తియానన్మెన్ స్క్వేర్ నరమేధం: 1989 జూన్‌లో అక్కడేం జరిగింది?

ఫొటో సోర్స్, Reuters
తియానన్మెన్ స్క్వేర్... చైనా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని కోరుకోని చిత్రం
1989లో తియానన్మెన్ స్క్వేర్ (మీడియాలో తియాన్మెన్ అని కూడా రాస్తుంటారు, కానీ సరైన ఉచ్చరణ తియానన్మెన్)లో నిరసనకారులపై జరిగిన హింసాకాండను చైనా సమర్థించుకుంది.
ఆరోజు నిరసనకారులను అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలు సరైనవే అని ఓ సదస్సులో రక్షణ మత్రి వీ ఫెంగీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ 1989లో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థులు, కార్మికులు భారీ నిరసన చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఘటనల్లో ఎందరో దారుణంగా చనిపోయారు. కానీ అప్పుడు జరిగిన సంఘటనల వివరాలను ప్రసారం చేయడంపై చైనా ప్రభుత్వం నిషేధించింది.
అప్పటి నరమేధానికి 2019 జూన్ 4తో 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
1989 జూన్ 4న తియానన్మెన్ స్క్వేర్‌లో దగ్ధమవుతున్న ఆయుధ ట్యాంక్
మంత్రి ఏమన్నారు?
1989 నాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రదర్శనలు, వాటి అణచివేతలపై మాట్లాడటం, చర్చించడంపై చైనాలో నియంత్రణలున్నాయి.
అయితే, సింగపూర్‌లో జరుగుతున్న ఓ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న చైనా మంత్రి ఫెంగీని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తియానన్మెన్ స్క్వేర్ ఘటన గురించి ప్రశ్నించారు.
"తియానన్మెన్ స్క్వేర్ నిరసనలపై చైనా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఇప్పటికీ చాలామంది అనుకోవడంపై మీరేమంటారు" అని ఆ వ్యక్తి ఫెంగీని ప్రశ్నించారు.
"ఆ ఘటనలు రాజకీయ నిరసనలు. ఆ నిరసనలను అదుపుచేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంది. అవన్నీ సరైన రీతిలో తీసుకున్న చర్యలే. గత 30 ఏళ్లలో చైనాలో ఎన్నో ప్రధానమైన మార్పులొచ్చాయి. ఆ సమయంలో చైనా అవలంబించిన కఠిన విధానాల వల్లే ఈరోజు సుస్థిర అభివృద్ధి సాధ్యమైంది" అని మంత్రి సమాధానమిచ్చారు.
ఫొటో సోర్స్, Getty Images
తియానన్మెన్ స్క్వేర్ ఘటన జరిగి 30 ఏళ్లైన సందర్భంగా దీనిపై స్పందిస్తున్న యూజర్ల అకౌంట్లపై ట్విటర్ నిషేధం విధించింది. అయితే ఈ అకౌంట్లను నిషేధించాలంటూ తమకు చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులూ రాలేదని, ఆరోగ్యకరమైన చర్చలకు వేదికగా ట్విటర్‌ను ఉంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే తాము కొన్ని అకౌంట్లపై నియంత్రణ విధించామని ట్విటర్ వివరణనిచ్చింది.
కానీ, ఇలా నిషేధించడాన్ని యూజర్లు వ్యతిరేకిస్తున్నారు. #TwitterMassacre హ్యాష్‌ట్యాగ్‌తో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందంటూ ట్విటర్‌పై రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో ఆరోపణలు చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
తియానన్మెన్ స్క్వేర్: చైనా కమ్యూనిస్టు పాలకులు ఎదుర్కొన్న అతి పెద్ద నిరసన ఇదే.
జూన్ 3 వస్తోందంటే ఇంటర్నెట్పై సెన్సార్షిప్
బీబీసీ చైనా ప్రతినిధి జాన్ సుడ్వర్త్ విశ్లేషణ
చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఘటనను స్మరించుకోవడానికి అధికారికంగా ఎలాంటి చర్యలూ ఉండవు.
జూన్ 4వ తేదీ సమీపిస్తోందంటే ఉన్నట్లుండి చైనా ఇంటర్నెట్ మాధ్యమాల్లో అప్రకటిత సెన్సార్షిప్ ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ అల్గారిథమ్‌ల సాయంతో వేలాది మంది పోస్టులను పరిశీలిస్తూ, నియంత్రణలు జరుగుతుంటాయి.
పరిధిని మించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసేవారికి జైలు శిక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే కొందరికి మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు.
ఆరోజు ఏం జరిగింది?
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తియానన్మెన్ స్క్వేర్ వద్ద పది లక్షల మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. 1989 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన చైనా దేశ చరిత్రలో అతి పెద్దది. ఇది ఆరువారాల పాటు కొనసాగింది.
క్రమంగా ఇవి ఇతర నగరాలు, యూనవర్సిటీలకు వ్యాపించాయి.
మరింత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని, నియంతృత్వ పోకడలు అంతమవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మరి కొందరు, ద్రవ్యోల్బణం, జీతాలు, ఇళ్లు లేకపోవడంపై కూడా నిరసనలు వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, Reuters
నిరసనలపై ఎలా స్పందించాలనే దానిపై కమ్యూనిస్టు పార్టీలోనే విభేదాలు వచ్చాయి.
జూన్ 3వ తేదీ రాత్రి ఉన్నట్లుండి తియానన్మెన్ స్క్వేర్‌లో ట్యాంకులతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో అమాయకులైన ప్రజలెందరో చనిపోయారు.
కానీ కాల్పుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రభుత్వం ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఎంతమంది నిరసనకారులు చనిపోయారనే దానిపై ఇప్పటికీ చైనా ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందని ఓ అంచనా.
ఇవి కూడా చదవండి.
- 40 ఏళ్లలో చైనా నంబర్ వన్ ఎలా అయింది?
- ఈ అరుదైన ఖనిజాల ఎగుమతి ఆపేస్తే అమెరికా పని అంతే..
- చైనా నిర్ణయంతో పేపర్ కష్టాలు తీరినట్లేనా
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల్ని బయటపెట్టిన 'పాఠశాల బాలిక'
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి.. హోంమంత్రిగా అమిత్ షా
- భారత్‌లో హిజ్రాలను అంతం చేయాలని బ్రిటన్ ఎందుకు, ఎలా ప్రయత్నించింది
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)