భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్‌లోనే

  • 5 జూన్ 2019
అనార్కలి జైలు

పాకిస్తాన్‌లోని లాహార్ సమీపంలోని అనార్కలిలోని పోలీస్ స్టేషన్ ఇది.

మొదట్లో ఇది పోలీస్ స్టేషన్ కాదు. బ్రిటిష్ పాలన సమయంలో దీన్ని సైన్యం తమ అవసరాలకు వాడుకునేది. కొద్దికాలం తరువాత దీన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చారు. అయితే దీనికి అధికారిక గుర్తింపు వచ్చింది మాత్రం 1861లోనే.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్‌లోనే

తాహిర్ మహమూద్ అనార్కలి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

"పాత రికార్డులను తిరగేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ సమయంలోనే నాకు ఓ ఎఫ్ఐఆర్ పత్రాలు కనిపించాయి. అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు" అని తాహిర్ అన్నారు.

ఆ పత్రాల్లోని చేతిరాత 10, 15 ఏళ్ల కింద రాసినట్లుగా ఉంది. కానీ నిజానికి అది 158 ఏళ్ల క్రితం రాసినది. ఆ సిరా ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

"ఆ భాష ఏంటా అని ఆశ్చర్యంగా పరిశీలించాను. చూడటానికి ఉర్దూలా ఉంది. కానీ లిపి మాత్రం పర్షియన్ భాష మాదిరిగా కనిపిస్తోంది. ఆ రెండింటి కలయికా కూడా కావచ్చు. కానీ ఎక్కువ పదాలు పర్షియన్‌లో ఉన్నాయి. అలాగే హఠాత్తుగా తనిఖీలకు వచ్చే ఉన్నతాధికారుల కోసం కేటాయించిన ఒక రిజిష్టర్ కూడా లభించింది. అది 1929 నాటిది" అని తాహిర్ తెలిపారు.

ఆ కాలంలో ఎస్పీలుగా పనిచేసిన బ్రిటిష్ ఉద్యోగులు తమ తనిఖీల సందర్భంగా ఈ పోలీసు స్టేషన్ గురించి రాసిన కామెంట్లు ఆ రిజిస్టర్‌లో ఉన్నాయి. అలాగే పోలీసు స్టేషన్ చరిత్ర, దాని పరిధులు, కేసులు వంటి సమాచారం కూడా అందులో ఉంది.

చిత్రం శీర్షిక తాహిర్ మహమూద్

"ఆ తరువాత మాకు 1936 నాటి 16వ నెంబరు రిజిష్టర్ దొరికింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం గురించి ప్రతిదీ దానిలో పేర్కొన్నారు. చెక్క తలుపులు, తుపాకులు, స్టేషన్ అధికారి, ఇతర ఉద్యోగుల సమాచారమంతా అందులో ఉంది. అందువల్లే ఈ స్టేషన్‌ చారిత్రకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. 1860లో ఎలా కట్టారో ఇప్పటికీ అలాగే ఉన్న కట్టడం పాకిస్తాన్ మొత్తం మీద ఇదొక్కటేనన్నది నా అభిప్రాయం" అంటున్నారు తాహిర్.

భగత్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా ఇక్కడే నమోదు అయినందువల్ల ఈ స్టేషన్‌కు మరింత గుర్తింపు వచ్చింది.

భగత్ సింగ్ చేతిలో చనిపోయిన శాండర్స్ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇక్కడే రిజిస్టర్ చేశారు.

కానీ ఎఫ్ఐఆర్ కాపీకోసం లాహార్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ పిటిషన్ వేశారు.

అయితే ఎఫ్ఐఆర్‌లో అసలు ఆయన పేరే లేదని తెలిసినట్లు, 1928 డిసెంబర్ 17న నమోదు చేసినట్లుగా చెబుతున్న ఓ ఎఫ్ఐఆర్‌లో "గుర్తు తెలియని సాయుధ హంతకుడు" అని పేర్కొన్నట్లు గతంలో పీటీఐ పేర్కొంది.

ఇటీవలే ఈ కారాగారాన్ని పునరుద్ధరించారు.

పంజాబీ ముస్లిం కార్పెంటర్ ఘాజీ ఇల్‌ముద్దిన్ షాహిద్ మీద ఎఫ్‌ఐఆర్ కూడా ఇక్కడే నమోదైంది. ఇక ఈ మధ్యకాలంలో అంటే 2011లో లాహోర్‌లో ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన అమెరికా సీఐఏ ఏజెంట్ రేమండ్ డేవిస్ విచారణ కూడా ఇదే పోలీసు స్టేషన్‌లో జరిగింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం