మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్‌ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ

  • 7 జూన్ 2019
కీపింగ్ గ్లోవ్స్‌తో మహేంద్ర సింగ్ ధోనీ Image copyright AFP
చిత్రం శీర్షిక సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో కీపింగ్ చేసేప్పుడు భారత పారా స్పెషల్ ఫోర్సెస్ 'రెజిమెంటల్ డాగర్' లోగో ఉన్న గ్లవ్స్‌ ధరించిన ధోనీ

వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తొలిమ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన గ్లవ్స్‌ పెద్ద చర్చకే కారణమైంది.

సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో కీపింగ్ చేసేప్పుడు అతడు భారత పారా స్పెషల్ ఫోర్సెస్ 'రెజిమెంటల్ డాగర్' లోగో ఉన్న గ్లవ్స్‌ను ధరించాడు.

Image copyright PARA SPECIAL FORCES

దేశ సైన్యం పట్ల ఉన్న అభిమానాన్ని ధోని ఈ విధంగా చాటుకున్నాడంటూ అతడిని సమర్థిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.

అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం ఇలాంటి గ్లవ్స్ ధరించకూడదని పేర్కొంది. తదుపరి మ్యాచ్‌ నుంచి ధోని వాటిని వాడకుండా చూడాలని బీసీసీఐని కోరింది.

రాజకీయ, జాతి, మత, సైనిక పరమైన సందేశాలను ఆటగాళ్లు ప్రదర్శించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. ధోని గ్లవ్స్ వద్దనడానికి కూడా ఐసీసీ ఇదే కారణం చూపుతోంది.

Image copyright YOUTUBE GRAB

మొదటి ఉల్లంఘనకు శిక్ష ఉండదు

ధోనిపై ఏవైనా చర్యలుంటాయా అని ప్రశ్నించినప్పుడు.. ''మొదటి ఉల్లంఘనే కాబట్టి అలాంటిదేమీ లేదు. ఆ చిహ్నాని వాడొద్దని మాత్రమే కోరాం'' ఐసీసీ స్ట్రాటజిక్ కమ్యునికేషన్స్ జనరల్ మేనేజర్ క్లెయిర్ ఫర్లాంగ్ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.

ధోనీకి భారత సైన్యం 2011లో పారాషూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. 2015లో అతడు పారా బ్రిగేడ్ శిక్షణ కూడా పొందాడు.

చాలా కాలంగా మ్యాచ్‌ల్లో కీపింగ్ చేసే సమయంలోనూ ధోని కామోఫ్లాజ్ (సైనిక దుస్తుల రంగుల్లోని) గ్లవ్స్‌నే ధరిస్తుంటాడు.

వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో ధోని రెజిమెంటల్ డాగర్ చిహ్నం ఉన్న గ్లవ్స్ ధరించినందుకు చాలా మంది సోషల్ మీడియాలో అతడిని అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టారు.

ఐసీసీ తీరును ఇప్పుడు వీరంతా విమర్శిస్తున్నారు.

ట్విటర్‌లో #DhoniKeepTheGlove (ధోని గ్లవ్స్ తీయకు) అనే హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది.

చాలా మంది ప్రముఖులు కూడా అతడికి మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు.

ధోని ఆ గ్లవ్స్ ధరించడం కొనసాగిస్తాడని, ఈ విషయంలో అతడిగా అండగా ఉంటామని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.

Image copyright Getty Images

ఇందుకు అనుమతించాలంటూ ఐసీసీకి అభ్యర్థనను పంపామని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ పీటీఐకి తెలిపారు.

''పారా స్పెషల్ ఫోర్సెస్ 'రెజిమెంటల్ డాగర్' లోగోలో బలిదాన్ అని రాసి ఉంటుంది. ధోని గ్లవ్స్‌పై అది లేదు. ఈ గ్లవ్స్ నిబంధనలకు విరుద్ధం కాదు'' అని ఆయన అన్నారు.

ఐసీసీ కేవలం అభ్యర్థనే చేసిందని, ఆదేశం ఏమీ ఇవ్వలేదని రాయ్ వివరించారు.

ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న తదుపరి మ్యాచ్ కన్నా ముందే, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ అంశంపై ఐసీసీ సీనియర్ అధికారులను కలుస్తారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)