ఉత్తరకొరియాలో అయిదుగురు అధికారులకు మరణశిక్ష.. ఈ వార్తను నమ్మొచ్చా, నమ్మకూడదా

  • 1 జూన్ 2019
కిమ్ జాంగ్ ఉన్ Image copyright EPA/KCNA
చిత్రం శీర్షిక కిమ్ జాంగ్ ఉన్

ఉత్తర కొరియా తమ దేశానికి చెందిన ఐదుగురు దౌత్య అధికారులకు మరణశిక్ష అమలుచేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమెరికా కోసం ప్రత్యేక రాయబారిగా ఉత్తర కొరియా నియమించుకున్న కిమ్ హ్యోక్ చోల్ కూడా శిక్షకు గురైన వారిలో ఉన్నట్లు అవి పేర్కొన్నాయి.

వియత్నాంలో ఇటీవల అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యానికి బాధ్యులుగా పేర్కొంటూ సదరు అధికారులను ఉత్తర కొరియా శిక్షించిందంటూ ఈ వార్తల్లో ఉంది.

అయితే, వీటిని పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు. అధికారులకు, ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారికి ఉత్తర కొరియా మరణ శిక్ష వేసినట్లు వచ్చిన చాలా వార్తలు ఆ తర్వాత తప్పని తేలాయి.

Image copyright EPA/YONHAP
చిత్రం శీర్షిక కిమ్ హ్యోక్ చోల్

దక్షిణ కొరియా ప్రభుత్వం, ఆ దేశ మీడియా మరణశిక్షకు గురైనట్లు పేర్కొన్న చాలా మంది.. ఆ తర్వాత కొన్నివారాలకు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్‌తో కలిసి కనిపించిన ఘటనలు ఉన్నాయి.

ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అందిన సమాచారం ఆధారంగా దక్షిణ కొరియాకు చెందిన ఓ దినపత్రిక తాజా వార్తను ప్రచురించింది.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని విమానాశ్రయంలో హ్యోక్ చోల్‌ను, మరో నలుగరు విదేశాంగ శాఖ అధికారులను ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు.

అమెరికా కోసం గూఢచర్యం పాల్పడ్డారని, ఆ దేశ ఉద్దేశాలను సరిగ్గా గ్రహించకుండా చర్చలపై సరిగ్గా ప్రభుత్వానికి నివేదించలేదని ఉత్తర కొరియా వారిపై అభియోగాలు మోపిందని వివరించారు.

Image copyright White House
చిత్రం శీర్షిక యోంగ్ చోల్‌, డోనల్డ్ ట్రంప్

కిమ్ జాంగ్ ఉన్‌కు కుడి భుజంగా భావించే యోంగ్ చోల్‌ను చైనా సరిహద్దుల్లో ఉన్న లేబర్ క్యాంప్‌కు పంపించినట్లు కూడా తెలిపారు. వియత్నాంలోని హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కిమ్ జాంగ్ ఉన్ భేటీ ఏర్పాట్ల కోసం యోంగ్ చోల్‌ పనిచేశారు.

మరణ శిక్షకు గురైనట్లు చెబుతున్న హ్యోక్ చోల్ ఈ భేటీకి ముందు అమెరికా, ఉత్తర కొరియా మధ్య సాగిన చర్చల్లో కీలకపాత్ర పోషించారు.

తాజా వార్తల్లో కొంత మేర నమ్మదగిన అంశాలు కూడా ఉన్నాయి. శిక్షకు గురైనట్లు చెబుతున్న అధికారులు ఫిబ్రవరిలో ట్రంప్-కిమ్ భేటీ జరిగినప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ట్రంప్‌తో చర్చలు విఫలమవ్వడం పట్ల ఆగ్రహంతో ఉన్న కిమ్.. ఆ నిందంతా ఎవరి మీదైనా వేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చు.

అమెరికాతో కిమ్ ఆడిన దౌత్య క్రీడ ఇప్పటివరకూ ఫలితాలివ్వలేకపోయింది. దీంతో ఆయన ఒత్తిడికి గురవుతున్నారు.

ఉత్తర కొరియాపై కఠిన ఆర్థిక ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. అమెరికాతో ఆ దేశ సంప్రదింపులూ ఆగిపోయాయి. దీనికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలన్న ఉద్దేశంతో అధికారులకు శిక్ష విధించి ఉండొచ్చు.

Image copyright Getty Images

‘పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల’కు పాల్పడిన 'విద్రోహులు' కఠిన శిక్షలు ఎదుర్కోకతప్పదని కొన్ని రోజుల క్రితం ఉత్తర కొరియా ప్రభుత్వ దినపత్రిక సంపాదకీయం పేర్కొంది. అయితే, ఇందులో ఎవరీ పేర్లనూ ప్రస్తావించలేదు.

కిమ్ జాంగ్ మరణ శిక్షలు విధించిన ఘటనలు గతంలో ఉన్నాయి.

అధికారంపై మరింత పట్టు కోసం తన మామయ్య జాంగ్ సోంగ్ తీక్‌కు దేశద్రోహం ఆరోపణలతో కిమ్ మరణ శిక్ష అమలు చేశారు. తొలుత దక్షిణ కొరియా నిఘా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కొన్ని రోజులకు ఉత్తర కొరియా దీని గురించి ప్రకటన చేసింది.

కానీ, చాలా సార్లు ఈ మరణ శిక్షల వార్తలు వదంతులేనని తేలాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యోన్ సాంగ్ వోల్‌

తాజా వార్తను ప్రచురించిన దినపత్రికే 2013లో ఉత్తర కొరియా గాయని హ్యోన్ సాంగ్ వోల్‌ను మెషీన్ గన్స్‌తొ కిమ్ ప్రభుత్వం కాల్చివేయించినట్లు పేర్కొంది. అయితే, వింటర్ ఒలింపిక్స్ కోసం తమ దేశ ప్రతినిధుల బృందంతో గతేడాది ఆమె దక్షిణ కొరియాకు వచ్చారు.

సైన్యాధిపతి రి యంగ్ గిల్‌కు కూడా కిమ్ మరణ శిక్ష అమలు చేసినట్లు వార్తలు రాగా, కొన్ని నెలల తర్వాత ఆయన అక్కడి ప్రభుత్వ మీడియా ఛానెల్‌లో కనిపించారు. ఆయనకు కిమ్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

ఉత్తర కొరియాలో జరుగుతున్నట్లుగా వచ్చే చాలా వార్తలను ధ్రువీకరించుకునే మార్గమేదీ లేదు. ఉత్తర కొరియా స్వయంగా చెబితే గానీ, పూర్తి వివరాలు బయటకు రావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం