మనిషి సగటు శక్తి కంటే గర్భిణుల సామర్థ్యం ఎక్కువా

  • 13 జూన్ 2019
మహిళ Image copyright Getty Images

సైక్లింగ్, పరుగెత్తడం, వ్యాయామం లాంటి విషయాల్లో మనిషి శ్రమకు ఓర్చే సామర్థ్యం ఎంత? దీనికి పరిమితి ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

మూడు వేల మైళ్ల పరుగు, 'టూర్ డి ఫ్రాన్స్', ఇతర ప్రముఖ ఈవెంట్లపై శాస్త్రవేత్తలు విశ్లేషణ జరిపారు.

విశ్రాంతి సమయంలో ఉండే శరీర జీవక్రియ రేటు(ఆర్‌ఎంఆర్) కన్నా గరిష్ఠంగా రెండున్నర రెట్లు ఎక్కువగా ఈ సామర్థ్యం ఉంటుందని వారు లెక్కగట్టారు. ఈ పరిమితిని మించి సామర్థ్యాన్ని ప్రదర్శించినా అది ఎక్కువ కాలం కొనసాగదని గుర్తించారు.

ఈ పరిమితి మనిషి గుండె, ఊపిరితిత్తులు, కండరాలపై కంటే జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సగటు మనిషిలో ఈ జీవక్రియ రేటు రోజుకు నాలుగు వేల కేలరీలుగా ఉంటుంది.

Image copyright BRYCE CARLSON
చిత్రం శీర్షిక ‘రేస్ అక్రాస్ ద యూఎస్‌ఏ’ రన్నర్లలో ఒకరి ఆర్ఎంఆర్‌ను ఇలా పరిశీలించారు.

డ్యూక్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించింది. ఈ సామర్థ్యం విషయంలో గర్భిణులను స్పెషలిస్టులుగా చెప్పుకోవచ్చని ఈ పరిశోధన పేర్కొంది. మనిషి గరిష్ఠ సామర్థ్యానికి దాదాపు సమానంగా వారి సామర్థ్యం ఉంటుందని తెలిపింది. గర్భంతో ఉన్నప్పుడు మహిలు వారి ఆర్‌ఎంఆర్ కన్నా 2.2 రెట్లు ఎక్కువగా సామర్థ్యాన్ని వినియోగిస్తారని వెల్లడించింది.

శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో భాగంగా మొదట 'రేస్ అక్రాస్ ద యూఎస్‌ఏ' అథ్లెట్లపై అధ్యయనం జరిపారు. ఈ రేసులో అథ్లెట్లు 140 రోజుల్లో కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీ వరకు 3,080 మైళ్లు (4956.78 కిలోమీటర్లు) దూరం పరుగెత్తారు. పోటీదారులు వారానికి ఆరు మారథాన్లలో పాల్గొన్నారు. వారి శరీరంపై ఈ పరుగు ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ వచ్చారు.

రేసుకు ముందు, రేసు సమయంలో అథ్లెట్ల ఆర్‌ఎంఆర్‌ను పరిశోధకులు నమోదు చేశారు. తీవ్రస్థాయిలో సాగే ఈ ఈవెంట్‌లో వారు ఖర్చుచేసిన కేలరీలను కూడా నమోదు చేశారు.

అథ్లెట్లలో శక్తి వినియోగం ప్రారంభంలో అత్యధికంగా ఉందని, కానీ తర్వాత ఇది క్రమంగా ఆర్‌ఎంఆర్ కన్నా రెండున్నర రెట్లకు సమానం అయ్యిందని అధ్యయనంలో తేలింది.

పరిశోధన వివరాలు 'సైన్స్ అడ్వాన్సెస్'లో పబ్లిష్ అయ్యాయి.

క్రీడా ఈవెంట్ వ్యవధికీ, శక్తి వినియోగానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈవెంట్ ఎంత సుదీర్ఘంగా ఉంటే, కేలరీల వినియోగం అంత కష్టంగా ఉన్నట్లు తేలింది.

Image copyright BRYCE CARLSON

మారథాన్‌లో పాల్గొనడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. కానీ మారథాన్‌లో పాల్గొనేందుకు అవసరమైన సామర్థ్యం కన్నా మనిషి గరిష్ఠ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో స్పష్టమైంది.

ఒక్కో మారథాన్‌లో అథ్లెట్లు వారి ఆర్‌ఎంఆర్ కన్నా 15.6 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని వినియోగించారు.

23 రోజులపాటు సాగిన టూర్ డి ఫ్రాన్స్‌లో సైక్లిస్టులు వారి ఆర్ఎంఆర్ కన్నా 4.9 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని వాడారు.

అంటార్కిటికాలో 95 రోజులపాటు ట్రెక్కింగ్ చేసిన ట్రెక్కర్ ఆర్‌ఎంఆర్ కన్నా మూడున్నర రెట్లు ఎక్కువ శక్తిని వినియోగించారు.

ఒకట్రెండు రోజులైతే తీవ్రస్థాయిలో శక్తి ఖర్చయ్యే పనులను చేయగలరు, కానీ ఎక్కువ రోజులు శక్తిని ఖర్చు చేయాలంటే మాత్రం శక్తిని ఖర్చుచేసే తీవ్రతను తగ్గించుకోవాల్సి ఉంటుందని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హెర్మన్ పోంట్‌జర్ బీబీసీతో చెప్పారు.

ఆర్‌ఎంఆర్ కన్నా రెండున్నర రెట్లకు మించి శక్తిని వినియోగించేందుకు వీలుగా శరీరం కేలరీలను జీర్ణం చేసుకోవడంగాని, గ్రహించడంగాని, ప్రాసెస్ చేయడంగాని చేయలేదని పరిశోధకులు గుర్తించారు.

స్వల్ప వ్యవధితో కూడిన క్రీడా ఈవెంట్లలో అయితే శరీరం కొవ్వు లేదా కండలు కరిగించి సొంత వనరులను వాడుకొంటుందని, అదే తీవ్రస్థాయి ఈవెంట్లలో అయితే శక్తిని వినియోగించుకోవడంలో శరీరం సమతౌల్యాన్ని పాటించాల్సి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ పరిశోధన ఫలితాలు అథ్లెట్లకు ఉపయోగపడతాయని డాక్టర్ పోంట్‌జర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)