శ్లాబుపై తెల్ల రంగు వేస్తే ఇల్లు చల్లగా మారుతుందా - రియాల్టీ చెక్

  • 31 మే 2019
గ్రీస్‌లో Image copyright Getty Images

చల్లదనం కోసం ఇళ్ల పైకప్పులకు తెల్ల రంగు వేసే పద్ధతి చాలా కాలంగా వాడుకలో ఉంది. ఇలా చేయడం వల్ల సూర్య కాంతి పరావర్తనం చెంది ఇంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది.

అయితే, ఈ తగ్గుదల ఏ స్థాయిలో ఉంటుంది? ఈ పద్ధతిలో ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా?

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు.

తెల్ల రంగు వేయడం వల్ల పైకప్పు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గుతుందని, ఇంటి లోపల ఈ తగ్గుదల 7 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఉండొచ్చని అన్నారు.

ఈ గణాంకాలను ఏవైనా అధ్యయనాలు బలపరుస్తున్నాయా?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ బాన్ కీ మూన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో వేసనిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకూ నమోదవుతుంటాయి.

2017లో ఆ నగరంలోని మూడు వేల భవనాలకు తెల్ల సున్నం, ప్రత్యేక పరావర్తక కోటింగ్ వేశారు.

ఈ పద్ధతిని ‘కూల్ రూఫింగ్’ అంటుంటారు. తెల్ల రంగు వేస్తే పైకప్పు తక్కువ సూర్యరశ్మి గ్రహిస్తుంది కాబట్టి, భవనం లోపలికి ప్రసరించే వేడి కూడా తక్కువగా ఉంటుంది.

భవనం సాధారణంగా గ్రహించే వేడిని కూడా ఇలాంటి పైకప్పులు కాస్త బయటకు వదులుతాయి.

Image copyright Getty Images

కూల్ రూఫింగ్ వల్ల పైకప్పు ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకూ, భవనం లోపలి ఉష్ణోగ్రత 3 నుంచి 7 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల మేర తగ్గుతుందని అహ్మదాబాద్ ప్రాజెక్టు‌కు సంబంధించిన ప్రణాళిక పత్రం పేర్కొంది.

కానీ, అవి ఆ ప్రాజెక్టులో తేలిన ఫలితాలు కావు.

అమెరికాకు చెందిన నేచురల్ రీసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించింది.

ఆ సంస్థకు చెందిన నిపుణురాలు అంజలీ జైస్వాల్ ఈ విషయం గురించి మాట్లాడారు.

‘‘భవనం ఉన్న పరిస్థితులను బట్టి, సాధారణమైన వాటి కన్నా కూల్ రూఫింగ్ ఉన్న వాటి లోపలి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

బాన్ కీ మూన్ చెప్పినదాని కన్నా ఇది కొంచమే తక్కువ.

హైదరాబాద్‌లోనూ ఇలాంటి ప్రాజెక్టు నిర్వహించారు. అందులో మెంబ్రేన్ కూలింగ్ పెయింట్‌ను వాడారు. భవనాల లోపలి ఉష్ణోగ్రతలు సగటున రెండు డిగ్రీ సెంటీగ్రేడ్‌లు తగ్గాయి.

కాలిఫోర్నియాకు చెందిన బెర్కెలీ ల్యాబ్ సంస్థ జరిపిన అధ్యయన ఫలితాలు మాత్రం బాన్ కీ మూన్ వెల్లడించిన గణాంకాలకు దగ్గరగా ఉన్నాయి.

వేసవిలో స్వచ్ఛమైన తెల్లటి పైకప్పు ఉన్న భవనాలు 80 శాతం సూర్య కాంతిని పరావర్తనం చెందిస్తాయని, పైకప్పు ఉష్ణోగ్రత 31 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వరకూ తగ్గుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.

కాలిఫోర్నియాతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ 60 శాతానికి పైగా భవనాల పైకప్పులు లోహం, ఆస్‌బెస్టాస్, కాంక్రీటుతో నిర్మితమైనవే. వీటి వల్ల తెల్లటి రంగు వేసినా, చాలా వరకూ వేడి భవనాల్లోనే ఉండిపోతుంది.

అయితే, అహ్మదాబాద్, హైదరాబాద్ ప్రాజెక్టులు సంతృప్తికర స్థాయిలోనే విజయవంతమయ్యాయి.

Image copyright Getty Images

పైకప్పుకు తెల్ల రంగు వేసే ఆలోచన కొత్తదేమీ కాదు. దక్షిణ యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో శతాబ్దాలుగా ఇలాంటి పైకప్పులు కనిపిస్తూనే ఉన్నాయి.

న్యూయార్క్‌లో ఇటీవల కోటి చదరపు అడుగుల మేర పైకప్పులకు తెల్ల రంగు వేశారు.

విద్యుత్ ఆదా చేయడానికి దీన్నొక ప్రధాన మార్గంగా నిపుణులు భావిస్తున్నారు. కాలిఫోర్నియా లాంటి చోట్ల కూడా భవన నిర్మాణ ప్రమాణాలు దీనికి అనుగుణంగా మారుతున్నాయి.

కూల్ రూఫింగ్ వల్ల ఎయిర్ కండిషనింగ్‌కు అయ్యే వ్యయం 40 శాతం మేర తగ్గొచ్చు.

భోపాల్‌లో నిర్వహించిన ఓ ప్రయోగంలో తక్కువ ఎత్తులో ఉండే భవనాలకు కూల్ రూఫింగ్ చేయడం వల్ల వేసవిలోని తీవ్ర వేడి పరిస్థితుల్లో 303 కిలోవాట్ అవర్‌ల శక్తిని ఆదా చేయొచ్చని తేలింది.

ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాలన్నీ ఈ పద్ధతిని పాటిస్తే, 24 గిగాటన్నుల మేర కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని బెర్కెలీ ల్యాబ్ అంచనా వేసింది. ఇది 20 ఏళ్ల కాలంలో 30 కోట్ల కార్ల నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్‌తో సమానం.

Image copyright Getty Images

కూల్ రూఫింగ్ విధానం చవక కాబట్టి, పేద దేశాలు దీన్ని పాటించొచ్చు.

చదరపు అడుగుకు రూపాయిన్నర చొప్పున ఖర్చుతోనే ఈ కోటింగ్ వేయొచ్చని జైస్వాల్ అన్నారు.

దాని వల్ల దక్కే వ్యక్తిగత సౌఖ్యం, విద్యుత్ ఆదాతో పోల్చుకుంటే ఈ ఖర్చు పెద్దది కాదు.

ఈ పద్ధతిని అమలు చేయడంలో రాజకీయ సంకల్పం ప్రధాన పాత్ర పోషిస్తుందని జైస్వాల్ అభిప్రాయపడ్డారు.

అయితే కూల్ రూఫింగ్ వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

చల్లటి పరిస్థితులు ఉండే నగరాల్లో శీతాకాలంలో హీటర్ల వినియోగం పెరిగే అవకాశముంది. పైకప్పులు కూడా గడ్డకట్టిపోవచ్చు.

అందుకే, దిల్లీలో చేపట్టిన పునరావాస కాలనీ ప్రాజెక్టుకు రూఫ్ కూలింగ్ వాడొద్దని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్ణయం తీసుకుంది.

‘‘పైకప్పులను వివిధ అవసరాల కోసం జనాలు వాడుకుంటుంటారు. ఈ కారణంతోనూ దానికి రంగు వేయడం వారు వద్దంటున్నారు’’ అని దిల్లీలోని అర్బన్ అండ్ రీజనల్ ఎక్సలెన్స్ సంస్థకు చెందిన రేణు ఖోస్లా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)