సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు

  • 31 మే 2019
ఇరాన్ యుద్ధం Image copyright AFP

ఇప్పుడు మొత్తం ప్రపంచమే ఇరాన్‌ను పక్కనపెట్టేలా చేసింది అమెరికా. మధ్యప్రాచ్యంలో కూడా ఇరాన్ గురించి గందరగోళం నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌ ఉనికే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అమెరికా ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై దాడి చేయవచ్చనిపిస్తోంది.

కానీ, ఇరాన్‌కు యుద్ధం కొత్త కాదు. ఇంతకు ముందు 1980లో ఆ దేశం ఒక భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొంది. ఈ యుద్ధంలో కనీసం 10 లక్షల మంది ఇరాన్ పౌరులు చనిపోయారు. ఈ యుద్ధం ఇరాక్, ఇరాన్ మధ్య జరిగింది. అప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఆ దేశంపై దాడిచేస్తే, అమెరికా ఆయనకు అండగా నిలిచింది.

ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం మరోసారి 1980లో జరిగిన యుద్ధాన్ని గుర్తుచేస్తోంది. ఎందుకంటే ఆ యుద్ధాన్ని తలుచుకుంటే మధ్యప్రాచ్యం ఇప్పటికీ వణికిపోతుంది. సద్దాం హుస్సేన్ అసలు ఇరాన్‌పై ఎందుకు దాడి చేశాడు? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సద్దాం హుస్సేన్

ఇరాక్ 1980 సెప్టెంబర్ 22న ఇరాన్‌పై దాడి చేసింది. దాంతో రెండు దేశాల మధ్య మొదలైన శత్రుత్వం 8 ఏళ్లు కొనసాగింది. ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అస్థిరంగా చేయడమే కాదు, రెండు దేశాలకు భారీ నష్టం కలిగించింది.

ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరికి 1988 ఆగస్టు 20న ముగిసింది. ఆ సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై తాము దాడిచేయడానికి షత్ అల్-అరబ్ కెనాల్ కారణం అని చెప్పారు. దానిని రెండు దేశాల మధ్య సరిహద్దుగా భావిస్తారు.

కానీ యుద్ధానికి అసలు కారణం మాత్రం ప్రాంతీయ సంఘర్షణే. సద్దాం హుస్సేన్ నిజానికి ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వల్ల తనకు ముప్పు ఉంటుందని భావించారు. 1979లో ఇరాన్‌లో వచ్చిన ఇస్లామిక్ విప్లవంతో ఆయతుల్లా ఖుమైనీ అధికారంలోకి వచ్చారు.

సద్దాం హుస్సేన్‌ ఒక క్రూర సున్నీ పాలకుడని, ఆయన తన దేశంలోని షియా సమాజాన్ని అణచివేస్తున్నారని ఖుమైనీ భావించేవారు. ఆయన సద్దాంను అధికారం నుంచి తొలగించాలనే తన కోరికను కూడా దాచుకోలేదు.

దాంతో సద్దాం హుస్సేన్‌కు ఈ యుద్ధం అవసరం అనిపించింది. ఆయతుల్లా ఖుమైనీ అధికారం తనకు పెను ప్రమాదం తెచ్చిపెట్టక ముందే ఇరాన్‌పై దాడి చేయాలని, ఆయనను కిందికి దించాలని సద్దాం భావించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సద్దాం హుస్సేన్

యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్ర

ఆయతుల్లా ఖుమైనీ ఇస్లాం ప్రభుత్వం యూదులకు వ్యతిరేకమే అయినా, ఈ యుద్ధంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ అండగా నిలిచింది. ఇరాన్-ఇరాక్ మధ్య యుద్ధం తీవ్రం అయినప్పుడు 1981 జూన్ 7న బాగ్దాద్‌ దగ్గరున్న ఒక న్యూక్లియర్ రియాక్టర్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.

ఫ్రాన్స్ నుంచి ఇరాక్ ఒక అణు రియాక్టర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.

ఫ్రాన్స్ తన అణ్వాయుధ కార్యక్రమానికి ఉపయోగించిన రియాక్టర్‌ లాంటి అణు రియాక్టర్‌ను ఆ దేశం నుంచి కొనుగోలు చేయాలని ఇరాక్ 70వ దశకంలో ప్రయత్నించింది.

ఫ్రాన్స్ దానికి నిరాకరించింది. కానీ బాగ్దాద్ దగ్గర తువాయియా న్యూక్లియర్ సెంటర్‌లో 40 మెగావాట్ల ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సాయం అందించడానికి అంగీకరించింది.

దాంతో, ఇరాక్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తోందని, అది ఎప్పుడో ఒకప్పుడు తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ భయపడింది. అదే కారణం చూపిస్తూ అప్పటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మెనాకెమ్ బెజిన్ ఎఫ్-16 విమానాలు పంపించి ఓసిరిక్ రియాక్టర్‌పై బాంబులతో దాడి చేయించాడు.

బాంబులు వేసిన క్షణాల్లో ఆ సెంటర్ శిథిలాల కుప్పగా మారింది. తాము బాంబులు వెయ్యగానే ఇరాక్ అణ్వాయుధాల జిన్నీ (భూతం) తిరిగి సీసాలో బందీ అయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం అప్పుడు చెప్పింది.

కానీ ఆ దాడులపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటనను సమర్థించింది.

Image copyright AFP

యుద్ధ విమానాల బాంబుల వర్షం

ఇరాన్ అప్పుడు అస్థిరంగా ఉందని, ఇరాక్ సైన్యం విజయం సాధించడానికి ఎక్కువ సమయం పట్టదని సద్దాం హుస్సేన్ భావించారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితిని అంచనా వేయడంలో పొరపాటు చేశారు.

ఇరాక్ సైన్యం ఆక్రమించిన ప్రాంతాలపై 1982లో ఇరాన్ ఆర్మీ తిరిగి పట్టు సాధించింది. అంతే కాదు.. ఇరాన్ సైన్యం ఇరాక్‌లో చాలా లోపలి వరకూ చొచ్చుకెళ్లింది.

అప్పుడు యుద్ధ విరమణ చేద్దామని ఇరాక్ ఆఫర్ చేసింది. కానీ, దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. అలా ఇరాక్ ఆ యుద్ధం ప్రారంభిస్తే, ఇరాన్ నేత ఆయతుల్లా ఖుమైనీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావించారు.

ఈ యుద్ధం కాలక్రమేణా తీవ్రం అయ్యింది. రెండు దేశాల మధ్య ఈ యుద్ధం వల్ల జరిగిన ప్రాణనష్టం గురించి ఎవరూ పట్టించుకోలేదు.

వేలమంది ఇరాన్ యువకులను మానవ బాంబులుగా మార్చాలని ఖుమైనీ వ్యూహం రచించారు. వారిని యుద్ధరంగంలోకి పంపించి తన ప్లాన్ అమలు చేశారు. ఇటు సద్దాం హుస్సేన్ ఇరాన్‌కు వ్యతిరేకంగా రసాయన ఆయుధాలు ప్రయోగించారు.

Image copyright Getty Images

రసాయన ఆయుధాలతో యుద్ధం

ఇరాన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగించిన ఇరాక్... జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐక్యరాజ్య సమితి నిపుణులు ధ్రువీకరించారు.

ఇరాక్ 1983 నుంచి మస్టర్డ్ గ్యాస్, 1985 నుంచి నెర్వ్ గ్యాస్ టబున్ ఉపయోగిస్తోంది. టబున్ అంటే నిమిషంలోనే వేల మందిని చంపగలిగే ప్రమాదకరమైన వాయువు.

1988లో తమ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కుర్దులపై ఇరాక్ రసాయన ఆయుధాలు ప్రయోగించింది. దాంతో కుర్దుల గెరిల్లా యోధులు ఇరాన్ సైన్యంతో చేతులు కలిపారు.

1988 మార్చి 16న ఇరాక్.. కుర్దులు ఎక్కువగా ఉండే హలబ్జాపై మస్టర్డ్ గ్యాస్- సరీన్, టబున్ ఉన్న రసాయన ఆయుధాలు ప్రయోగించింది. ఈ దాడిలో వేల మంది పౌరులు మృతి చెందారు.

ఇరాక్ అన్‌ఫాల్ దాడిలో కూడా రసాయన ఆయుధాలు ఉపయోగించారు. ఆ దాడుల్లో కుర్దులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 50 వేల నుంచి లక్ష మంది వరకూ చనిపోయారని లేదా గల్లంతయ్యారని చెబుతారు.

ఈ యుద్ధంలో రసాయన ఆయుధాలు ఉపయోగించడంపై 1988లో భద్రతా మండలి ఇరాక్‌ను తప్పుబట్టింది. కానీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు యుద్ధం ముగిసేవరకూ ఇరాక్‌కు అండగా నిలిచాయి.

యుద్ధం కొనసాగినంత కాలం పశ్చిమ దేశాలతో ఇరాక్ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆయతుల్లా ఖుమైనీ ఇస్లాం ఛాందసవాదం చూసిన పశ్చిమ దేశాలు ఇరాన్ వల్ల తమకు ముప్పు ఉంటుందని భయపడ్డాయి. దానిని అడ్డుకోవాలని భావించాయి.

Image copyright Getty Images

పశ్చిమ దేశాల ప్రభావం

1982లో అమెరికా తీవ్రవాదాన్ని సమర్థించే దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించింది. అది జరిగిన రెండేళ్ల తర్వాత అమెరికా ఇరాక్‌తో ఉన్న దౌత్య సంబంధాలను కూడా పునరుద్ధరించుకుంది.

1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా.. ఇరాక్‌తో తమ దౌత్య సంబంధాలను తెంచుకుంది. అయితే ఇరాక్‌కు ఆయుధాల సరఫరా ఎక్కువగా దాని పాత మిత్రుడైన రష్యా నుంచే జరిగేది.

కానీ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి మిగతా పశ్చిమ దేశాలు కూడా ఇరాక్‌కు ఆయుధాలు అందిస్తూ వచ్చాయి. సద్దాం హుస్సేన్ ప్రభుత్వంతో అమెరికా 'ఇంటెలిజెన్స్ షేరింగ్' కూడా చేసుకునేది.

కానీ అప్పుడే ఇరాన్-కాంట్రా స్కాండల్ కూడా వెలుగుచూసింది. లెబనాన్‌లో బందీలుగా ఉంచిన అమెరికన్ల విడుదల కోసం అమెరికా ఇరాన్‌కు కూడా ఆయుధాలు రహస్యంగా అందిస్తోందని ప్రపంచానికి తెలిసింది. అది ఇరాక్, అమెరికా మధ్య వివాదానికి కారణమైంది.

ఇరాక్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రెండు దేశాల్లోని ప్రముఖ నగరాలను సైన్యం లక్ష్యంగా చేసుకునేది. దాంతో ఆ ప్రభావం చాలా మంది పౌరులపై పడింది.

Image copyright Getty Images

ట్యాంకర్ల యుద్ధంతో రెండు దేశాలు గల్ఫ్‌లో ఒకరి ఆయిల్ ట్యాంకర్లను ఇంకొకటి టార్గెట్ చేసేవి. వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీయాలని ఎత్తులు వేశాయి. నిజానికి ఈ రెండు దేశాల మధ్య ట్యాంకర్ల యుద్ధం అంతర్జాతీయంగా ప్రభావం చూపించింది.

తమ నౌకలపై ఇరాన్ వరుస దాడులు చేయడంతో వాటికి భద్రత కల్పించాలని కువైట్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. దాంతో అమెరికా, సోవియన్ యూనియన్‌ రెండూ అందులో జోక్యం చేసుకున్నాయి. దాంతో యుద్ధంపై ఇరాన్‌ పట్టు కోల్పోయింది.

యుద్ధం వల్ల ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవడం, మిగతా ప్రపంచానికి దూరం కావడం చూసిన ఆ దేశ అధికారులు యుద్ధం విరమించేందుకు అంగీకరించాలని ఖుమైనీని కోరారు.

1988 జులైలో చివరికి యుద్ధం నుంచి ఇరాన్ వెనకడుగు వేసినపుడు, "అది నాకు విషం తాగినట్లే ఉంది" అని ఆయతుల్లా ఖుమైనీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్‌రాజ్

శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి