కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్‌ఫుల్ మహిళ వెంటపడిన నియంత

  • 11 జూన్ 2019
గడాఫీ Image copyright Getty Images

21వ శతాబ్దంలో రెండో దశాబ్దం మొదలవుతున్న సమయంలో కల్నల్ మువమ్మర్ గడాఫీ కాలం ముగిసిపోయింది. 2011 నాటికి ఆయన ఎవరూ మళ్లీ చూడాలనుకోని ఒక పాత సినిమా పాత్రగా మారిపోయారు.

ఆయన అధికారంలోకి వచ్చేనాటికి వియత్నాం యుద్ధం జరుగుతోంది. మనిషి చంద్రుడిపై కాలు మోపాడు. అమెరికా అధ్యక్షుడుగా రిచర్డ్ నిక్సన్ ఉండేవారు.

అప్పటి నుంచి గడాఫీ ఈ లోకాన్ని వీడేవరకూ అమెరికా ఏడుగురు అధ్యక్షులను, బ్రిటన్ 8 మంది ప్రధాన మంత్రులను చూసింది.

కానీ గడాఫీ తనను తాను బ్రిటన్ మహారాణితో పోల్చుకునేవారు. లిబియాలో తిరుగుబాటు మొదలైనప్పుడు గడాఫీ ఇచ్చిన ఒక ప్రసంగంలో కూడా అదే విషయం చెప్పాడు.

"బ్రిటన్ మహారాణి 50 ఏళ్లకు పైగా పాలించారు, థాయ్‌లాండ్ రాజు 68 ఏళ్ల వరకూ అధికారంలో ఉన్నాడు. అలాంటప్పుడు నేనెందుకు ఉండకూడదు" అన్నాడు.

Image copyright Getty Images

27 ఏళ్ల వయసులో సైనిక తిరుగుబాటు

గడాఫీ మొత్తం 42 ఏళ్లపాటు లిబియాను పాలించాడు. ఒకప్పుడు చాలా ఆకర్షణీయ వ్యక్తిత్వం అనిపించుకున్న గడాఫీ 1969లో రక్తం చిందకుండా జరిగిన తిరుగుబాటుతో లిబియా రాజు ఇద్రీస్‌ నుంచి అధికారం చేజిక్కించుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు. ఆ సమయంలో ట్రిపోలీలో నివసించిన అషర్ షమ్సీ ఆ రోజు గురించి చెప్పారు.

"అప్పుడు నేను మంచి నిద్రలో ఉన్నా. మా చెల్లి నన్ను లేపింది. త్వరగా లే, సైనిక తిరుగుబాటు జరిగిందని చెప్పింది. నేను రేడియో ఆన్ చేశాను. అందులో దేశభక్తి గీతాలు వస్తున్నాయి. గట్టిగట్టిగా నినాదాలు చేస్తున్నారు. నేను సిటీ సెంటర్ చేరుకునేసరికే అక్కడ రోడ్లపై చాలా మంది గుమిగూడారు. విప్లవ నినాదాలు చేస్తున్నారు. అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లిందో ఎవరికీ తెలీడం లేదు. నాక్కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించింది" అన్నారు.

Image copyright Getty Images

తిరుగుబాటు జరిగిన తర్వాత వారెవరో తెలిసింది

లిబియాలో అధికారం హస్తగతం చేసుకున్న వారం రోజులకు ఆ సైనిక తిరుగుబాటు చేసింది గడాఫీనే అని జనాలకు తెలిసింది. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన "అధికార మార్పిడితో శుద్ధీకరణ చేయాలనే మీ డిమాండును నేను పూర్తి చేశాను. రాజు దేశం బయట ఉండడానికి ఒప్పుకున్నాను" అన్నారు. లిబియాలో ప్యూడల్ రాజకీయ వ్యవస్థతో స్తంభించిన స్వేచ్ఛాగాలులు మళ్లీ వీయడాన్ని చాలా మంది స్వాగతించారు.

Image copyright Getty Images

భద్రత గురించి అతి జాగ్రత్త

గడాఫీ మొదటి నుంచి తను వ్యక్తి పూజకు పూర్తి వ్యతిరేకినని చెప్పేవారు. కానీ కాలంతోపాటు ఆయన ఒక నిరంకుశ నియంతలా మారారు. తన భద్రత కోసం ఆయన తీసుకునే జాగ్రత్తలు తీవ్ర స్థాయికి చేరాయి. గడాఫీ జీవితచరిత్ర రాసిన డేవిడ్ బ్లడీ, ఆండ్రూ లిసెట్ తమ "గడాఫీ అండ్ ద లిబియన్ రివల్యూషన్" పుస్తకంలో వాటి గురించి రాశారు.

"గడాఫీ మొదట అధికారంలోకి వచ్చినపుడు ట్రిపోలీలో ఒక పాత డొక్కు 'ఫోక్స్ వ్యాగన్‌'లో తిరిగేవారు. తన భార్యతో కలిసి స్థానిక సూపర్ మార్కెట్లలో కొనుగోళ్లు చేసేవారు. కానీ మెల్లమెల్లగా అదంతా మారిపోయింది".

"ఆయన అజీజియా బారెక్స్ నుంచి వెళ్తున్నప్పుడు సాయుధులున్నరెండు కార్ల కాన్వాయ్‌లు వేర్వేరు దిశల్లో పరుగులు తీసేవి. వాటిలో ఒక దాన్లో ఆయనుండేవారు. ఇంకోదాన్ని అందరినీ మభ్య పెట్టేందుకు ఉపయోగించేవారు".

"విమానంలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒకేసారి రెండు విమానాలు టేకాఫ్ అయ్యేలా చేసేవారు. తను ఎక్కాల్సిన విమానాన్ని రెండు గంటలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి లాండ్ చేయించేవారు. తర్వాత అందులో కూచునేవారు. అంటే ఆ విమానంలో ఒక వేళ ఎవరైనా బాంబు పెట్టుంటే, తను కూచునే ముందే అది పేలిపోతుందిలే అని జాగ్రత్తపడేవారు".

"ఒకసారి గడాఫీ విమానంలో ట్యునిస్ చేరుకున్నారు. అది దిగడానికి మందు విమానాశ్రయం కంట్రోల్ రూం నుంచి 'విమానంలో ఎవరున్నారు' అని అడిగారు. గడాఫీ పేరు చెప్పని పైలెట్ మా విమానంలో 'ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి' ఉన్నారు అన్నాడు".

Image copyright Getty Images

చేయి కలిపే ముందు గ్లోవ్స్ వేసుకున్నారు

గడాఫీ తనకేమైనా అవుతుందేమో అని చాలా ఆందోళనకు గురయ్యేవారని వార్తలు బయటికొచ్చాయి. లిండ్సీ హిల్సమ్ 'శాండ్ స్టార్మ్-లిబియా ఇన్ ద టైం ఆఫ్ రివల్యూషన్' అనే పుస్తకంలో 2009లో అమెరికా రాయబారి జీన్ క్రెంట్జ్ ఒక దౌత్య సమావేశంలో గడాఫీ ఉక్రెయిన్ నర్స్ గెలీనా కొలోత్నిస్కాపై ఆధారపడిన విషయం గురించి చెప్పారు.

గెలీనాను గడాఫీ ప్రియురాలని చెబుతారు. "గడాఫీ ఏ వస్తువును ముట్టుకోవాల్సి వచ్చినా తను దానిని ముందే స్టెరిలైజ్ చేసేదాన్నని, ఆయన కుర్చీకి కూడా కీటకనాశిని కొట్టేవారని" ఆమె చెప్పారు.

ఆయన ఉపయోగించే మైక్రోఫోన్‌ను కూడా స్టెరిలైజ్ చేసేవారు. గడాఫీ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా.. ఆ హోటల్లో తనతోపాటూ తీసుకొచ్చిన దుప్పట్లు వేయించేవారు. ఒక అరబ్ నేతకు షేక్ హాండ్ ఇచ్చేముందు ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనని ఆయన తెల్లటి గ్లౌజులు కూడా వేసుకున్నారని చెబుతారు.

Image copyright Getty Images

లాకర్‌బీ పేలుడు వెనుక గడాఫీ హస్తం

1988 డిసెంబర్ 21న ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి డిట్రాయెట్ వెళ్తున్న పాన్-ఏఎం విమానం స్కాట్‌లాండ్‌లోని లాకర్బీ పైన గాల్లోనే పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 243 మంది చనిపోయారు. అది గడాఫీకి చాలా చెడ్డపేరు తీసుకొచ్చింది.

తర్వాత జరిగిన విచారణలో ఈ పేలుడు వెనక లిబియా హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆగ్రహించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ గడాఫీని 'పిచ్చి కుక్క' అని కూడా తిట్టారు.

Image copyright Getty Images

శత్రువులకు బహిరంగ ఉరిశిక్ష

బయటే కాదు, స్వదేశంలో కూడా గడాఫీ అరాచకాల వార్తలు బయటికి పొక్కాయి. శత్రువులను బహిరంగంగా ఉరితీయడం మామూలైపోయింది. అప్పట్లో ట్రిపోలీలో నివసించిన బాషోష్ షోఖావీ బీబీసీతో ఒక విషయం చెప్పారు.

"ఒక రోజు మేం యూనివర్సిటీకి వెళ్లేసరికి, అక్కడ ప్రధాన ద్వారం దగ్గర నలుగురు ఉరి తాళ్లకు వేలాడుతున్నారు. నేను ఆ దృశ్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో అక్కడ గేటుపై ఒక పెద్ద గడాఫీ పోస్టర్ ఉండేది. రాత్రి ఎవరో విద్యార్థులు ఆ పోస్టరుపై మసిపూశారు. వారికి బుద్ధి చెప్పాలనుకున్నా గడాఫీ అధికారులు ఆ నలుగురినీ యూనివర్సిటీ గేటు పైనే ఉరితీశారు" అన్నారు.

Image copyright Getty Images

అబూ సలీమ్ జైల్లో కాల్పులు, 1270 మంది మృతి

1996లో ట్రిపోలీలోని అబూ సలీం జైల్లో ఉన్న ఖైదీలను గడాఫీ సైనికులు ఒక కాంపౌండ్‌లోకి తీసుకెళ్లి, వారిపై కాల్పులు జరిపారు. హ్యూమన్ రైట్స్ వాచ్ వివరాల ప్రకారం ఆ మారణహోమంలో 1270 మంది ఖైదీలు చనిపోయారు. ఖైదీలు చనిపోయారని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలీలేదు. లిండ్సీ హిల్సమ్ తన పుస్తకంలో దాని గురించి రాశారు.

"ఫువాద్ అసద్ బేన్ ఒమ్రాన్ ప్రతి రెండు నెలలకోసారి ట్రిపోలీ జైల్లో ఉన్న తన మేనల్లుడి దగ్గరకు అతడి పిల్లల్ని తీసుకెళ్లేవాడు. తనతోపాటు బట్టలు, కొన్ని వస్తువులు తీసుకెళ్లేవారు. వాటిని జైలు సిబ్బంది తమ దగ్గరే ఉంచేసుకున్నారు. తన మేనల్లుడిని పిల్లలు ఎప్పటికీ చూడలేకపోయారని ఆయన చెప్పాడు. 14 ఏళ్లు వరసగా అక్కడికెళ్లినా, అతడు చనిపోయాడని వారికి ఎవరూ చెప్పలేదు".

Image copyright Getty Images

యార్ అరాఫత్‌తో శత్రుత్వం

గడాఫీ ఈజిఫ్టు అధ్యక్షుడు జమాల్ అబ్దుల్ నాసిర్‌ను తన హీరోగా భావించేవారు. కానీ ఆయనకు ఈజిఫ్టు అధ్యక్షుడు అన్వర్ సాదాత్, పాలస్తీనా నేత యాసిర్ అరాఫత్ అంటే పడేది కాదు.

"గడాఫీ ఎప్పుడూ ఏ అరేబియా అధ్యక్షుడినీ హత్య చేయించలేకపోయాడు. కానీ దానికోసం ఆయన ప్రయత్నించలేదని చెప్పలేం. యాసర్ అరాఫత్ అంటే ఆయనకు నచ్చేది కాదు. విదేశాల్లో ఉన్న తన శత్రువులను చంపడానికి అరాఫత్ అనుచరులను ఇవ్వలేదని గడాఫీకి కోపం" అని లిండ్సే హిల్సమ్ తన పుస్తకంలో రాశారు.

1982లో అరాఫత్, ఆయన అనుచరులను బీరూట్‌లో చుట్టుముట్టినపుడు గడాఫీ ఆయనకు ఒక సందేశం పంపించారు. "మీకిప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే ఆప్షన్" అన్నాడు. దానికి అరాఫత్ అదే పద్ధతిలో సమాధానం ఇచ్చాడు. "నేను దానికి సిద్ధం, కానీ కూడా నాకు తోడుగా రావాలి" అన్నాడు.

Image copyright Getty Images

పవర్‌ఫుల్ ఆడవాళ్లంటే పిచ్చి

ప్రపంచంలోని కొందరు శక్తిమంతమైన మహిళలంటే గడాఫీ పడిచచ్చేవారని చాలా కొద్దిమందికే తెలుసు. లిండ్సీ హిల్సన్ దాని గురించి రాశారు.

ఒకసారి ఆయన ఒక ఇంటర్వ్యూ చివర్లో ఒక మహిళా జర్నలిస్టును.. "అమెరికా విదేశాంగ మంత్రి మెడ్లీన్ అల్‌బ్రైట్‌కు నేనిచ్చే ఒక సందేశాన్ని చేర్చగలరా" అని కోరారు.

గడాఫీ ఆ సందేశంలో "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీక్కూడా నామీద ఇష్టం ఉంటే, ఈసారీ టీవీలో కనిపించినపుడు ఆకుపచ్చ బట్టలు వేసుకోండి" అని రాశాడు.

అమెరికాకు బుష్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న కండోలిజా రైస్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఆమెను వెనక నుంచి 'మై ఆఫ్రికన్ ప్రిన్సెస్' అని పిలుస్తుండేవారు.

రైస్ తన ఆత్మకథ 'నో హయ్యర్ ఆనర్‌'లో " 2008లో నేను ఆయన్ను తన టెంట్ దగ్గర కలవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రపంచంలోని అగ్ర నేతలతో నేనున్న ఫొటోలను సేకరించానని చెప్పిన గడాఫీ, వాటిని నాకు చూపించారు. నేనవి చూస్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ సిస్టంలో 'బ్లాక్ ఫ్లవర్ ఇన్ ద వైట్ హౌస్' అనే ఒక ఇంగ్లిష్ పాట పెట్టారు" అని రాశారు.

Image copyright Getty Images

దిల్లీ అలీనోద్యమ సదస్సుకు నంబర్ 2 జాలౌద్‌

కల్నల్ గడాఫీ - భారత్‌ మధ్య సంబంధాల ఒక్కోసారి బాగుంటే, ఒక్కోసారి దారుణంగా ఉండేవి. గడాఫీ ఎప్పుడూ భారత్ రాలేదు. 1983లో దిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సుకు కూడా ఆయన తన నంబర్ 2 జాలౌద్‌ను దిల్లీ పంపించారు. జాలౌద్ భారత్ వచ్చి ఒక వివాదంలో చిక్కుకున్నారు.

"సదస్సులో పాల్గొన్న తర్వాత అహదేల్ సలామ్ జాలౌద్ హైదరాబాద్ వెళ్లారు, అక్కడ ప్రొటోకాల్ ఉల్లంఘించడమే కాదు, సెక్యూరిటీ సమస్యలు కూడా పట్టించుకోకుండా తన కన్వాయ్ చార్‌మినార్ దగ్గరకు చేరుకోగానే, కారుపైకెక్కి డాన్స్ చేయడం మొదలెట్టారు" అని ప్రముఖ జర్నలిస్ట్ కేపీ నాయర్ టెలిగ్రాఫ్ పత్రికలో రాశారు.

ఆ ఫొటో భారత పత్రికలన్నింటిలో వచ్చింది. ప్రధాని ఇందిరాగాంధీ దానిని భారత ముస్లింలతో నేరుగా చర్చలు జరపడానికి చేసిన ప్రయత్నంలా చూశారు. భారత్, లిబియా సంబంధాలు మరింత దిగజారాయి.

కానీ గడాఫీకి ఇందిరాగాంధీని ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు. ఆమెకు నచ్చజెప్పేందుకు ఆయన తన రెండో భార్య సఫియా ఫర్కాశ్ అల్ బ్రజయీని దిల్లీ పంపించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భార్య సఫియాతో గడాఫీ

ఇందిరా గాంధీ పర్యటనకు బదులుగా కార్మికుల విడుదల

గడాఫీ భార్య దిల్లీకి వచ్చిన సమయంలో లిబియాలో అర్జున్ అస్రానీ భారత రాయబారిగా ఉండేవారు. ఆయన అప్పట్లో జరిగిన విషయాలను బీబీసీకి చెప్పారు.

"నా భార్య ఆరోజు గడాఫీ భార్యతో కలిసి ట్రిపోలీ విమానాశ్రయానికి వెళ్లారు. నేను తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తానని ఆమె చెప్పారు. దిల్లీ వెళ్లాక గడాఫీ భార్య రాష్ట్రపతి భవన్లో ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీని కలిసిన ఆమె 'మీరు నాకు లిబియాకు వస్తానని మాట ఇచ్చేవరకూ నా భర్త నన్ను తిరిగి రావద్దన్నాడు' అని చెప్పారు".

దాంతో ఇందిరాగాంధీ ఆమె ఆహ్వానం స్వీకరించక తప్పలేదు. విదేశాంగ శాఖ అధికారులు దీనికి బదులు మనం లిబియాను ఏదైనా అడగచ్చని ప్రధానికి చెప్పారు. దాంతో నేను డ్రగ్స్ ఉంచుకున్న కేసులో అరెస్టై లిబియా జైల్లో ఉన్న ఇద్దరు భారత కార్మికులను విడుదల చేయమని అడగచ్చన్నాను. గడాఫీ భార్య మళ్లీ లిబియాలో అడుగుపెట్టగానే ఆ ఇద్దరు భారతీయ కార్మికులను వదిలేశారు అని చెప్పారు.

Image copyright Getty Images

భారత రాయబారి భార్యకు గడాఫీ ఆహ్వానం

అర్జున్ అస్రానీ ఇంకో విషయం కూడా చెప్పారు. గడాఫీ భార్య సఫియా, మా ఆవిడను తన ఇంటికి కాఫీకి పిలిచారు. కాఫీ తాగుతూ 'లిబియాలో మీకు ఎలా ఉందని' అడిగారు. నా భార్య ఆమెతో అంతా బాగుంది. కానీ, మీ హాండ్సమ్ భర్తను కలవలేకపోవడమే లోటుగా ఉంది" అన్నారు.

గడాఫీ భార్య అప్పుడు ఏం మాట్లాడలేదు. తర్వాత రోజు నాకు గడాఫీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు మీ ప్రోగ్రాం ఏంటి అని అడిగారు. నేను ఫ్రెంచ్ ఏంబసీకి లంచ్‌కి వెళ్తున్నా అన్నాను.

తర్వాత ఫ్రెంచ్ ఏంబసీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. 'మీ శ్రీమతి ఇప్పుడు కల్నల్ గడాఫీని కలవడానికి రాగలరా' అన్నారు. నేను నా భార్య మాత్రమేనా అన్నాను. వాళ్లు 'మిసెస్ అస్రానీ మాత్రమే' అన్నారు.

తర్వాత నా భార్య అక్కడికి వెళ్లాక గడాఫీ ఆమెకు ఒక గోల్డ్ ప్లేటెడ్ చేతి గడియారం ఇచ్చారు. దాని డయల్ మీద ఆయన ఫొటో ఉంది. కానీ అక్కడ ఆయన వింతగా మాట్లాడారు. "మీరు లిబియా వదిలి వేరే దేశం వెళ్తున్నట్టు తెలిసింది. కానీ నా అనుమతి లేకుండా మీ భర్త లిబియాను వదిలి ఎలా వెళ్లగలరు" అన్నారు.

నా భార్య, "ఆ విషయం మా ఆయన్నే అడగండి" అన్నారు. నా భార్య కారులో కూచోగానే "రేపు ఉదయం ఇక్కడకు రావాల్సుంటుందని మీ భర్తకు చెప్పండి" అని ఆమెకు చెప్పారు.

Image copyright Getty Images

భారత అణు సాంకేతికత కోరిన గడాఫీ

తర్వాత రోజు గడాఫీ అర్జున్ అస్రానీ కోసం తన కారు పంపించారు. ఆయన ద్వారా భారత అణు సాంకేతికత పొందాలనుకున్నారు. కానీ, దానికి భారత్ ఒప్పుకోలేదు.

"గడాఫీ నాతో మొరార్జీ భాయ్ అణు సాంకేతికత ఇస్తామని మాకు మాట ఇచ్చారు. కానీ అది ఇప్పటివరకూ జరగలేదు అన్నారు. నేను, నాకు ఆ విషయం తెలీదు. కానీ నేను దిల్లీ వెళ్తున్నా, మీ మాటను అక్కడ కచ్చితంగా చెబుతా" అని అస్రానీ చెప్పారు.

గడాఫీ నాతో "ఇప్పుడు మిమ్మల్ని ఏ దేశానికి బదిలీ చేశారు అని అడిగారు. నేను థాయ్‌లాండ్ అన్నాను. దాంతో ఆయన థాయ్‌లాండ్‌లో మా రాయబార కార్యాలయం లేదు. మీరక్కడ మా రాయబారిగా కూడా పనిచేస్తారా అని అడిగారు. అప్పుడు నేనేం చెప్పగలను, 'తప్పకుండా' అన్నాను" అన్నారు అస్రానీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)