అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ప్రవీణ్ కాసం
- బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, Getty Images
బ్యాన్ చేసిన అల్యూమినియం బ్యాట్‌తో ఆస్ట్రేలియా క్రికెటర్ డెన్నిస్ లిల్లీ (1979 డిసెంబర్లో తీసిన చిత్రం)
దాదాపు 40 ఏళ్ల కిందట 1979 డిసెంబర్ 15న పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్‌ల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది.
ఆస్ట్రేలియా స్కోర్ 219/8 ఉన్నప్పుడు క్రీజ్‌లోని డెన్నిస్ లిల్లీ... ఇయాన్ బోథమ్ వేసిన బాల్‌ను ఎక్స్ట్రా కవర్‌వైపు తరలించాడు. మూడు పరుగులతో పాటు అతని బ్యాట్ నుంచి పెద్ద శబ్దం కూడా వచ్చింది.
అయితే, తర్వాత కాలంలో ఆ బ్యాట్ క్రికెట్ చరిత్రలోనే వివాదాస్పదంగా మారింది. రూల్స్ బుక్‌లో కొత్త నిబంధనలు తీసుకొచ్చేలా చేసింది.
ఇంతకీ ఆ బ్యాట్‌కున్న ప్రత్యేక ఏమిటి? ఎందుకు వివాదం అయింది?
డెన్నిస్ లిల్లీ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసింది అందరూ ఆడే చెక్క బ్యాటుతో కాదు. అల్యూమినియంతో చేసిన ప్రత్యేక బ్యాటుతో... అందుకే ఆ శబ్దం వచ్చింది.
ఈ మ్యాచ్ జరగడానికి 12 రోజుల ముందు వెస్టిండీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా లిల్లీ ఇదే బ్యాటు వాడాడు.
ఫొటో సోర్స్, Getty Images
లిల్లీ వాడిన అల్యూమినియం బ్యాట్ ఇదే
అంపైర్ల అభ్యంతరం
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లిల్లీ బ్యాట్‌పై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ బ్రేర్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
అల్యూమినియం బ్యాట్ వల్ల బంతి ఆకృతి దెబ్బతింటుందని అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆ బ్యాటుతో ఆడొద్దని అంపైర్లు మ్యాక్స్ ఓ కన్నెల్, డాన్ వెసెర్లు లిల్లీకి సూచించారు.
అయితే, రూల్స్ బుక్‌లో అల్యూమినియం బ్యాటుతో ఆడకూడదని ఎక్కడా లేదని.. చెక్క బ్యాటుతో ఆడాలనే నిబంధన కూడా లేదని అంపైర్లతో లిల్లీ వాదనకు దిగాడు. తన కోపాన్ని అణచుకోలేక అల్యూమినియం బ్యాటును గ్రౌండ్‌లోనే విసిరిగొట్టాడు.
చివరకు ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ గ్రౌండ్లోకి వచ్చి చెక్క బ్యాట్ వాడాలని నచ్చజెప్పడంతో లిల్లీ వెనక్కి తగ్గాడు. కొయ్య బ్యాట్‌తో మరో మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఈ బ్యాట్ ఎక్కడిది
బేస్‌బాల్ బ్యాట్ కూడా మొదట్లో కొయ్యతోనే తయారు చేసేవారు. అయితే, తర్వాత అల్యూమినియంను ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. దీని నుంచి స్ఫూర్తి పొందిన గ్రాహం మోన్హగన్ అనే క్లబ్ క్రికెటర్.. క్రికెట్ బ్యాట్‌ను కూడా అల్యూమినియంతో రూపొందించాడు.
క్లబ్ క్రికెట్లో గ్రాహం మోన్హగన్, డెన్నిస్ లిల్లీ స్నేహితులు. అంతేకాదు వ్యాపార భాగస్వాములు కూడా. అందుకే మోన్హగన్ తయారు చేసిన అల్యూమినయం బ్యాటుతో లిల్లీనే తొలిసారి ఆడాడు. కానీ, అంపైర్లు ఆ బ్యాట్‌పై నిషేధం విధించారు.
ఫొటో సోర్స్, Getty Images
1981లో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇయాన్ బోథమ్‌ను లిల్లీ అవుట్ చేశాడు
బ్యాట్‌పై మారిన నిబంధనలు
అల్యూమినియం బ్యాట్ వివాదం తర్వాత ఆస్ట్రేలియాలో ఈ బ్యాట్ల అమ్మకాలు వేగంగా పుంజుకున్నాయి.
కానీ, ఈ వివాదం తర్వాత కొన్ని రోజులకే బ్యాట్‌కు సంబంధించిన పలు నిబంధనలను క్రికెట్ రూల్ బుక్‌లో చేర్చారు. కేవలం చెక్క బ్యాటును మాత్రమే ఉపయోగించాలని నిబంధనలు తీసుకొచ్చారు.
ఈ వివాదానికంటే ముందు ఏ బ్యాట్ ఉపయోగించాలనేదానిపై రూల్స్ బుక్‌లో ఎలాంటి నిబంధనలు ఉండేవికావు.
కొత్తగా ఈ నిబంధనలు విధించాక అల్యూమినియం బ్యాటు ఊసే లేకుండా పోయింది.
కానీ, క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని సంఘటనగా నిలిచింది.
ఫొటో సోర్స్, Getty Images
తన విగ్రహంతో డెన్నిస్ లిల్లీ
ఇంగ్లాండ్ వైట్ వాష్
అల్యూమినియం బ్యాట్ వివాదంతో ఇబ్బందిపడ్డ లిల్లీ ఆ మ్యాచ్‌లో బాల్‌తో అద్భుతంగా రాణించాడు. 4 వికెట్లు తీసుకొని ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ సిరిస్‌లో ఆస్ట్రేలియా 3-0తో గెలిచింది. ఇంగ్లండ్‌ను వైట్ వాష్ చేసింది. అయితే, అల్యూమినియం బ్యాటు వివాదంగానే ఈ సిరిస్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.
'అది మార్కెటింగ్ గిమ్మిక్'
తర్వాత కాలంలో ఈ వివాదంపై లిల్లీ తన ఆటోబయోగ్రఫీ 'మెనస్'లో ప్రస్తావించాడు. 'మా బ్యాట్లను మార్కెట్ చేసుకోడానికి నేను చేసిన గిమ్మిక్ అది' అని తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్ కూడా తన పుస్తకం ''బోథమ్స్ బుక్ ఆఫ్ ది యాషెస్- ఏ లైఫ్ టైం లవ్ అఫైర్ విత్ క్రికెట్స్ గ్రేటెస్ట్ రివలరీ''లో అల్యూమినియం బ్యాట్ వివాదం గురించి ప్రస్తావించాడు.
''గొప్ప బౌలర్లలో లిల్లీ ఒకడు. కానీ, బ్యాట్స్‌మెన్‌గా అతనిలో స్థిరత్వం లేదు. అల్యూమినియం బ్యాట్స్‌తో అతను అదనపు ప్రయోజనం పొందాలనుకున్నాడు'' అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
- ఇచట అమ్మానాన్నలు, భార్యాభర్తలు అద్దెకు ఇవ్వబడును
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)