ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: కొత్త ట్రెండ్.. ఉపవాసాలు చేసి బరువు తగ్గుతున్నారు

  • 7 జూన్ 2019
ప్లేట్‌లో గడియారం Image copyright Getty Images

'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్'(ఐ.ఎఫ్) ద్వారా బరువు తగ్గొచ్చా? ఈ విధమైన డైట్ రోజురోజుకూ పాపులర్ అవుతోంది. ఇంతకూ ఈ డైట్ ఏంచెబుతోంది? ఇలా పస్తు ఉండటం మంచిదేనా?

ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ప్రధానంగా మూడు పద్దతులు ఉంటాయి. ఈ డైట్‌లో మీరు ఏం తింటున్నారు అన్నదానికన్నా, ఏ సమయంలో తింటున్నారు అన్నది ముఖ్యం.

ఈమధ్య ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ.. తాను రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పి, వార్తల్లో నిలిచారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది చాలా తీవ్రమైన డైట్ అని సోషల్ మీడియాలో విమర్శకులు స్పందించారు. కానీ జాక్ బహుశా ఈ లేటెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుండొచ్చు.

ఐఎఫ్ అన్నది, గతేడాదిలో చాలా పాపులర్ డైట్ అని 'ఇంటర్నేషనల్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఫౌండేషన్' సర్వే చెబుతోంది.

ఈ డైట్‌ రకరకాలు. కానీ మీరు ఏం తింటున్నారు అన్న విషయం కంటే, ఏ సమయంలో తింటున్నారు అన్నది ముఖ్యమని ఈ డైట్ చెబుతోంది. మరీ ముఖ్యంగా భోజనానికి, భోజనానికి మధ్య నిర్దిష్టమైన విరామం ఇచ్చి, ఆహారాన్ని మితంగా తీసుకోవాలని ఐఎఫ్ చెబుతోంది.

ఈ డైట్‌లో ప్రధానంగా మూడు పద్దతులు ఉన్నాయి. అందులో ఒకటి 5:2 పద్దతి.

వారంలో 2 రోజులు, మీరు సాధారణంగా తీసుకునే కేలరీల్లో కేవలం 25% మాత్రమే తీసుకోవాలి. తక్కిన 5 రోజుల్లో ఎలాంటి నిబంధన ఉండదు. అయితే, తక్కువ కేలరీలు తీసుకునే ఆ 2 రోజులు కూడా వరుసగా ఉండరాదు. దీన్ని 5:2 విధానం అంటారు.

రెండోది 16:8. ఈ పద్దతిలో ఒక రోజులో(24 గంటలు) మీరు తీసుకోవాలనుకున్న ఆహారం 8 గంటల వ్యవధిలో ముగించి, తక్కిన 16 గంటలు పస్తు ఉండాలి.

ఇక మూడో పద్దతిలో వారానికి లేదా నెలకు ఒకరోజు అంటే 24 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

Image copyright Getty Images

బరువు తగ్గడానిక ఈ విధానం చాలా మంచిది అని ఈ డైట్‌ను అభిమానించేవారు చెబుతున్నారు. 'ఆన్యువల్ రివ్యూ ఆఫ్ న్యూట్రిషన్' సంచిక-2017లో ఈ విధానంపై చేసిన అధ్యయన సారాంశాన్ని ప్రచురించారు. అందులో, ఐఎఫ్ డైట్‌ను అనుసరించిన 16 మందిలో 11 మంది బరువు తగ్గారని పేర్కొన్నారు.

''బరువు తగ్గడానికి కారణం చాలా సింపుల్.. మీరు క్యాలరీస్‌ను తీసుకోవడం తగ్గించడమే'' అని బ్రిటీష్ డైటీషియన్ అసోసియేషన్ ప్రతినిధి డా.లీనియా పటేల్ చెబుతున్నారు.

ఇందులోని మూడో పద్దతిలో భాగంగా వారానికి లేదా నెలకు రెండు రోజులపాటు పూర్తిగా పస్తు ఉండటం మంచిది కాదని, అలా పస్తు ఉండటం వల్ల తీవ్రమైన ఆకలి కలుగుతుందని ఆన్యువల్ రివ్యూ ఆఫ్ న్యూట్రిషన్ సంచికలో అచ్చయిన అధ్యయనం చెబుతోంది. డా.పటేల్ చెబుతున్న మరిన్ని విషయాలను పరిశీలిస్తే..

'పస్తు ఉండటం కొత్త విషయమేమీ కాదు'

మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కారణాలతో ఉపవాసం లేదా పస్తు ఉండటం ముందునుంచీ వస్తోంది. మన పూర్వీకులను గమనిస్తే, వారికి నిర్దిష్టమైన ఉపవాస సమయాలు ఉండేవి.

మనిషి వేటాడుతున్న కాలంలో, వేట దొరికినప్పుడే వారు భుజించేవారు. తక్కిన సమయంలో పస్తు ఉండేవారు. అలా వారి జీవన విధానంలో పస్తు ఉండటం సాధారణం. .

ఇప్పుడు మన చుట్టూ ఆహారం పుష్కలంగా ఉండటం, అవసరమైన శారీరక శ్రమ లేకపోవడం కారణాలతో స్థూలకాయం బారిన పడుతున్నాం.

Image copyright Getty Images

'తినడంలోనూ క్రమశిక్షణ'

ఆహారం తీసుకోవడంలో ఒక క్రమశిక్షణ అవసరం. ఇతర డైటింగ్ విధానాల మాదిరి, కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్స్‌ తినకూడదని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెప్పదు. ఈ డైట్‌లో మీరు చేయాల్సింది కేవలం.. సమయాన్ని పాటించడమే.

షేనీ డెన్నిస్ అనే 26ఏళ్ల జర్నలిస్టు ఈ డైట్‌ను ఫాలో అయ్యారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ..

''సులువైన, త్వరగా పాటించే డైట్ కోసం, నేను ఈ డైట్ ఫాలో అయ్యాను. మధ్యాహ్నం 12 గంటల నుంచి, రాత్రి 8 గంటల మధ్య మాత్రమే ఆహారం తీసుకోవాలని నాకు సూచించారు. ఇంకేముంది.. తక్కిన సమయంలో నాకు నచ్చిన ఫుడ్ తినేయొచ్చుకదా అనుకున్నా. కానీ నా ప్రయత్నం ఫలించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని నాకు అర్థమైంది'' అన్నారు.

'అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి'

''నాదగ్గరకు వచ్చే చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను సక్రమంగా పాటించడం లేదు. పస్తు ఉంటున్న రోజుల్లో డైట్ ప్రకారం రోజుకు 500 కేలరీలకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ తక్కిన రోజుల్లో విందుభోజనం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గరు. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి కదా..'' అని పటేల్ చెబుతున్నారు.

ఈ డైట్‌ను అనుకరించడం అంటే ఒకరోజు విందుభోజనం, మరొకరోజు ఆకలితో అలమటించడం కాదు. అలా చేస్తే ఫలితం ఉండదు.

''మంచి ఫలితాల కోసం, ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకోవడం, అదికూడా, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం'' అని పటేల్ చెబుతున్నారు.

ఈ డైట్ తీసుకునేవారు చేప నూనె, గింజలు, విత్తనాలు, ధాన్యాలు, కొవ్వుశాతం తక్కువగా ఉన్న ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా లభించే పళ్లు, కూరగాయలు, విటమిన్స్, మినరల్స్ తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Image copyright Imhan Robertson
చిత్రం శీర్షిక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా తనకు అలవడిన క్రమశిక్షణతో ఇమాన్ ఆనందంగా ఉన్నారు

'డైట్‌ను ఎంతవరకు కొనసాగించగలరు?'

సాధారణంగా కేలొరీస్‌ను నియంత్రించే అన్ని రకాల డైటింగ్ విధానాలు, బరువు తగ్గడంలో దాదాపు ఒకేరకంగా ప్రభావం చూపుతాయి. అయితే, మీరు పాటించే డైట్‌ను మధ్యలో ఆపకుండా ఎక్కువకాలం పాటించాలి.

తక్కిన విధానాల్లో నోరు కట్టేసుకుని డైటింగ్ చేయాలి. అపుడు జిహ్వచాపల్యాన్ని నియంత్రించడం ప్రధాన సమస్య అవుతుంది. కానీ ఐంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానంలో ఆ సమస్య పెద్దగా ఉండదు.

''నేను గతంలో అవలంబించిన డైటింగ్ విధానాల్లో కార్బొహైడ్రేట్స్ అస్సలు తీసుకోరాదు. అప్పుడు ఏది చూసినా, నాకిష్టమైన పాస్తా, రైస్ గుర్తొచ్చేవి. కానీ వాటిపట్ల ఇప్పుడు అంత కోరిక లేదు. ఎందుకంటే, వాటిని తినకుండా ఇప్పుడు నన్ను ఏదీ నియంత్రించడం లేదు'' అని షేనీ అంటున్నారు.

షేనీ గత 4 నెలలుగా 16:8 డైట్‌ను అనుసరిస్తున్నారు. ఇది 5:2 డైట్ కంటే చాలా మెరుగు అని ఆమె చెబుతున్నారు.

26 ఏళ్ల ఇమాన్ రాబర్ట్‌సన్ అనే యువతి గత 4 ఏళ్లుగా ఈ డైట్ ఫాలో అవుతున్నారు.

''మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎప్పుడూ తిండి గోలే! కానీ అలవాటయ్యాక బాగుంది. ఎప్పుడైనా మరీ ఎక్కువగా మనసు లాగితే, ఆ రోజుకి మాత్రమే నా డైట్‌ను బ్రేక్ చేస్తాను. కానీ మరుసటి రోజు నుంచి మళ్లీ డైట్‌ను కొనసాగిస్తాను. నేను 16:8 పద్దతిని ఫాలో అవుతున్నా. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల మధ్య మాత్రమే నేను ఆహారం తీసుకుంటాను. ఎవరైనా నన్ను భోజనానికి ఆహ్వానించినపుడు రాత్రి 8 గంటలు దాటిందనుకోండి.. అప్పడు నేనేదీ తినను. నీళ్లు మాత్రం తాగుతూ గడిపేస్తాను. అయితే, ఒంటరిగా జీవిస్తున్నపుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సులువేకానీ, రిలేషన్‌లో ఉన్నపుడు మాత్రం కాస్త కష్టం'' అని ఇమాన్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇలాంటి ఆహారం ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది

'అందరికీ మంచిది కాదు'

ఫిజిషియన్ పర్యవేక్షణ లేకుండా ఎవరూ ఈ విధానాన్ని అనుసరించరాదు. కడుపులో అల్సర్ ఉన్నవారు అసలు ఉపవాసమే చేయరాదు. అనారోగ్య సమస్యలున్న వారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు. డయాబెటిస్, క్రమరహిత భోజనపు అలవాట్లు ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, గర్భిణులు, పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పాటించకూడదు.

గత పదేళ్లకు కాస్త అటఇటుగా.. ఈ డైట్‌కు ఆదరణ పెరిగింది. కానీ ఇతర డైటింగ్ విధానాలకంటే ఇది మెరుగైనదా లేక వ్యర్థమైనదా అని ఇంకా రుజువు కాలేదని పటేల్ అన్నారు.

‘‘ఈ విధానంలో ప్రయోగాల సంఖ్య పెద్దగా లేదు. కానీ ఈ డైటింగ్‌ను సక్రమంగా అనుసరిస్తున్నవారిలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)