క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి

  • 16 జూన్ 2019
చాపెల్ సోదరులు అండర్ ఆర్మ్ బౌలింగ్ Image copyright Getty Images

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుంది. చివరి బాల్‌కు సిక్స్ కొడితే న్యూజీలాండ్‌ ఆ మ్యాచ్‌ను టై చేస్తుంది.

ఆ సమయంలో ఆసీస్ కెప్టెన్ తన జట్టును గెలిపించడానికి ఒక కొత్త వ్యూహంతో ముందకొచ్చాడు. బౌలర్‌ను పిలిచి ఓ సలహా ఇచ్చాడు. రన్నప్ నుంచి నడుచుకుంటూ వచ్చిన బౌలర్ తన కెప్టెన్ చెప్పినట్లే బౌలింగ్ చేశాడు. ఆ బాల్‌కు న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఒక్క పరుగు కూడా చేయకుండా చేతులెత్తేసింది.

ఆసీస్ ఆ మ్యాచ్ గెలిచినా... ఆ ఒక్క బాల్‌ కారణంగా విమర్శలు ఎదురుకుంది.

ఇంతకీ అలా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా బౌలింగ్ చేయమని చెప్పిన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవరో తెలుసా... ఒకప్పుడు టీం ఇండియా కోచ్‌గా చేసి వివాదాస్పదుడైన గ్రేగ్ చాపెల్. అప్పుడు బౌలింగ్ చేసిన ఆటగాడు ట్రెవొర్ చాపెల్. వీరిద్దరు సోదరులు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రెవొర్ చాపెల్ అండర్ ఆర్మ్ బౌలింగ్ వేసి మ్యాచ్‌ను గెలిపించినప్పటికీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడాడని విమర్శలు ఎదుర్కొన్నారు.

అసలేం జరిగింది?

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల మధ్య 1981లో బెన్సన్ & హెడ్జెస్ ట్రై సిరీస్ జరుగుతోంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను న్యూజీలాండ్ గెలుచుకోగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

ఎంసీజీ స్టేడియంలో ఫిబ్రవరి 1న ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. చివరి ఓవర్లో న్యూజీలాండ్ 10 పరుగులు చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా గెలుస్తుంది.

ఆ సమయంలో కెప్టెన్ గ్రేగ్ చాపెల్ తన సోదరుడు ట్రెవొర్ చాపెల్‌కు బాల్ ఇచ్చాడు.

కెప్టెన్ నమ్మకానికి తగ్గట్టే తన ఓవర్‌లోని మొదటి ఐదు బంతుల్లో ట్రెవొర్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి సిక్స్ కొడితే న్యూజీలాండ్ ఈ మ్యాచ్‌ను టైగా ముగించగలదు.

కానీ, ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలనుకున్న గ్రేగ్ చాపెల్ తన సోదరుడిని పిలిచి అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు.

ట్రెవొర్ చివరి బాల్‌ను అలానే వేశాడు. క్రీజ్‌లో ఉన్న మెక్ కెచ్ని ఏం చేయలేక డిఫెన్స్‌తో ఆటను ముగించాడు. ఆ తర్వాత కోపంతో బ్యాట్‌ను స్టేడియంలోనే విసిరేశాడు.

అండర్ ఆర్మ్ అంటే?

భుజాన్ని పైకి ఎత్తకుండా బాల్‌ను చేయి కిందికి తిప్పి నేలబారుగా వేయడాన్ని అండర్ ఆర్మ్ బౌలింగ్‌గా చెప్పొచ్చు.

ఈ ఘటనకు ముందు అండర్ ఆర్మ్ బౌలింగ్ వేయకూడదని రూల్స్ బుక్‌లోనూ లేదు. కానీ, అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయడం అనేది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. కానీ, చాపెల్ సోదరులు ఇదేమీ లెక్క చేయలేదు. గెలుపు కోసం అండర్ ఆర్మ్ బౌలింగ్‌ను ఒక అస్త్రంగా మార్చుకున్నారు.

రూల్స్ బుక్‌లో అప్పటికింకా అండర్ ఆర్మ్ బౌలంగ్‌కు సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేకపోవడం చాపెల్ సోదరులకు కలిసొచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని తన సోదరుడితో గ్రేగ్ చాపెల్ అండర్ ఆర్మ్ బౌలింగ్ వేయించాడు.

వెల్లువెత్తిన విమర్శలు

ఈ ఘటన తర్వాత చాపెల్ సోదరులు ఇంటా బయట విమర్శలు ఎదుర్కున్నారు. క్రికెటర్లు, క్రీడాభిమానులే కాదు. ప్రధానమంత్రులు సైతం దీనిపై స్పందించారు.

అప్పటి న్యూజీలాండ్ ప్రధాన మంత్రి ఈ ఘటనను ''క్రికెట్ చరిత్రలో నేను గుర్తుంచుకునే అత్యంత అసహ్యకరమైన సంఘటన ఇది'' అని అభివర్ణించారు.

ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం ఫ్రేజర్ కూడా ఈ ఘటన ''క్రీడా సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగింది'' అని చెప్పారు.

ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కూడా ఈ ఘటన తర్వాత బౌలింగ్ నిబంధనలను మార్చింది.

రూల్స్ బుక్‌లోని '24వ నిబంధన' కింద అండర్ ఆర్మ్ బౌలింగ్‌ను నిషేధించింది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ప్రత్యేకంగా ఒప్పుకుంటేనే ఆ మ్యాచ్ వరకు అండర్ ఆర్మ బౌలింగ్‌ చట్టబద్దం అవుతుందని ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో 2005లో ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ మధ్య జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆసిస్ బౌలర్ మెక్‌గ్రాత్ కూడా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.

మెక్‌గ్రాత్ అదే తరహాలో...

న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో 2005లో ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ మధ్య జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆసిస్ బౌలర్ మెక్‌గ్రాత్ సరదాగా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే,అంపైర్‌గా ఉన్న బిల్లీ బార్డన్ తన దైన స్టైల్‌లో మెక్‌గ్రాత్‌ను తీవ్రంగా మందలించాడు.

ఈడెన్ మార్క్‌లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ 19.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

చివరి బాల్‌కు 45 పరుగలు చేయాల్సి ఉండగా, మెక్‌గ్రాత్ సరదాగా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అంపైర్ అందుకు ఒప్పుకోకపోవడంతో తర్వాత సాధారణంగా బౌలింగ్ చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)