డిజిటల్ అక్షరాస్యత: గాడిద లాగే కమ్యూనిటీ టాబ్లెట్‌తో గ్రామీణ ప్రజలకు మొబైల్ టెక్నాలజీ

  • 10 జూన్ 2019
గాడిదతో రవాణా - మారుమూల ప్రాంతాల వారికి సాంకేతికను చేర్చేందుకు చాలా సులువైన మార్గం అని మొజాంబిక్‌లో భావిస్తున్నారు. Image copyright Community tablet
చిత్రం శీర్షిక గాడిదతో రవాణా - మారుమూల ప్రాంతాల వారికి సాంకేతికను చేర్చేందుకు చాలా సులువైన మార్గం అని మొజాంబిక్‌లో భావిస్తున్నారు

మునుపెన్నడూలేని మొబైల్ టెక్నాలజీని మొజాంబిక్‌లోని ఎక్కడో మారుమూల జిల్లా అయిన ఫున్హాలౌరులో 2016లో ప్రవేశపెట్టారు.

ఓ కంటైనర్‌పై సౌరశక్తితో పనిచేసే 4 ఎల్‌సీడీ స్క్రీన్‌లు నిలబెట్టి ఉంటాయి. ఈ కంటైనర్‌ను ఒక బండిపై పెట్టి, దానిని లాగేందుకు గాడిదను వాడుతున్నారు.

అదొక రోడ్డు షో, సంగీతంతో జనాలని ఆకర్షించి పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌పై 3 నిమిషాల వీడియో ప్లే చేస్తారు.

ఇదంతా డిజిటల్ అక్షరాస్యత కోసం అని చెబితే ఆ విషయం అక్కడి వారికి అర్థం కాకపోయినా ఎప్పుడూ డిజిటల్ స్క్రీన్‌ని కానీ కదిలే బొమ్మలని కానీ చూడని వారికి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ 3 నిమిషాల సినిమా తర్వాత, ప్రేక్షకులను చిన్న స్క్రీన్ టాబ్లెట్లో వారు చూసిన సినిమాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎక్కువ స్కోర్ వచ్చినవారికి టీ షర్టులు, టోపీలు పంచుతారు.

అక్షరాలు చదవలేని వారికి బొమ్మల రూపంలో ఈ ప్రశ్నలను చూపిస్తారు.

Image copyright Community Tablet
చిత్రం శీర్షిక ప్రజలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడం ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన అంశం

"మేం ఒక చోటకి వెళ్తే ఒక సంబరంలా వెళ్తాo" అని కమ్యూనిటీ టాబ్లెట్ స్థాపకుడు డైన్ అమాడే అంటున్నారు.

"జనాలని ఆకర్షించడం మాకు ముఖ్యం, అందుకే మేము సంగీతాన్ని వాడతాం".

ఆఫ్రికాలోని సహారా ప్రాంతంలో 2025 నాటికి 65 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటారని జీఎస్ఎం అసోసియేషన్ అంచనా వేసింది. 2017 నాటికి 25 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని జీఎస్ఎం అంచనాలు చెప్తున్నాయి.

మొబైల్ టెక్నాలజీ వాడకం వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. కొంతమంది జీవితంలో మొదటిసారి ఒక బ్యాంకు అకౌంట్ వాడుతున్నారు, కొంతమంది వారి పంట దిగుబడి పెంచుకున్నారు.

Image copyright Community tablet
చిత్రం శీర్షిక కొంతమందికి తాకే తెరను ముట్టుకోవడం ఇదే తొలిసారి

కమ్యూనిటీ టాబ్లెట్ ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి కృషి చేస్తోంది. వినోదాన్ని వాడుకుని డిజిటల్ అక్షరాస్యతని పెంచడానికి ముందడుగు వేస్తోంది. ఈ రోడ్డుషో ద్వారా జనాలకి ఆరోగ్యం, మొబైల్ బ్యాంకింగ్, ఎన్నికలలో ఓటు వెయ్యడo ఎంత ముఖ్యమో మొదలైన విషయాల్లో అవగాహన తీసుకొస్తున్నారు.

మొజాంబిక్‌లో పుట్టిన అమాడే తన ఇద్దరు కొడుకులు వారి టాబ్లెట్లను ఉపయోగించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని, యూట్యూబ్ చూసి వస్తువులను ఎలా తయారుచేయాలో కూడా నేర్చుకున్నారని, అదే తనకి ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి స్ఫూర్తినిచ్చిందని చెప్తున్నారు.

Image copyright Community tablet
చిత్రం శీర్షిక ప్రజలను ఆకర్షించేందుకు పాటలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది

"మారుమూల ప్రాంతాల్లో ప్రజలు వారి ప్రాథమిక పనులకు మొబైల్ టెక్నాలజీని వాడుకోలేకపోడానికి డిజిటల్ నిరక్షరాస్యత ప్రధాన కారణం. నా ప్రయత్నం ఈ నిరక్షరాస్యత తగ్గించడం కోసమే" అని ఆయన అన్నారు.

మొజాంబిక్ లాంటి దేశాలలో టెక్నాలజీ వాడకాన్ని పెంచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలితాలు పెద్దగా రాలేదు. 'ఒక పిల్లాడికి ఒక లాప్‌టాప్' లాంటి పథకం విద్యావ్యవస్థ, విధానాన్ని పూర్తిగా మారుస్తుందని భావించినా సాధ్యం కాలేదు.

Image copyright Community tablet
చిత్రం శీర్షిక తన పిల్లలు పరికరాలను వాడుతుండటాన్ని చూసి అమాడేకు ఈ కమ్యూనిటీ టాబ్లెట్ ఉపాయం తట్టింది

చౌక ఆవిష్కరణలు

"ఆఫ్రికాలో 'ఒక పిల్లాడికి ఒక లాప్‌టాప్', ఉచితంగా మొబైల్ ఫోన్లు లాంటి పథకాలు కొన్నిసార్లు ఆశించిన ప్రయోజనాలనివ్వవు" అని అమాడే అన్నారు.

"ప్రతి ఒక్కరికి ఒక టాబ్లెట్ ఇవ్వడం అసాధ్యం. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. వాళ్ళు టాబ్లెట్‌ని వాడుకుంటారో అమ్మేస్తారో కూడా చెప్పలేం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Community tablet

లైబీరియాలోని ఒక బ్లాగర్ రోజూ వచ్చే వార్తలని బ్లాక్ బోర్డుపై రాసి జనాలకి చూపించేవాడు.

"కొన్నిసార్లు చిన్న చిన్న ఆలోచనలే మనకి బాగా ఉపయోగపడతాయి" అని డిజిటల్ ఐడి సంస్థ యోటి ఉద్యోగి కెన్ బ్యాంక్స్ అన్నారు.

"కమ్యూనిటీ టాబ్లెట్ లాంటి ప్రాజెక్టులు చౌక ఆవిష్కరణలు. మనకి అది ఎలా ఉపయోగపడుతుంది అనే చూడాలి తప్ప చూడడానికి ఎంత బాగుందనే విషయంపై సమయం వెచ్చించకూడదు" అని ఆయన అన్నారు.

"ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతోనే మనకున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి, కానీ మనం ఇంకా ఏదో కొత్తగా కనుక్కోవాలని సమయం వృధా చేసుకుంటున్నాం."

"నా ఆవిష్కరణ చాలా చిన్నదని నాకు తెలుసు. కానీ, నా ఆవిష్కరణని ఎవరూ దొంగలించలేరు, అమ్మలేరు" అని అమాడే అంటున్నారు.

అమాడే ప్రాజెక్టుకు ఎన్జీఓల ద్వారా సంపాదన వస్తుంది. మారుమూల ప్రాంతాలను వారి పాఠాల ద్వారా చేరుకోవాలనుకునే ఎన్నో ఎన్జీఓలు అమాడే పద్ధతిని వినియోగించుకుంటున్నాయి.

"జనాలకి పాంఫ్లెట్ ఇస్తే విసిరి పడేస్తారు. పోనీ ఎవరితో అయినా చెప్పిస్తే 2, 3 నిమిషాలకు మించి వినరు. అదే మా ప్రాజెక్టుతో జనాలు విని, సమయం వెచ్చించి ఏదో ఒకటి నేర్చుకుంటారు" అని అమాడే అన్నారు.

మా ప్రాజెక్టును వాడుకున్న వారికి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. పౌరుల హక్కులపై అవగాహన కార్యక్రమం ఒకటి చూపించన తర్వాత ఓటింగ్ 45 శాతం పెరిగింది. ఒక కుటుంబ నియంత్రణ అవగాహన ప్రచారం చేశాక గర్భ నిరోధకాల వాడకం 27 శాతం పెరిగింది.

Image copyright Community Tablet

అమాడే గత 3 ఏళ్లుగా ఆయన ప్రాజెక్ట్ పేరు మీద మొజాంబిక్‌లోని మారుమూల 90 ప్రాంతాలను చుట్టేశారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నారు.

ఒక యానిమేటెడ్ వీడియోలో కలరా వ్యాధిని నిరోధించడానికి శుభ్రత ఎంత అవసరమో చూపించవలసి వచ్చినప్పుడు.. ఆ వీడియోలో మనిషి కుడి చెయ్యి వాడి శుభ్రం చేసుకోవడం చూపించడంతో ఒక ఊరులో ముస్లిం ప్రజలు కలత చెందారు.

"ఆ ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను" అని అమాడే అంటున్నారు.

ప్రస్తుతం మా ప్రాజెక్టులో వేసే ఏ వీడియో అయినా ముందు మపుటోలోని ఒక విశ్వవిద్యాలయానికి పంపి వాళ్ళు ఒప్పుకున్నాకే మేము వాడతాం.

"ఈ శాస్త్రవేత్తల వల్ల మాకు చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రదేశాన్ని బట్టి ప్రజల అలవాట్ల బట్టి ఇప్పుడు మేం వీడియోలు తయారు చేస్తున్నాం" అని కెన్ బ్యాంక్స్ అన్నారు.

కమ్యూనిటీ టాబ్లెట్ ప్రాజెక్టుకు ఇప్పుడు బ్రిటన్‌లో పేటెంట్ లభించింది. ఈ ప్రాజెక్టును ఇతర దేశాలకు విస్తరించాలి అని అమాడే అనుకుంటున్నారు.

ఇప్పటికే పిల్లలకి కెరీర్ సలహాలు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా వాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)