ్యతిరేకంగా తమ గళం వినిపించాల్సిన అవసరం ఉందని అపీల్ చేసింది.

చైనా ముస్లిం విద్యార్థి ఉస్మాన్ కరాచీలోని ఒక మదరసాలో చదువుకుంటున్నాడు. పాకిస్తాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ తన పదవీకాలంలో పాక్ మదరసాల్లో విదేశీ విద్యార్థులు చదువుకోవడంపై నిషేధం విధించారు. కానీ ఇప్పుడు అక్కడి మదరసాల్లో విదేశీ విద్యార్థులకు అనుమతి ఉంది.

విదేశీ విద్యార్థులకు పాక్ వీసా

దేశంలోని మదరసాల్లో చదువుకోడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు వీసా ఇవ్వాలని ఇటీవల పాకిస్తాన్ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం నడిపే స్కూళ్ల మీడియా కోఆర్డినేటర్ తల్హా రహ్మానీ "ఇప్పుడు దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఎంతమంది అనేది కచ్చితంగా తెలీదు. కానీ కరాచీలో ఒక మదరసా నిర్వాహకులు తమ దగ్గర 25 మంది చైనా విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారని" తెలిపారు.

ఉస్మాన్ గత ఐదేళ్లుగా కరాచీలోని ఒక మదరసాలో చదువుకుంటున్నాడు. ఇక్కడ ఖురాన్, హదీస్, అరబ్బీ అదబ్, తర్కం నేర్పిస్తారు.

తల్లిదండ్రులు తనను ఒక మత పెద్దగా చూడాలని అనుకున్నారని, చిన్నప్పటి నుంచి తనకు దాని గురించే చెబుతూ వచ్చారని ఉస్మాన్ చెప్పాడు.

చైనాలో రహస్యంగా విద్యాబోధన

అతడు చైనాలో స్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత కరాచీ చేరుకున్నాడు. మతపరమైన విద్యభ్యాసం చేస్తున్నాడు.

ఉస్మాన్ బీబీసీతో "చైనాలో ఇస్లాం, దీన్ శిక్షణ పొందే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ ఈ విద్య, సబ్జెక్టులు పరిమితంగా ఉంటాయి. శుక్రవారం రోజు మాత్రం మౌల్వీ కొన్ని మాత్రమే చెబుతారు. అవి కాకుండా ప్రజలు ఇంటర్నెట్‌లో మతం గురించి కొంత సమాచారం తెలుసుకుంటారు" అని చెప్పాడు

పాకిస్తాన్‌లో చదువుకోడానికి వచ్చే మిగతా దేశాల విద్యార్థుల్లాగే చైనా నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది మతపరమైన ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నారు. వారిలో కొందరు ఏడాది కోర్సు చేసి తిరిగి తమ దేశానికి వెళ్లిపోతుంటే, మరి కొంతమంది ముఫ్తీ, ఆలిమ్( ఇస్లాం డిగ్రీ) చదువుతారు. కొంతమంది కొన్ని నెలల తర్వాత తిరిగి వెళ్లిపోతారు.

మదరసాల్లో పరీక్ష పాస్ కాగానే కొందరు విద్యార్థులు తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతున్నారు. వారిలో కొందరు ఇతరులకు మతపరమైన విద్యాబోధన కూడా ప్రారంభిస్తారు.

"మేం చైనాలో ఉన్న వారికి మతపరమైన విద్యను రహస్యంగా బోధిస్తాం. మొదట మా ఇంట్లో వారికి చెబుతాం. తర్వాత దగ్గర బంధువులకు శిక్షణ ఇస్తాం. ఒక మదరసా పెట్టి విద్యాబోధన చేయడం లాంటివి ఇక్కడ సాధ్య కాదు" అని ఉస్మాన్ చెప్పాడు.

పాక్‌లో చైనా భాషపై మోజు

పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీ, మిగతా ప్రైవేటు సంస్థల్లాగే మదరసా జామియా బన్వరియా అల్ఆలీమియా కూడా చైనా భాష నేర్పించడానికి ఒక కేంద్రం ప్రారంభించింది.

ఆ మదరసా నిర్వాహకుడు మత విషయాల నిపుణుడు ముఫ్తీ మహమ్మద్ నయీమ్ "చైనాలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం ముస్లింల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా పౌరులు పాకిస్తాన్ వచ్చినపుడు ఇక్కడ బహిరంగంగా తిరుగుతారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. చైనా తమ దేశంలో ఉన్న ముస్లింలకు కూడా మతపరమైన స్వేచ్ఛ ఇవ్వాలి" అన్నారు.

చైనాలో ముస్లిం జనాభా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. కానీ వారిలో ఎక్కువ మంది దగ్గర చైనా భాషలో నమాజు చదివే పుస్తకాలు కూడా లేవు.

తమ మదరసాలో చైనా భాష నేర్చుకోడానికి మదరసా విద్యార్థులే కాదు, వ్యాపారులు, ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా వస్తుంటారని ఆయన చెప్పారు.

చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యాపార సంబంధాల కారణంగా పాకిస్తాన్‌లో చైనా భాష నేర్చుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

ఉస్మాన్ తను చదివే మదరసాలో మిగతా చైనా విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. మేం అతడిని కలవడానికి వెళ్లినప్పుడు అక్కడకు వేరే మదరసాల్లో చదివే చైనా విద్యార్థులు కూడా వచ్చుండడం కనిపించింది.

"చైనా ప్రభుత్వం మదరసాల్లో చదవడానికి అనుమతి ఇవ్వడం లేదు. కానీ యూనివర్సిటీలో చదవడానికి అనుమతి ఇస్తుంది. పాక్‌లో నేను తీసుకుంటున్న మతపరమైన శిక్షణకు, మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు" అని ఉస్మాన్ తెలిపాడు.

చైనా ముస్లిం జనాభాలో ఎక్కువ మంది షింజియాంగ్ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతాన్ని మొదట 'తుర్కిస్తాన్' అనేవారు. ఈ ప్రావిన్స్‌ సరిహద్దులు పాకిస్తాన్, భారత్ సహా మంగోలియా, రష్యా, కజకిస్తాన్, అప్ఘానిస్తాన్, కిర్గిస్తాన్‌తో కలిసి ఉంటుంది. ఇక్కడ పెద్ద నగరం కాష్గర్, కానీ ఉర్మచీ దీని రాజధానిగా ఉంది.

చైనాలో మతపరమైన స్వేచ్ఛపై ప్రశ్నలు

గత ఏడాది ఆగస్టులో ఐక్యరాజ్యసమితి "షింజియాంగ్‌లో వీగర్ ముస్లింలు, ఇతర ముస్లిం సమాజాలకు సంబంధించిన పది లక్షల మందిని అదుపులోకి తీసుకున్నారని, రీఎడ్యుకేషన్ అంటే మళ్లీ విద్యాబోధన ద్వారా వారి ఆలోచనలు మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని" చెప్పింది.

ఇస్లాం దేశాల సంస్థ కూడా చైనా ముస్లింల మానవ హక్కుల ఉల్లంఘనపై వ్యతిరేకత వ్యక్తం చేసింది.

పాకిస్తాన్‌లో చైనా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇటీవల తన ట్విటర్‌లో చైనాలో 35 వేల మసీదులు ఉన్నాయని, దేశంలో రెండు కోట్ల మంది ముస్లింలకు మతపరమైన విధులు నిర్వహించడానికి చట్ట ప్రకారం స్చేచ్ఛ ఉందని" చెప్పారు.

"మేం మతపరమైన స్వేచ్ఛ విధానం అనుసరిస్తాం. మేం మతపరమైన తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. సాధారణ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చట్ట ప్రకారం అనుమతి ఉంది" అన్నారు.

చైనా కూడా అదే చెప్పింది. పాకిస్తాన్ మదరసాల్లో విద్యాభ్యాసం చేస్తున్న షింజియాంగ్ విద్యార్థుల గురించి విచారణ చేపట్టామని తెలిపింది.

ఆ దేశ హోంశాఖ అధికారి బీబీసీతో "పాక్‌లో ఎంత మంది చైనా విద్యార్థులు ఉన్నారో, ఎంత మందికి వీసాలు జారీ చేశారో, వారి గురించి నెలకు రెండు సార్లు సమాచారం ఇవ్వాలని, వారి కార్యకలాపాల గురించి నివేదిక ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు