ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన 17 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు

  • 3 జూన్ 2019
జోనాస్ సావింబి, అంగోలా Image copyright AFP

అంగోలాలోని యునిటా రెబల్ గ్రూపు మాజీ నాయకుడు జోనాస్ సావింబి మరణించిన 17 ఏళ్ల తర్వాత తాజాగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలంపాటు సాగిన అంతర్యుద్ధాలలో అంగోలా అంతర్యుద్ధం ఒకటి. 1975 నుంచి 2002 వరకు 27 ఏళ్ల పాటు సాగిన ఆ పోరులో 5,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

రెబల్ గ్రూపు యునిటాకు నాయకుడిగా వ్యవహరించిన జోనాస్‌ను 2002లో అంగోలా సైన్యం హతమార్చడంతో ఆ అంతర్యుద్ధానికి ముగింపు పడింది.

అతన్ని చంపిన తర్వాత శవాన్ని హడావుడిగా లుయేనా పట్టణంలోని శ్మశానంలో సైనికులు ఖననం చేశారు. సమాధి మీద గుర్తుగా ఎర్రటి మట్టి కుప్పలా పోసి ఇనుప శిలువను పెట్టారని ఏఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

అయితే, అతని ఆత్మకు శాంతి కలగాలంటే శవాన్ని బయటకు తీసి మరోసారి అంతర్యక్రియలు నిర్వహించాలంటూ అతని కుటుంబ సభ్యులు, యునిటా పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, సుదీర్ఘ కాలం దేశాధ్యక్షుడిగా ఉన్న జోస్ ఎడ్వార్డో డోస్ శాంటోస్ అందుకు అంగీకరించలేదు. అతడు 2017లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ ప్రతిష్టంభనకు తెరపడింది.

తర్వాత వచ్చిన అధ్యక్షుడు జొయావో లౌరెన్సో... సావింబి శవానికి రెండోసారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించారు.

ఈ ఏడాది ఆరంభంలో సమాధిని తవ్వి అస్థికలను బయటకు తీసి, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. అవి సావింబివేనని తేలడంతో వాటిని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.

మే 31న (శుక్రవారం) లోపిటాంగా గ్రామంలో తన తండ్రి సమాధి దగ్గరే సావింబి అస్థికలను ఖననం చేశారు. అంతిమయాత్రలో వేలాది మంది యునిటా మద్దతుదారులు పాల్గొన్నారు.

Image copyright AFP

జోనాస్ సావింబి ఎవరు?

సావింబిని "బ్లాక్ రూస్టర్ (నల్ల కోడిపుంజు)" అని కూడా పిలిచేవారు. అనేక దురాగతాలకు పాల్పడినట్లు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, వేలాది మంది అతనిడిని గొప్ప నాయకుడిగా కీర్తించే వారు కూడా ఉండేవారు.

పోర్చుగీసువారి వలసపాలన నుంచి అంగోలాకు స్వాతంత్ర్యం సాధించేందుకు వైద్య విద్యను మధ్యలో వదిలేసి 1966లో యునిటా ఉద్యమం ప్రారంభించారు సావింబి. 1975లో స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత స్వదేశీ ప్రభుత్వంతో పోరాటం కొనసాగించారు.

అంగోలాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా సాగే పోరాటానికి తనను తాను నాయకుడిగా సావింబి చెప్పుకునేవారు. అతనికి అమెరికా నుంచి బలమైన మద్దతు ఉండేది. 1986లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌ను వైట్‌హౌజ్‌కు వెళ్లి కలిశారు.

దక్షిణాఫ్రికాలోని నల్లజాతీయుల నుంచి కూడా అతనికి మద్దతు ఉండేది, అధికార పార్టీకి మాత్రం అప్పటి సోవియట్ యూనియన్, క్యూబాలు బాసటగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు