అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?

  • 10 జూన్ 2019
ఇరాన్ Image copyright Getty Images

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరప్రాంత సముద్రంలో నాలుగు ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపించింది. ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తోంది.

ఇరాన్ మీద ఆంక్షల మినహాయింపులను అమెరికా ఏప్రిల్‌లో రద్దు చేసింది. ఫలితంగా ఇరాన్ చమురు ఎగుమతులను నిషేధించినట్లయింది. దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి.

తమ చమురు ఎగుమతులను నిలిపివేస్తే హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా జరగకుండా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. చమురు రవాణాలో ప్రపంచంలో అత్యంత రద్దీ కేంద్రమైన హోర్ముజ్ జలసంధి సంక్షోభంలో చిక్కుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు వస్తాయి.

హార్ముజ్ జలసంధి.. భూమి మీద అత్యంత వ్యూహాత్మక జలమార్గాల్లో ఒకటి. ఇక్కడ ఏం జరిగినా మన పెట్రోల్ ధరల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?

ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో ఈ ప్రాంతం మరింత అస్థిరంగా మారింది.

''అది ఉగ్రదేశం. మేం సహించేది లేదు'' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద మండిపడ్డారు.

''వాళ్లని (అమెరికాను) నమ్మనని నేను చాలా సార్లు చెప్పాను. వాళ్లని నమ్మకూడదు'' అని ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు కఠినం చేసింది. ఆ దేశపు చమురు ఎగుమతుల మీద ఒత్తిడి పెంచింది.

ఈ విమాన వాహక యుద్ధనౌకను, సైనిక బృందాన్ని ఈ ప్రాంతానికి పంపింది. ఈ ప్రాంతమంతటా సైనిక కార్యకలాపాలు తీవ్రమవుతున్నాయి.

Image copyright Getty Images

ఇంతకుముందు.. 1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఈ జలసంధి యుద్ధరంగంగా మారింది.

ఇప్పుడు తమ ఓడల కింద మందుపాతరలు పేలుతున్నాయని ఈ ప్రాంత ఆయిల్ ట్యాంకర్ ఆపరేటర్లు చెప్తున్నారు.

''ఈ చర్యలకు ఇరాన్‌దే బాధ్యత'' అంటారు సౌదీ అరేబియాలో ఐక్యరాజ్యసమితి రాయబారి.

ఆ మందుపాతరలు ''దాదాపు ఖచ్చితంగా'' ఇరాన్‌వేనని అమెరికా అంటోంది. కానీ ఆ ఘటనలతో తనకు సంబంధం లేదని ఇరాన్ తిరస్కరిస్తోంది.

ఈ సంక్షోభం ప్రపంచం నలుమూలల ప్రజల మీద ప్రభావం చూపుతుంది.

మధ్య ప్రాచ్యపు చమురు ఉత్పత్తులను ప్రపంచానికి.. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఎగువ ప్రాంతాలకు అనుసంధానించేది ఈ జలసంధే.

దీనికి ఒకవైపు అమెరికా మిత్రదేశాలు సహా అరబ్ దేశాలు ఉన్నాయి. మరొకవైపు ఇరాన్ ఉంది.

హోర్ముజ్ జలసంధి వెడల్పు ఒక చోట అతి తక్కువగా 39 కి.మీ. ఉంటుంది. ఇందులో రెండు ఓడ రవాణా మార్గాల మధ్య దూరం కేవలం 3 కిలోమీటర్లే.

అయినాకానీ ప్రపంచంలో అత్యంత భారీ ఆయిల్ ట్యాంకర్లు దీనిగుండా ప్రయాణించగలవు.

మొత్తంగా ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో ఐదో వంతు ఈ మార్గం నుండే పయనిస్తాయి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రద్దీ ప్రదేశం ఈ జలసంధి.

అమెరికా తన చమురు ఎగుమతుల మీద హెచ్చరికలు జారీచేసినపుడు ఇరాన్‌కు ఈ పరిస్థితి కలిసివస్తుంది.

''ఇరాన్ చమురు ఎగుమతులను అమెరికా ఒక్క రోజు ఆపటానికి ప్రయత్నిస్తే.. గల్ఫ్ నుంచి అసలు చమురు ఎగుమతే జరగదు'' అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు.

ఈ జలసంధి గుండా వాణిజ్యంపై గతంలో 1980ల్లోనూ ఆంక్షలు విధించారు.

Image copyright Getty Images

ఇరాన్ - ఇరాక్ యుద్ధ సమయంలో ఇరుపక్షాలూ ఆయిల్ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు చేసుకున్నాయి. దాదాపు 240 చమురు నౌకల మీద దాడి జరిగింది. 55 నౌకలు మునిగిపోయాయి.

అమెరికా ఒత్తిడికి ప్రతిస్పందనగా.. ఇరాన్ సముద్ర మందుపాతరలు, సబ్‌మెరీన్లు, యాంటీ-షిప్ మిసైళ్లు, ఫాస్ట్-అటాక్ బోట్లను మోహరించి ఈ ప్రాంతాన్ని ప్రమాదకరంగా మార్చగలదు.

ఈ మార్గం ప్రమాదంలో పడితే ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతాయి. అది ప్రపంచ ఆర్థికవ్యవస్థను, పెట్రోలును బలంగా దెబ్బతీస్తుంది.

కానీ ఆ పని చేస్తే.. అమెరికా, దాని మిత్రదేశాలు దానిని తమపై యుద్ధంగా పరిగణిస్తాయి.

తాము ఘర్షణ కోరుకోవటం లేదని ఇరు పక్షాలూ గతంలోనూ చెప్పాయి.

కానీ, యుద్ధం కోరుకోవటం లేదని ఇరు పక్షాలూ చెప్తున్నప్పటికీ ఒక చిన్న తప్పుడు లెక్కతో పరిస్థితి భీతావహంగా మారవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)