ఈ ఐదు టిప్స్ పాటిస్తే మహిళలు తమ కెరీర్‌లో రాకెట్‌లా దూసుకుపోవచ్చట

  • 2 జూన్ 2019
మహిళల కెరీర్ Image copyright Getty Images

ప్రపంచమంతటా ఆర్థిక అవకాశాల్లో ఉన్న లింగ అసమానత సమసిపోవటానికి మరో 202 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక గత ఏడాది అంచనా వేసింది.

ఉద్యోగాల్లో, విధుల్లో లింగ వైవిధ్యం అధికంగా ఉంటే వ్యాపారాలకు చాలా లాభాలు ఉంటాయి అనేక అధ్యయనాలు చెప్తున్నప్పటికీ.. అక్కడ లింగ సమాత్వానికి ఇంకా ఇన్నేళ్లు పడుతుందన్నమాట.

ఈ నేపథ్యంలో మహిళలు తమ కెరీర్‌లో ఎదగటానికి ఐదు సూచనలు చేశారు శాలీ హెల్గెసెన్. లీడర్‌షిప్ కోచ్‌గా పనిచేస్తున్న శాలీ సూచనలు మహిళలకే కాదు మగాళ్లకూ పనికివస్తాయి.

Image copyright Getty Images

1. విజయాలను మీ సొంతం చేసుకోండి

మీరు చేసిన కృషిని ఇతరులు అప్పటికప్పుడు గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తారనో, రివార్డు ఇస్తారనో భావించటం తెలికితక్కువతనం అంటారు శాలీ.

అయినప్పటికీ తాము సాధించిన విజయాల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండే వాళ్లు తనకు తరచుగా తారసపడుతుంటారని ఆమె చెప్పారు. ఎందుకలా అంటే వాళ్లు రెండు రకాల కారణాలు చెప్తుంటారు.

''నేను బాగా పనిచేస్తే వాళ్లు (పై వాళ్లో, సహోద్యోగులో) గుర్తించాలి కానీ.. నేను చెప్పుకోవటమేమిటి'' అనేది ఒక కారణం.

''గుర్తింపు పొందటానికి ఆరాటపడేవారిలా తామూ ప్రవర్తించేకంటే తమకు గుర్తింపు రాకపోయినా ఫర్వాలేదు'' అనేది మరో కారణం.

కానీ ఈ విధంగా ఆలోచించటం కెరీర్‌లో ఎదగటానికి దారులు లేకుండా చేస్తాయని హెల్గెసెన్ అంటారు.

మరి ఈ అలవాటును మార్చుకోవడం ఎలా?

''మీలో ఒక శక్తిని గుర్తించండి. ఉదాహరణకు.. 'ఈ సంస్థలో నాకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయన్నది నా బాస్‌కు అసలు అర్థంకాదు' అని మీరు అనుకుంటారు. అలాంటపుడు ఈ వారంలో మీరు ఎవరెవరితో, ఏమేం సంప్రదింపులు జరిపారో క్లుప్తంగా వివరిస్తూ బాస్‌కి ఒక ఈ-మెయిల్ పంపించవచ్చు'' అని హెల్గెసెన్ సూచించారు.

ఇది మహిళలకు చాలా ఉపయోగపడే టెక్నిక్ అని తేలిందని ఆమె పేర్కొన్నారు.

Image copyright Getty Images

2. 'నో' చెప్పటం నేర్చుకోండి

ఇంతకుముందు కెరీర్‌లో చాలా సాయపడిన మీ వైఖరి.. మీరు ఎదగాలని అనుకుంటున్నపుడు అవరోధంగా కూడా మారవచ్చునని హెల్గెసెన్ అంటారు.

''ఎల్లప్పుడూ అందరినీ మంచి చేసుకోవాలని అనుకుంటే.. ఇతరులను బాధ్యులను చేయటం మీకు కష్టంగా మారుతుంది. కొన్ని అంశాల్లో 'నో' చెప్పకపోతే మీరు ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చు. మీ పరిధులు వాళ్లు అతిక్రమించవచ్చు. మీ సమయం చాలా వృధా కావచ్చు'' అని ఆమె వివరించు.

మరి దీనినంతటినీ నివారించటం ఎలా? ముందు చిన్న చిన్నగా మొదలుపెట్టాలంటారు శాలీ. తొలుత మీ పరిధులను విస్పష్టంగా కాపాడుకోవటం.

''ఇప్పుడు నేను చాలా ఎక్కువ పనులు ఒప్పుకున్నాను. ఈసారి ఓ కొత్త టాస్క్‌ఫోర్స్ కానీ, అలాంటిది మరేదైనా పెట్టి అందులో నన్ను చేరమని చెప్తే.. ఒప్పుకునే ముందు దాని గురించి లోతుగా ఆలోచిస్తాను' అని మీకు మీరు చెప్పుకోవాలి. అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. 'ఇది నిజంగా నాకు మేలు చేస్తుందా?' అనేది తేల్చుకోవాలి'' అని సూచించారు.

Image copyright Getty Images

3. పర్‌ఫెక్షనిజం వర్సెస్ రిస్క్-టేకింగ్

''అన్నీ పూర్తి ఖచ్చితత్వంతో చేయాలనుకునే పర్‌ఫెక్షనిస్టుగా ఉండటం వల్ల ఒక పెద్ద సమస్య ఉంటుంది. అది.. ఇతరులకు పని కేటాయింటానికి ఇబ్బందిపడటం'' అంటారు శాలీ. ''ఈ పని నాకు నేనే చేస్తే ఈజీగా అవుతుంది' అని కొంతమంది చెప్తుంటారు'' అని ఉదహరించారామె.

ఈ పరిస్థితిని మార్చుకోవటానికి ఓ సులభమైన మార్గం ఉంది.

''ఈ పని ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారో ఒకరిని ఎంపిక చేసుకోండి. వారికి ఒక అవకాశం ఇవ్వండి. పని పూర్తయ్యాక దాని గురించి మీ పరిశీలనను వివరించండి. కానీ.. ఆ పనిని మీ దగ్గరే అట్టిపెట్టుకుని రిస్క్ తీసుకోకండి'' అని శాలీ సూచించారు.

ఒకవేళ అలా చేయటం ఇబ్బందికరంగా అనిపిస్తే.. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సంస్థల్లో ఖచ్చితత్వంతో, తప్పులు చేయకుండా పనిచేసే మహిళలకు రివార్డులు లభిస్తుంటాయని.. అదే పురుషులకైతే రిస్క్ తీసుకోవటం, ధైర్యంగా ముందుకెళ్లినందుకు ప్రోత్సాహం లభిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

కెరీర్‌లో పై స్థాయికి వెళ్లటానికి పెర్‌ఫెక్షనిజం నుంచి పక్కకు తప్పుకుని.. రిస్క్ తీసుకోవటం నేర్చుకోవటం కీలకమని శాలీ పేర్కొన్నారు.

Image copyright Getty Images

4. పొరపాట్లను వదిలిపెట్టండి

పనిలో చేసే పొరపాట్ల గురించి పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని, అది మహిళలను ముందుకు సాగనీయకుండా అడ్డుపడగలదని శాలీ చెప్పారు. ''ఇది ఓ రకంగా మనల్ని మనమే పడగొట్టుకోవటం లాంటిది'' అంటారామె.

దానికి బదులుగా.. చిన్న విరామం తీసుకోవాలని, 'నువ్వు కూడా మనిషివే.. అందరిలాగా' అని మీకు మీరే చెప్పుకోవాలని, పొరపాట్లను అంతటితో వదిలివేయాలని సూచించారు.

5. మిమ్మల్ని మీరు చిన్నగా చూపకండి

మహిళల్లో భౌతికంగానూ మాట్లాడటంలోనూ తమను తాము చిన్నగా చూపించుకునే వైఖరి ఉంటుందని శాలీ పేర్కొన్నారు.

తమ స్థానానికి తాము ఉన్నామన్న సాధికారంతో కాకుండా.. అపాలజీ చెప్తుండటం, 'మీరు కేవలం ఒకే ఒక్క నిమిషం కేటాయించగలరా?' తరహా వాక్యాలను ఉపయోగించటం వంటివి మహిళల ప్రదర్శించే లక్షణాలని ఆమె చెప్పారు.

''మిమ్మల్ని మీరు ఒక లీడర్‌ స్థానంలో నిలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. మీ స్థానంలో మీరు బలంగా నిలబడాలి. మీరు సంపూర్ణమని, పరిపూర్ణమని.. సాధికారత గలవారమని చూపాలి'' అని సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు