‘100 మందిని చంపేసి నైలు నదిలో పడేశారు’

  • 5 జూన్ 2019
సూడాన్‌లో నరమేధం Image copyright copyrightREUTERS
చిత్రం శీర్షిక సైనిక దిగ్బంధంతో ఖర్తూమ్ నగర వీధులు దాదాపు ఖాళీ అయ్యాయి

సూడాన్‌లో ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఉద్యమకారులపై భద్రతా దళాలు కాల్పులు జరపటంతో మృతుల సంఖ్య 100 మందికి పెరిగిందని ప్రతిపక్షం చెప్తోంది.

రాజధాని నగరం ఖర్తూమ్‌లో నైలు నది నుంచి 40 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపింది.

రాజధానిలో సోమవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల శిబిరంపై తాత్కాలిక సైనిక మండలి (టీఎంసీ) బలగాలు కాల్పులు జరపటంతో హింస చెలరేగింది.

‘‘మా అమరవీరుల్లో 40 మంది భౌతికకాయాలను నిన్న నైలు నది నుంచి వెలికి తీశాం’’ అని సెంట్రల్ కమిటీ ఆఫ్ సూడానీస్ డాక్టర్స్ బుధవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.

సైన్యం దాడిలో 100 మంది చనిపోయారని.. ఆస్పత్రుల్లో మృతదేహాలను తాము తనిఖీ చేసి నిర్ధారించుకున్నామని ఈ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ప్రజాస్వామ్యం కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై సైనిక బలగాలు సోమవారం దాడులు చేశాయి

‘‘చంపేసి నైలు నదిలో పడేశారు’’

మృతుల్లో కొందరిని సైనిక బలగాలు తుపాకీతో కాల్పులు జరిపి చంపాయని, ఇంకొందరిని వేట కత్తులతో నరికి చంపారని.. వారి మృతదేహాలను నైలు నదిలోకి విసిరివేశారని చానల్ 4 సూడానీస్ జర్నలిస్ట్ యోస్రా ఎల్బాగిర్ మాజీ భద్రతా అధికారి ఒకరిని ఉటంకిస్తూ పేర్కొన్నారు.

‘‘అది నరమేధం’’ అని సదరు అధికారి అభివర్ణించారు.

పారామిలటరీ బృందాలు రాజధాని నగరం వీధుల్లో తిరుగుతూ పౌరులపై దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. ఇంతకుముందు జన్‌జావీద్ మిలీషియా పేరుతో తీవ్ర అపఖ్యాతి మూటగట్టుకుని ప్రస్తుతం మిలటరీలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) రూపంలో ఉన్న బలగాలే ఈ హింసకు కారణమని ఖర్తూమ్ పౌరులు ఆరోపిస్తున్నారు.

నిరాయుధులైన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరపటాన్ని పలు దేశాలు ఖండించాయి. అయితే.. సూడాన్‌లో హింసను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేసే ప్రయత్నాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక అధ్యక్షుడు బషీర్‌ను ఏప్రిల్ నెలలో సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడ్ని చేశారు

సూడాన్‌లో ఏం జరుగుతోంది?

దాదాపు మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా కొనసాగిన ఒమర్ అల్-బషీర్‌ పాలనకు చరమగీతం పలికి ప్రజాస్వామ్యం స్థాపించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు ఏప్రిల్ 6వ తేదీ నుంచీ ఆందోళనను ఉధృతం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో నాటి బషీర్ ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అత్యవసర పొదుపు చర్యలు విధించింది. ఆహార, ఇంధన సబ్సడీలను భారీగా తగ్గించటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికి ఆందోళనలు మొదలయ్యాయి.

ఏప్రిల్ 6వ తేదీ నాటికి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఖర్తూమ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయం ముందు కూడలిని ఆక్రమించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో సైన్యం తిరుగుబాటు చేసి బషీర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.

అనంతరం పాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలన్న అంశం గురించి ఆందోళనకారుల ప్రతినిధులు సైనిక నాయకత్వంతో కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే కనీసం మూడు సంవత్సరాలు ఆగాలని ఇరుపక్షాల మధ్య తొలుత ఒప్పందం కుదిరింది.

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక సైనిక బలగాలను అడ్డుకునేందుకు ఆందళనకారులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి టైర్లు తగులబెట్టారు

ఆందోళనకారులపై దాడి...

రాజకీయ వ్యవస్థ మీద గత బషీర్ ప్రభుత్వానికి గల పట్టును సడలించేందుకు ఇంత కాలం అవసరమనేది ఉద్యమకారుల వాదన. కానీ ఈ చర్చలు అకస్మాత్తుగా స్తంభించాయి. సోమవారం నాడు ఆందోళనకారుల శిబిరం మీద సైన్యం దాడి చేసి కాల్పులు జరిపింది.

అయితే.. చర్చలు విఫలమయ్యాయని తాత్కాలిక సైనిక మండలి నాయకుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్-బుర్హాన్ ప్రకటించారు. ప్రతిపక్షంతో ఇంతకుముందు చేసుకున్న అన్ని ఒప్పందాలనూ సైన్యం రద్దు చేసింది. తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరుపుతామని పేర్కొంది.

కానీ మూడేళ్ల వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో హింస కొనసాగింది.

‘‘జరిగిన సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం’’ అని మాత్రమే జనరల్ బుర్హాన్ వ్యాఖ్యానించారు. నిరసనకారుల మరణం మీద దర్యాప్తు ప్రారంభించామని టీఎంసీ అధికార ప్రతినిధి ఒకరు ఆ తర్వాత ప్రకటించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ప్రజాస్వామ్య ఎన్నికలను మూడేళ్ల వరకూ వాయిదావేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు

సైనిక నాయకత్వ అధికార కాంక్షే కారణమా?

దేశ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని సైనిక నాయకత్వం భావించటం వల్లే సూడాన్‌లో ప్రస్తుత హింస చెలరేగిందని బీబీసీ ఆఫ్రికా ఎడిటర్ ఫెర్గల్ కీన్ అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షమైన ‘ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్’తో చేసుకున్న ఒప్పందాలను సైనిక నాయకత్వం రద్దు చేసిందని.. త్వరగా ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు మారటం వేగవంతమవుతుందన్నది కారణంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ సమాజంలో ఉన్న విభజనల వల్ల.. సూడాన్ సైనిక పాలకుల మీద అంతర్జాతీయ ఒత్తిడి ఉంటుందన్నది భ్రమ మాత్రమేనని.. ఇది సైనిక పాలకులకు అనుకూలంగా మారిందని విశ్లేషించారు.

సైనిక బలగాలు భారీగా వీధుల్లో మోహరించటంతో ఆందోళనకారులు ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రతిపక్ష ఫోర్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ మళ్లీ వీధుల్లో తీవ్రస్థాయి ఉద్యమం చేపట్టగలదా అనేది వేచి చూడాల్సిందేనని ఫెర్గల్ కీన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)