మంజూర్ పష్తీన్: పాకిస్తాన్‌ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న పాతికేళ్ల కుర్రాడు

  • 30 మే 2019
మంజూర్ పష్తీన్
చిత్రం శీర్షిక మంజూర్ పష్తీన్

పాకిస్తాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌ ఖార్ కమర్ ప్రాంతంలో గత ఆదివారం కొంతమంది ఆందోళనకారులకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందినట్లు పాక్ సైన్యం చెప్పింది. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు.

ఆందోళనకారుల గుంపు ఒక ఆర్మీ చెక్ పోస్టుపై దాడి చేసిందని సైన్యం చెప్పింది. వాళ్లందరూ 'పష్తూన్ తహఫ్పూజ్ మూవ్‌మెంట్(పీటీఎం)' నిరసనకారులని తెలిపింది.

అయితే పీటీఎం మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నప్పుడు సైన్యం నిరాయుధులుగా ఉన్న తమపై కాల్పులు జరిపిందని చెప్పింది. చాలా మంది గాయపడ్డారని తెలిపింది.

దాడి తర్వాత ట్విటర్‌లో #StateAttackedPTM ట్రెండ్ అయ్యింది. ప్రభుత్వం తరఫున జారీ అయిన ప్రకటన ప్రకారం ఈ కాల్పుల్లో గాయపడినవారిలో ఐదుగురు జవాన్లు కూడా ఉన్నారు.

సైన్యం ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ ఆందోళనకారులకు మొహసిన్ డావర్, అలీ వజీర్ నాయకత్వం వహించారని పాకిస్తాన్ న్యూస్ వెబ్‌సైట్ డాన్ చెప్పింది. వీరు పీటీఎంకు సంబంధించిన వారు

పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఈ కాల్పులపై విచారణకు ఆదేశించింది. ఇలాంటి హింసాత్మక ఘర్షణల వల్ల పీటీఎం మద్దతుదారులు, సైన్యం మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని చెప్పింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పష్తూన్లు పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌లో నివసిస్తారు

ఎప్పటినుంచో ఘర్షణలు

పీటీఎం, సైన్యం మధ్య ఘర్షణలు జరగడం కొత్త కాదు.

పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాద గ్రూపులను అణచివేసేందుకు చర్యలు ప్రారంభించినపుడు అప్గానిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఒక ప్రాంతం వాటికి కేంద్రంగా నిలిచింది.

ఈ గిరిజన ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఆ చర్యలు ఒకవిధంగా సఫలమయ్యాయని సైన్యం భావిస్తోంది. కానీ అక్కడ నివసిస్తున్న పష్తూన్ సమాజం మాత్రం సైనిక చర్యలతో తమకు చాలా అన్యాయం జరిగిందని అనుకుంటోంది.

పష్తూన్ సమాజం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ బాధిత గిరిజన ప్రాంతాల్లో ఆంగ్లేయుల సమయం నుంచీ ఉన్న చట్టాలు రద్దు చేసి అక్కడ కూడా పాకిస్తాన్ రాజ్యాంగం అమలు చేయాలని వారు కోరుతున్నారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌ పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కులను వజీరిస్తాన్, ఇతర గిరిజన ప్రాంతాలవారికి కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాలిబాన్ల అణచివేతకు జరిగిన సైనిక ఆపరేషన్లలో ఇళ్లు, వ్యాపారాలు నష్టపోయిన స్థానికులకు పరిహారం అందించాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల దగ్గర స్థానికులతో సరిగా వ్యవహరించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

కానీ, ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న పీటీఎంకు దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని పాక్ జాతీయ సంస్థలకు సందేహం ఉంది.

పష్తూన్ తహఫ్పూజ్ మూవ్‌మెంట్ 2014లో ప్రారంభమైంది. పష్తీన్ అనే ఒక యువకుడు దీనిని ప్రారంభించాడు.

మొదట్లో ఇది ప్రజలను తమవైపు ఆకర్షించడంలో అంత విజయవంతం కాలేకపోయింది. కానీ మెల్లమెల్లగా దాని మద్దతుదారులు ఎంతగా పెరిగారంటే.. ఇప్పుడు వారు పాకిస్తాన్ ప్రభుత్వానికే పెను సవాలుగా నిలిచారు.

చిత్రం శీర్షిక ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వర్ధమాన మోడల్ నకీబుల్లా మెహసూద్

ఈ మంజూర్ పష్తీన్ ఎవరు

పాతికేళ్ల మంజూర్ పష్తీన్ పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌కు చెందినవాడు. ఈ ప్రాంతంపై పాకిస్తానీ తాలిబన్లకు గట్టి పట్టుందని చెబుతారు.

గత ఏడాది జనవరిలో దక్షిణ వజీరిస్తాన్‌లో ఉంటున్న నకీబుల్లా మెహసూద్ అనే యువకుడు కరాచీలో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్లో చనిపోయినప్పుడు మంజూర్ పష్తీన్ పేరు పాక్ వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది.

నకీబుల్లా ఒక వర్ధమాన మోడల్. అతడి మృతికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు ప్రారంభించారు. వారిలో మంజూర్ పష్తీన్ కూడా ఉన్నాడు. చాలా తక్కువ సమయంలో అతడు వార్తల్లో నిలిచాడు.

మంజూర్ పష్తీన్‌కు పాకిస్తాన్‌లో వెనకబడిన, అణచివేతకు గురైన సమాజానికి గొంతుక అనే గుర్తింపు వచ్చింది. పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద జాతి అయిన పష్తూన్లు తమ భద్రత, పౌర స్వేచ్ఛ, సమాన హక్కుల కోసం ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు.

మంజూర్ పష్తీన్ 2014లో పష్తూన్ తహఫ్పుజ్ మూవ్‌మెంట్ ప్రారంభించాడు. కానీ ఆ ఉద్యమం అప్పట్లో అంత ప్రభావం చూపించలేకపోయింది.

2018 జనవరిలో నకీబుల్లా మృతి తర్వాత అతడు ఒక ప్రత్యేక వర్గానికి ఏకైక హీరోగా నిలిచాడు. అతడి మరణానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు దేశంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించాయి.

ఈ వ్యతిరేక ప్రదర్శనల మధ్య మంజూర్ పష్తీన్ సోషల్ మీడియా ద్వారా పష్తూన్ యువతను కూడా ఆకట్టుకున్నాడు. తన ప్రసంగాలను అందరికీ షేర్ చేసేవాడు.

ఈ ప్రసంగాల్లో అతడు గిరిజన సమాజం, ముఖ్యంగా పష్తూన్ల హక్కుల కోసం డిమాండ్ చేస్తూ కనిపించేవాడు. యువత ఆ ప్రసంగాలకు ప్రభావితమైంది. అతడి ఆందోళనలకు అండగా నిలిచింది.

తర్వాత అతడి ఆందోళనల్లో ఆ ప్రాంతంలోని యుద్ధ బాధిత కుటుంబాలు కూడా కలిశాయి. మంజూర్ పష్తీన్ డ్రోన్ దాడుల్లో నష్టపోయిన వారి కష్టాలను కూడా లేవనెత్తాడు.

ఆందోళనలను అణచివేయాలనే ప్రయత్నం చివరికి పాకిస్తాన్‌లో పష్తూన్ల ఉద్యమానికి కొత్త రూపం ఇచ్చింది. ఈ నిరసనలు నేలపై నుంచి సోషల్ మీడియాకు కూడా పాకాయి.

గత ఏడాది బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజూర్ పష్తీన్ "నేనేం చేయలేదు. వీళ్లు(గిరిజన ప్రాంతాల ప్రజలు) వరుస దోపిడీలకు గురవుతూనే ఉన్నారు. వారి జీవితాలు దుర్భరం అయ్యాయి. వాళ్లంతా అణచివేతకు గురైనవారు. వారికి తమ బాధలు వినిపించడానికి ఒక గళం కావాలి. నేను అదే అయ్యాను" అన్నాడు.

Image copyright AFP

ప్రభుత్వానికి సవాళ్లు

మంజూర్ పష్తీన్ ఆందోళనలు పెరిగేకొద్దీ, పాక్ ప్రభుత్వానికి అవి ఒక సవాలుగా మారుతూ వచ్చాయి.

ఆందోళనలు తీవ్రం కాకూడదని, అందుకే ప్రభుత్వం పీటీఎంకు సంబంధించిన వార్తలను ప్రచురించకుండా అడ్డుకుందని ఆరోపణలు ఉన్నాయి. అంతా సైన్యం చెప్పినట్టే జరుగుతోందని కూడా అంటారు. కానీ వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు.

మంజూర్ పష్తీన్ బీబీసీతో "గిరిజనులను కూడా తీవ్రవాదుల్లా భావిస్తున్నారని" అన్నాడు.

"మేం కేవలం మా గౌరవం, మా హక్కులు తిరిగి పొందాలనుకుంటున్నాం. మేం రోడ్లు అడగడం లేదు, అభివృద్ధి కోరుకోవడం లేదు. కేవలం మాకు జీవించే హక్కు ఇవ్వమని అడుగుతున్నాం" అన్నాడు.

Image copyright AFP
చిత్రం శీర్షిక పష్తీన్ ర్యాలీలకు భారీగా జనం తరలివస్తారు

ఆత్మగౌరవానికి దెబ్బ

పాక్ సైన్యం, తీవ్రవాదులకు మధ్య తాము నలిగిపోతున్నట్లు పష్తూన్లు భావిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒకే రోడ్డుపై పాక్ సైన్యం, తాలిబాన్ల చెక్ పోస్టులు కనిపిస్తాయి.

ఈ దారిలో గడ్డం ఉన్న వాళ్లు ఎవరైనా వెళ్తూ కనిపిస్తే, పాక్ సైన్యం అతడిని తీవ్రవాది అంటుంది. ఒక వేళ వారికి గడ్డం లేకుంటే, తాలిబాన్లు వాళ్లను ప్రభుత్వ మద్దతుదారులని ఆరోపిస్తారు.

ప్రజల నుంచి ఇంత మద్దతు లభిస్తుందని అనుకోలేదని మంజూర్ పష్తీన్ చెప్పాడు. కానీ ఏం చేయాలనేదానిపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నాడు.

బీబీసీతో పష్తీన్ "ప్రజలను వంచనకు గురయ్యారు. వారి జీవితాలు భరించలేనంత దారుణంగా ఉన్నాయి. కర్ఫ్యూ, అవమానాలతో మా ఆత్మగౌరవం దెబ్బతింది" అన్నాడు.

మంజూర్ పష్తీన్ ఆందోళనలకు మెల్లమెల్లగా రాజకీయ నేతల మద్దతు కూడా లభిస్తోంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందు ముందు ఒక పెద్ద సవాలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)