రైళ్లలో మసాజ్‌ సేవలు.. వంద రూపాయలకే - ప్రెస్‌ రివ్యూ

  • 9 జూన్ 2019
Image copyright Getty Images

రైలు ప్రయాణం ఇక మునుపెన్నడూ లేనంత సుఖవంతం అవుతుందని.. రైళ్లలో భారత రైల్వే మసాజ్ సేవలను అందించబోతోందని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రైలు ప్రయాణంలో శరీరం ఏ కాస్త అలసి సొలిసినట్లు అనిపించినా ఒక్క పిలుపు చాలు.. 'మసాజ్‌ ప్రొవైడర్‌' మన ఎదుట ప్రత్యక్షమై మసాజ్‌ చేస్తాడు.

ఇందుకయ్యే ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు. కేవలం 100 రూపాయలే. భారత రైల్వే చరిత్రలో మసాజ్‌ సేవలను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే 39 రైళ్లలో ఈ సేవలు మరో 15-20 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

ఒక రైల్లో ముగ్గురు నుంచి ఐదుగురు దాకా మసాజ్‌ ప్రొవైడర్స్‌ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడంటే అప్పుడు వారు అందుబాటులో ఉంటారు.

వంద రూపాయలు ఇస్తే తల, పాదాలకు మసాజ్‌ చేస్తారు. మసాజ్‌ ప్రొవైడర్లకు రైల్వేశాఖ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనుంది.

మసాజ్‌ సేవల వల్ల ఏడాదికి రూ. 20 లక్షలు, ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఏడాదికి మరో రూ. 90 లక్షల ఆదాయం వస్తుందని అంచనా.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయా?

కార్లలో వచ్చి.. పొలాల్లో వజ్రాల వేట

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటిగా మారిందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. గతంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు, వయోవృద్ధులు వజ్రాన్వేషణ చేసేవారు. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కార్లలో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకులాడుతున్నారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన కొందరు కార్లలో వచ్చి పగిడిరాయి గ్రామ పరిధిలోని పొలాల్లో రెండు రోజులుగా వజ్రాన్వేషణ చేస్తున్నారు.

అదృష్టం వరిస్తే తక్కువ సమయంలోనే రూ. లక్షలు సంపాదించవచ్చని భావిస్తున్నారు.

పగలంతా పొలాల్లో వెతుకుతూ రాత్రి పూట అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లాడ్జిలో ఉండి వస్తున్నట్లు వారు తెలిపారు.

పక్క జిల్లా వాసులే కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వజ్రాన్వేషణ కోసం ఏటా ఇక్కడికి వస్తుంటారు.

ఒక్క రోజు కోసం పెళ్లి.. రోజంతా జంట విహారం.. ఆపై ఎవరి దారి వారిది.. నెదర్లాండ్స్‌ టూరిస్ట్ ప్యాకేజీ

దేశం కాని దేశంలో.. ఏ మాత్రం పరిచయం లేని ఓ అందమైన అమ్మాయితో.. ఒక్క రోజు కోసం వివాహం.. సాధ్యమేనని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో మొదలై సిటీ అంతా ఎంచక్కా ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టేయొచ్చు. అందమైన సరసుల్లో విహారానికెళ్లొచ్చు.

మధ్య మధ్యలో సెల్ఫీలకూ వీలుంటుంది. మీ స్తోమతను బట్టి ఈ పెళ్లికి మీ బంధుమిత్రులను కూడా ఆహ్వానించవచ్చు. అయితే ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటే వేలం పాటలో పాల్గొనాల్సిందే.

ఈ పెళ్లి తర్వాత ఉండే షరతుల్లో ముఖ్యమైనదేంటంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కనీసం ముద్దు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. చిన్నపాటి కౌగిలింతకు మాత్రం అవకాశం ఉంటుంది.

ఈ తంతు జరిగేది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో. యువతను ఆకర్షించి అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ఇలా ఒక్క రోజు పెళ్లి ప్యాకేజీ ప్రవేశపెట్టారు.

పర్యాటకులకు సాధారణ గైడ్‌ మాదిరిగా కాకుండా ఆత్మీయ స్నేహితురాలిగా మెలుగుతూ దగ్గరుండి ఆ ప్రాంతాన్ని ఆ వధువు చూపిస్తుందన్న మాట. ఇరువురి మధ్య గౌరవానికి భంగం రాకుండా ప్రవర్తించడం ఒక గొప్ప అనుభవంగా కూడా భావిస్తున్నారు.

పర్యాటకులకు, ఆ ప్రాంతవాసులకు మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకూ ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతోందట. దీని ద్వారా వచ్చే ఆదాయం లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విని యోగిస్తున్నారు.

2015 నుంచి ఈ వివాహాలను 'వెడ్‌ అండ్‌ వాక్‌' పేరుతో నిర్వహిస్తున్నారు జోనా రెన్స్‌. ఆమ్‌స్టర్‌డాంలోని స్థానిక మార్కెటింగ్‌ సంస్థలు, వ్యాపారులు 'అన్‌టూరిస్ట్‌ గైడ్‌ టు ఆమ్‌ స్టర్‌డాం' పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.

లైబ్రరీ Image copyright Getty Images

ఆ ఊరంతా లైబ్రరీలు.. 25 ఇండ్లలో కొలువైన 15 వేల పుస్తకాలు

మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్ సమీపంలో ఉన్న భిలార్ గ్రామంలో ఇళ్లే లైబ్రరీలుగా మారిపోయాయని.. ఏ ఇంటి ఆవరణలో ఎక్కడైనా కూర్చొని, పుస్తకాలు చదువుకోవచ్చని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. భిలార్ గ్రామాన్ని పుస్తకాంచ్ గావ్ అని పిలుస్తుంటారు. అంటే.. పుస్తకాల ఊరు. ఇది దేశంలోనే మొట్టమొదటి విలేజ్ ఆఫ్ బుక్స్‌గా రికార్డులకు ఎక్కింది. దేశంలోకెల్లా నాణ్యమైన స్ట్రాబెర్రీలు దొరికే గ్రామంగా పేరున్న భిలార్.. ఇప్పుడు పుస్తక ప్రపంచంగా మారిపోయింది.

పుస్తకాల పట్టణం (టౌన్ ఆఫ్ బుక్స్) అని పిలిచే బ్రిటన్‌లోని హే-ఆన్-వై పట్టణం స్ఫూర్తిగా మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట భిలార్‌లో పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్టును ప్రారంభించింది. పుణ్యక్షేత్రమైన మహాబలేశ్వర్, ప్రముఖ వేసవి విడిది పాంచ్‌గణికి సమీపంలో ఉండటంతో ఈ గ్రామాన్ని ఎంపికచేశారు.

మరాఠీ భాషాభివృద్ధి శాఖ అధికారులు భిలార్‌లో పర్యటించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దీంతో ఇప్పటివరకు 25 మంది తమ ఇండ్లను లైబ్రరీలుగా మార్చేశారు. వీరంతా స్ట్రాబెర్రీ పండించే రైతులే కావడం గమనార్హం. ఇందులో రేకుల షెడ్డు నుంచి రెండంతస్తుల ఇల్లు వరకు ఉన్నాయి.

2017 మే నెలలో పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 35 వేల మంది ఈ లైబ్రరీలను సందర్శించారు.

ప్రస్తుతం భిలార్‌లో మొత్తం 15 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అదనంగా మరో 30 వేల పుస్తకాలు అందించేందుకు మరాఠీ భాషాభివృద్ధి శాఖ కృషి చేస్తున్నది.

ఇందులో పిల్లలు చదువుకునే కామిక్స్ పుస్తకాలు మొదలు కథలు, నవలలు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, సైన్స్.. ఇలా 22 రకాల పుస్తకాలు ఉన్నాయి.

ఒక్కో ఇంటిలో (లైబ్రరీలో) ఒక్కో రకమైన పుస్తకాలు కొలువై ఉంటాయి. గ్రామంలో ఎక్కడ ఏ లైబ్రరీ ఉన్నదో.. అందులో ఏ రకమైన పుస్తకాలు ఉంటాయో తెలిపే బోర్డులు ఉంటాయి.

''ఈ లైబ్రరీల్లోని పుస్తకాలు చదువుకునేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించరు. మా ఇండ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా, ఎప్పుడైనా రావొచ్చు'' అని గ్రామానికి చెందిన మంగళ్ బిలారే తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు