పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?

  • 9 జూన్ 2019
పాక్ బడ్జెట్ Image copyright AFP

"చావనైనా చస్తా, కానీ రుణం మాత్రం తీసుకోను" పాకిస్తాన్ ఎన్నికల ప్రచార సమయంలో ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాట ఇది.

ప్రధాని అయిన తర్వాత, ఆత్మహత్య సంగతేమోగానీ, రుణాలు తీసుకోవడం తప్ప తమకు వేరే దారి లేదని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాగానే బోధపడినట్టుంది.

పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి వచ్చే మంగళవారం (జూన్ 11వ తేదీన) బడ్జెట్ ప్రవేశపెడుతోంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ అంత సులభంగా ఉండేలా లేదు. పాకిస్తాన్ ఆర్థిక లోటు అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు అదుపు చేయలేని స్థాయికి చేరిన అది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది.

పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంటామని చెప్పడం, దాని షరతులకు లోబడి 700 బిలియన్ రూపాయల కోత, కొత్త పన్నులు వేయడం లాంటిదేనని ఆర్థిక వేత్తలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

"ఐఎంఎఫ్ షరతుల వల్ల పాకిస్తాన్‌కు కొత్త సవాళ్లు ఎదురవబోతున్నాయి. అవి చరిత్రాత్మకం అవుతాయి" అని పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు నిక్కీ ఏషియన్ రివ్యూకు చెప్పారు.

Image copyright AFP

అవినీతి, ఆర్థిక స్తబ్దతతో పోరాటం

డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ 2017 నుంచి సుమారు 50 శాతం పడిపోయింది. పాకిస్తాన్ అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా డాలర్ల ఆధారంగానే సాగుతుంది.

కొంతమంది ఆర్థికవేత్తల అంచనా ప్రకారం బడ్జెట్ ముందు ద్రవ్యోల్బణం సుమారు 9 శాతం ఉండచ్చు. ఇటు విపక్ష నేతలు మాత్రం ఈ ఆర్థిక స్తబ్దతకు ఇమ్రాన్ ఖానే కారణం అని ఆరోపిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) 2018లో అధికారంలోకి వచ్చింది. పాకిస్తాన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పీటీఐ, నవాజ్ షరీఫ్‌ ప్రభుత్వం పడిపోయేలా చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో నవాజ్ షరీఫ్‌ ప్రధాన మంత్రి పదవి వీడాల్సి వచ్చింది. షరీఫ్‌పై పనామా పేపర్స్ అవినీతి ఆరోపణలున్నాయి.

"ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, అవినీతిని అడ్డుకోవడం ఒకేసారి వీలుకాదని" గత నెలలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు.

జర్దారీ ప్రకటనతో మిగతా విపక్షాలు, పారిశ్రామికవేత్తలు కూడా గొంతు కలిపారు. గత కొన్ని నెలలుగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అంటే నాబ్ ప్రయత్నాలతో కార్పొరేట్ అనిశ్చితి పెరిగిందని వీరంతా విమర్శిస్తున్నారు.

కానీ, ప్రభుత్వం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది.

"అవినీతిని అంతం చేయడం వల్ల కొత్త పెట్టుబడులు తీసుకురావడం సులభం అవుతుంది. దానివల్ల పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టచ్చు అని పెట్టుబడుదారుల్లో విశ్వాసం తీసుకురావచ్చు. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని అంతం చేయాల్సిన అవసరం ఏముంది" అని ఇమ్రాన్ ఖాన్ సన్నిహతులు ఇఫ్తికార్ దురానీ నిక్కీతో అన్నారు.

Image copyright EPA

ఐఎంఎఫ్ షరతులకు ఇమ్రాన్ ఒప్పుకుంటారా

ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ముందుకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బడ్జెట్‌లో అనుకుంటే మాత్రం అది ప్రజల ఆగ్రహాన్ని రుచిచూడాల్సి ఉంటుంది.

ఈ బడ్జెట్ వల్ల విద్యుత్, గ్యాస్ ధర పెరగవచ్చని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ధరలు పెరిగితే పాకిస్తాన్ ప్రజల జీవితం ముందు ముందు మరింత దుర్భరం అవుతుందంటున్నారు.

అలాంటప్పుడు ఈ ఆగ్రహం రోడ్లపై బహిరంగంగా కనిపించవచ్చు. తర్వాత ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ మాత్రం "సమస్యలను పెద్దవిచేసి చూపిస్తున్నారు" అంటున్నారు.

మేం ఐఎంఎఫ్ నుంచి గతంలో కూడా రుణాలు తీసుకున్నాం. దానివల్ల పాకిస్తాన్ చెల్లింపులు సంతులనంతో సరిగా ఉంటాయి. సంక్షోభ పరిస్థితి లేదు. పాకిస్తాన్ సంక్షేమం కోసం ఇది తప్పనిసరి అన్నారు.

ప్రభుత్వం ప్రధానంగా ఆలోచిస్తున్న దిద్దుబాటు చర్యల్లో పన్ను ఎగవేతలు నిరోధించడం కూడా ఉంది. పాకిస్తాన్‌లో కేవలం ఒక శాతం జనాభా మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. దేశంలో వీలైనంత ఎక్కువమందిని పన్నుల పరిధిలోకి తీసుకురావాలని గత కొన్నేళ్ల నుంచి ఐఎంఎఫ్, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పాకిస్తాన్‌ను కోరాయి. కానీ అది ఇప్పటివరకూ అలా చేయలేదు.

పాకిస్తాన్‌లో ఎంతోమంది బలమైన వ్యాపారవేత్తలు, పెద్ద రైతు కుటుంబాలు, ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టే వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు.

గతంలో రోజువారీ లావాదేవీలను నియంత్రించేందుకు సేల్స్ ట్యాక్స్ నిబంధనలను కఠినతరం చేయాలని కూడా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ పారిశ్రామిక సంఘాల వైపు నుంచి దానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఇమ్రాన్ ఖాన్ రెవెన్యూ లోటు అదుపు చేయడానికి క్రమబద్ధీకరించే దారిలో వెళ్తున్నారు. అలా చేస్తే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో యూనియన్ల నుంచి కూడా ఆయన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దేశంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సహా దేశంలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ కరాచీ స్టీల్ మిల్స్, విద్యుత్-గ్యాస్ సంస్థలు కూడా ఉన్నాయి.

Image copyright Reuters

వాణిజ్య లోటులో చైనా పాత్ర

ఇమ్రాన్ ఖాన్ సంస్కరణల చర్యలకు దిగితే, ఆయన కచ్చితంగా చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని నవాజ్ షరీఫ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఒక విపక్ష నేత చెబుతున్నారు.

"ఈ ప్రభుత్వం సంస్కరణల దిశగా ఎలాంటి చర్యలు చేపట్టినా, అది చాలా కఠినం అవుతుంది. ప్రభుత్వ చర్యలను యూనియన్లు వ్యతిరేకించడం మొదలైతే, తనకు అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత ఎదురవుతోందనే విషయం ఆయనకు తెలిసొస్తుంది" అన్నారు.

పాకిస్తాన్ వాణిజ్య లోటు తగ్గేలా లేదు. పాకిస్తాన్ దిగుమతులు పెరుగుతుండడంతో ఇలా జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ వాణిజ్య లోటు 60.898 బిలియన్ డాలర్లకు చేరింది.

"పాకిస్తాన్ వాణిజ్యలోటులో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్‌కు చైనా నుంచి జరిగే దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు అసలు లేనట్టే చెప్పుకోవాలి. అందుకే పాకిస్తాన్ చైనాతో ఉన్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలపై పునరాలోచిస్తోంది" పాకిస్తాన్ ఆర్థికవేత్త సల్మాన్ షా 'ద డిప్లొమాట్‌'తో అన్నారు.

సుమారు 60 బిలియన్ డాలర్ సీపీఈసీ ప్రాజెక్టు కింద చైనా పాకిస్తాన్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం ఈ ప్రాజెక్టు కింద పాకిస్తాన్‌కు ఇచ్చిన రుణం గురించి బయటపెట్టడానికి చైనా ఎప్పుడూ అయిష్టంగానే ఉంది.

చైనా నుంచి తీసుకున్న రుణ సమస్యకు అసలు పరిష్కారమే లేదని పాకిస్తాన్ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

"పాకిస్తాన్ పాలసీ మేకర్స్ ఆర్థిక లోటును తగ్గించడానికి ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవడం లేదు. వారు కేవలం నష్టం గ్యాప్‌ పూడ్చడానికే ప్రయత్నిస్తున్నారు. చైనా వల్ల మన సమస్యకు పరిష్కారం లభించదు" అని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త ముస్తాక్ ఖాన్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు.

సీపీఈసీ ప్రాజెక్టును కొందరు గుడ్లతో పోలిస్తున్నారు. "పాకిస్తాన్ అన్ని గుడ్లూ ఒకే పెట్టెలో పెట్టింది, అది పగిలితే ఒక్క గుడ్డు కూడా మిగలదు" అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)