అమెరికా - ఇండియా వాణిజ్య వివాదం: ట్రంప్ సుంకాలతో భారతదేశంలో ఉద్యోగాలు పోవడం ఖాయమేనా

  • 7 జూన్ 2019
నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్ Image copyright Getty Images

ఇటలీలోని మిలాన్‌లోనో.. అమెరికాలోని మన్‌హటన్‌లోనో.. అమ్మే చాలా ఖరీదైన లెదర్ హ్యాండ్‌బ్యాగ్‌లకు.. భారతదేశంలో ఉద్యోగాలకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ బ్యాగ్‌లు చాలా వరకూ ఇండియాలో తయారవుతుంటాయి.

దిల్లీ శివార్లలోని ఫరీదాబాద్‌లో సంజయ్ లీఖా మూడంతస్తుల ఫ్యాక్టరీ. దీని వయసు 33 సంవత్సరాలు. ఇలాంటి ఫ్యాక్టరీలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ బుధవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ బాధితుల జాబితాలో చేరాయి.

అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను సమూలంగా మార్చేస్తున్న ట్రంప్ సర్కారు.. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై సుంకాలను పెంచేసింది.

ఇమిటేషన్ నగలు, భవన నిర్మాణ మెటీరియల్, సోలార్ సెల్స్, శుద్ధిచేసిన ఆహారం వంటి అనేక ఉత్పత్తులపై సుంకాలు 10 శాతం పెరిగాయి.

అమెరికా ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారతదేశాన్ని తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి రావటమే దీనికి కారణం.

చిత్రం శీర్షిక దిల్లీ శివార్లలోని లీఖా ఫ్యాక్టరీలో తయారయ్యే హ్యాండ్ బ్యాగ్‌లు అమెరికాకు ఎగుమతి అవుతాయి

వాణిజ్యానికి సంబంధించి ప్రాధాన్య దేశాల జాబితా (జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ - జీఎస్‌పీ)ని 1976లో అమెరికా ప్రారంభించింది. ఈ ఒప్పందంలో 120 దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటానికి తోడ్పాటునివ్వటంతో పాటు.. ఆయా దేశాల నుంచి అమెరికా వినియోగదారుల కోసం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధరలు తగ్గించటం ఈ జాబితా లక్ష్యం.

ఈ జీఎస్‌పీ వల్ల ఇప్పటివరకూ అత్యధికంగా లాభపడింది భారతదేశమే. భారత ఎగుమతుల్లో 630 కోట్ల విలువైన వస్తువులపై సుంకాలు లేకపోవటమో, రాయితీలు ఇవ్వటమో జరిగేది.

దేశంలోని అనేక ఫ్యాక్టరీలలాగానే ఫరీదాబాద్‌లోని సంజయ్ లీఖా ఫ్యాక్టరీకి చెందిన ఆల్పైన్ అపారెల్స్ కూడా ఈ జీఎస్‌పీ మినహాయింపుల ప్రయోజనుల లభించాయి. ఈ ఫ్యాక్టరీ నెలకు 40,000 హ్యాండ్ ‌బ్యాగ్‌లు ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 1,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు పెరగటంతో.. ఆ సుంకాలను ఫ్యాక్టరీయే భరించాలని.. ఉత్పత్తుల ధరలు తగ్గించాలని.. వీటిని కొనుగోలు చేసే అమెరికా సంస్థలు కోరుతున్నాయి.

అలా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి వస్తే.. ఫ్యాక్టరీ ఉద్యోగుల్లో కొందరికి ఉద్వాసన చెప్పాల్సి వస్తుందని సంజయ్ లీఖా అంటున్నారు.

చిత్రం శీర్షిక అమెరికా సుంకాలతో లాభాలు, వ్యాపారం తగ్గుతుందని భారత తయారీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి

అమెరికా సుంకాలను ఎందుకు పెంచుతోంది?

జీఎస్‌పీ ప్రయోజనాలు పొందుతున్న ఆల్పైన్ వంటి సంస్థలకు దెబ్బ తగిలితే.. భారత వాణిజ్యరంగం బెంబేలెత్తుతుందని.. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పునరాలోచనలో పడుతుందని అమెరికా ఆశిస్తోంది.

జీఎస్‌పీ నుంచి భారతదేశానికి ఉద్వాసన పలకటం ఒకరకమైన ప్రతీకార శిక్ష అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత వారం ఒక ప్రకటనలో వివరించారు. భారతదేశం తన మార్కెట్లను అమెరికా కంపెనీల కోసం ''న్యాయంగా, సహేతుకంగా'' తెరవటం లేదన్నది ఆయన ఆరోపణ.

అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, కొన్ని పాల ఉత్పత్తులను భారతదేశంలో వినియోగదారులకు విక్రయించటానికి అనుమతుల విషయమై కొనసాగుతున్న వివాదం దీనికి మూలం.

భారతదేశంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం కోసం ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల ధరల మీద విధించిన ఖచ్చితమైన నియంత్రణల నుంచి అమెరికా సంస్థలకు మినహాయింపు ఇవ్వాలని ఆ దేశం కోరుతోంది.

అలాగే అమెరికాలో ఉత్పత్తి చేసిన చీజ్‌లను భారతదేశంలో విక్రయించటానికి కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. కానీ.. పక్షి మాంసాలనుంచి తీసిన ద్రావకాలు కలిపిన ఆహారం తినే జంతువుల నుంచి పాలు సేకరించి ఆ చీజ్‌లను ఉత్పత్తి చేస్తారు. అది దేశంలో చాలా మంది మత, సాంస్కృతిక మనోభావాలను దెబ్బతీస్తుందని భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది.

కానీ.. ఈ అనుమతులు సాధించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచటం అమెరికాకు తిప్పికొడుతుందని అమెరికాకు చెందిన 'కొయిలిషన్ ఫర్ జీఎస్‌పీ' అనే బృందం చెప్తోంది. దీనివల్ల అమెరికా వ్యాపార సంస్థలు ప్రతి ఏటా 30 కోట్ల డాలర్లు అదనంగా సుంకాలు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.

వాల్‌మార్ట్ వంటి రిటైల్ దిగ్గజ సంస్థలు.. జీఎస్‌పీలో భారతదేశానికి సభ్యత్వం ఉండటం వల్ల అమెరికా వినియోగదారులకు లాభమే జరిగిందని.. అధిక సుంకాల రూపంలో వినియోగదారులు కోట్లాది డాలర్లు చెల్లించే పరిస్థితి లేకపోయిందని చెప్తున్నాయి.

చిత్రం శీర్షిక దిగుమతులపై సుంకాల పెంపు వల్ల అమెరికా వినియోగదారులూ నష్టపోతారని అమెరికన్ వ్యాపార సంస్థలు హెచ్చరిస్తున్నాయి

అయితే.. ఈ సుంకాల పెంపు ప్రభావం భారత సరఫరాదారులపైనే అధికంగా ఉంటుందని లీఖా చెప్తున్నారు. పోటీ మార్కెట్‌లో భారత సంస్థలు రాత్రికి రాత్రి వెనుకబడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''జీఎస్‌పీ నుంచి కేవలం ఇండియా, టర్కీలను మాత్రమే తొలగిస్తున్నారు. ఫలితంగా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది'' అని వివరించారు.

''అమెరికా దిగుమతిదారులు తక్కువ సుంకాలు ఉండే ఉత్పత్తుల కోసం జీఎస్‌పీ ప్రయోజనాలు పొందుతున్న కంబోడియా, ఇండొనేసియా వంటి దేశాలకు మళ్లుతారు'' అని ఆయన పేర్కొన్నారు.

''ఈ పరిస్థితిలో నా వంటి భారత ఎగుమతిదారులు లాభాలను తగ్గించుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుంది. ఉత్పత్తులు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఉత్పత్తులు తగ్గి, లాభాలు తగ్గే పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తుంది'' అని చెప్పారు.

భారతదేశాన్ని జీఎస్‌పీ నుంచి మినహాయిస్తే.. తాము ''ఉత్పత్తులను చైనా నుంచి కొనుగోలు చేయటం మినహా మార్గం లేద''ని.. న్యూబాలన్స్, ఆదిదాస్ వంటి సంస్థలతో కూడిన అమెరికన్ అపారెల్ అండ్ ఫుట్‌వేర్ అసోసియేషన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా.

చైనా ఉత్పత్తులపై కూడా అదనపు సుంకాలు విధించటం వల్ల.. ''అమెరికా వినియోగదారులు తాము కొనుగోలు చేసే ప్రయాణ వస్తువుల కోసం చాలా ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది'' అని కూడా ఆ అసోసియేషన్ పేర్కొంది.

అయితే.. ఈ అంశం మీద భారత ప్రభుత్వ స్పందన ఇప్పటివరకూ మౌనంగానే ఉంది. ఇది ఆర్థిక దెబ్బకన్నా దౌత్యపరమైన దెబ్బగానే భారతదేశం పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది.

''విస్తృత స్థాయిలో చూస్తే అమెరికాకు మన ఎగుమతులు 5,120 కోట్ల డాలర్లుగా ఉన్నాయి'' అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.

జీఎస్‌పీ సభ్యదేశంగా ఉండటం వల్ల భారతదేశానికి మొత్తంగా కేవలం 26 కోట్ల డాలర్ల ప్రయోజనం మాత్రమే ఉందని ఆయన అంచనావేశారు.

జీఎస్‌పీ కింద వాణిజ్యం జరపటం వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనకరమే అయినప్పటికీ.. దీని నుంచి భారతదేశాన్ని తొలగించటం వల్ల చూపించే ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ.

ఏదేమైనా.. ఆర్థిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పిన ట్రంప్, మోదీలు.. వాణిజ్య రంగంలో మాత్రం దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురూ తమ దేశంలో ప్రయోజనాలను కాపాడుకోవటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు