ఈ సుఖవ్యాధులు రోజుకు 10 లక్షల మందికి సోకుతున్నాయి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయి

  • 12 జూన్ 2019
syphilis Image copyright Getty Images

ప్రపంచవ్యాప్తంగా రోజుకు 10లక్షల మంది సుఖవ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంటే, సంవత్సరానికి 37.6 కోట్ల మందికిపైగా గనేరియా, క్లెమేడియా, ట్రికోమనైసిస్, సిఫలిస్ అనే నాలుగు రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు.

ఈ వ్యాధులు ప్రబలకుండా నియంత్రించడంలో పురోగతి లోపించిందని, తాజా గణాంకాలను చూసి ఇప్పటికైనా మేల్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

సుఖవ్యాధుల నివారణకు వాడే మందులను సైతం ఎదుర్కొనే స్థాయికి ఈ రోగాల తీవ్రత పెరగడం నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది.

సంభోగం ద్వారా సోకే ఈ నాలుగు రకాల ఇన్ఫెక్షన్లు ప్రపంచ జనాభాపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న అంశంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ ప్రపంచ దేశాల నుంచి గణాంకాలను సేకరిస్తుంది.

2012 సంవత్సరం గణాంకాలతో పోలిస్తే, కొత్తగా సుఖవ్యాధుల బారినపడ్డవారిలోనూ, పాత కేసుల్లోనూ ఎలాంటి తగ్గుదల కనిపించలేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ప్రపంచ జనాభాలో ప్రతి 25 మందిలో ఒకరు ఈ 4 వ్యాధుల్లో ఏదో ఒక వ్యాధిని కలిగివున్నారని, కొందరు ఒకేసమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు కలిగివున్నారని తెలిపింది.

2016 గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల్లో సుఖవ్యాధుల వారీగా రోగుల సంఖ్య ఇలా ఉంది:

  • ట్రికోమనైసిస్ కొత్త కేసులు - 15.6 కోట్లు
  • క్లెమేడియా కొత్త కేసులు - 12.7 కోట్లు
  • గనేరియా కొత్త కేసులు - 8.7 కోట్లు
  • సిఫలిస్ కొత్త కేసులు - 60.3 లక్షలు

సెక్స్ సమయంలో ఒక పరాన్న జీవి కారణంగా కలిగే ఇన్ఫెక్షన్ వల్ల ట్రికోమనైసిస్ సోకుతుంది. క్లెమేడియా, సిఫలిస్, గనేరియా అన్నవి బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్లు.

Image copyright Getty Images

ఈ భారీ సంక్షోభానికి ముందస్తు హెచ్చరిక

తెల్లబట్ట, మూత్రం వెళ్లినపుడు నొప్పి, పీరియడ్స్ మధ్యకాలంలో రక్తస్రావం.. ఇవి సుఖవ్యాధుల లక్షణాలు.

క్లెమేడియా, గనేరియా వ్యాధులు తీవ్రమైనపుడు పెల్విక్ ప్రాంతంలో మంట కలిగించే వ్యాధి, మహిళల్లో వంధ్యత్వం కలుగుతాయి. ఇక సిఫలిస్ వల్ల నరాలకు సంబంధించిన వ్యాధి, గుండెజబ్బులు వస్తాయి.

గర్భిణులకు ఈ ఇన్ఫెక్షన్లు సోకితే, మృతశిశువులు జన్మించడం, నెలలు నిండకనే పిల్లలు పుట్టడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టిన పిల్లలకు నిమోనియా, చూపులేకపోవడంతోపాటు పుట్టుకతోనే వైకల్యం సంక్రమించే అవకాశం ఉంది.

''సెక్స్ ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో పురోగతి లోపించడం మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డా.పీటర్ సలామా అన్నారు.

''ఇది మనం మేలుకోవాల్సిన సమయం. ఈ వ్యాధులను నియంత్రించడానికి అవసరమయ్యే సేవలను ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా ఉపయోగించుకునేలా నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి'' అని ఆమె అన్నారు.

కండోమ్ వాడకంతోపాటు, ఆడ, మగ ఇద్దరూ తరచూ పరీక్షలు చేయించుకోవడం కూడా ముఖ్యం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

విస్తృతంగా అందుబాటులోవున్న మందులతో ఈ వ్యాధులను నయం చేస్తారు. కానీ సిఫలిస్‌కు వైద్యం చేయడం చాలా కష్టంగా తయారైంది. సిఫలిస్ వైద్యానికి అవసరమైన పెన్సిలిన్ అవసరమైనమేర అందుబాటులో లేకపోవడం, నయం అవ్వడం దాదాపు అసాధ్యమైన 'సూపర్ గనేరియా' లాంటి కేసులు పెరగడంతో ఇబ్బంది తలెత్తింది.

''సాధారణ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేయలేకపోవడం బాధాకరం. నయం చేయడానికి వీలుకాని గనేరియా కేసులు పెరగడం, ఈ సంక్షోభం గురించి హెచ్చరికలా భావించవచ్చు. ఈ వ్యాధులు ప్రబలకుండా తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉంది. కొత్త యాంటీబయోటిక్స్‌ను తయారుచేసి, నిష్ఫలమైన వైద్య విధానాల స్థానంలో కొత్త వైద్యాన్ని ప్రవేశపెట్టాలి'' అని 'వెల్కమ్స్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ ప్రోగ్రామ్' అధిపతి డా.టిమ్ జిన్క్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి