రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమజంట

  • 15 జూన్ 2019
కేటీ రాబిన్స్, జీనైన్
చిత్రం శీర్షిక కేటీ రాబిన్స్, జీనైన్

రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయిన ఒక ప్రేమ జంట కథ. ఇక తామెన్నటికీ కలవలేమనుకున్న వీరు, 75 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోగలిగారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, 1944లో కేటీ రాబిన్స్ అనే అమెరికా సైనికుడు ఉద్యోగ రీత్యా ఫ్రాన్స్‌లోని ఓ గ్రామంలో కొన్నాళ్లున్నారు. అక్కడే ఆయనో ఫ్రెంచ్ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత రాబిన్స్ వేరే చోటకు వెళ్లిపోయారు.

నాటి సైనికులపై ఇటీవల ఓ చిత్రం నిర్మాణం జరుగుతుండగా, రాబిన్స్ తాను ఇష్టపడ్డ మహిళ ఫొటోను ఫ్రాన్స్ జర్నలిస్టులకు చూపించారు.

ఆమెను, ఆమె కుటుంబాన్ని కలుసుకోవడానికి ఫ్రాన్స్ వెళ్లడానికైనా తాను సిద్ధమేనని ఆయన వాళ్లతో చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionరెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయిన ప్రేమజంట 75 ఏళ్ల తర్వాత కలుసుకుంది

కొద్ది వారాల తర్వాత రాబిన్స్, రెండో ప్రపంచ యుద్ధంలో కీలక ఘట్టంగా భావించే డీ-డే 75వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లారు. అప్పుడు ఆ జర్నలిస్టులు ఆయన్ను ఆశ్చర్యపరిచారు.

రాబిన్స్ ఇష్టపడ్డ మహిళ పేరు జీనైన్ గనాయే.

ఫ్రెంచి జర్నలిస్టులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.

రాబిన్స్, జీనైన్ ఇద్దరూ ఫ్రాన్స్‌లో మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేశారు.

"ఆమె ఇంకా బతికే ఉన్నారు, మీ కోసం ఎదురుచూస్తున్నారు" అని రాబిన్స్‌తో చెబితే, "నన్ను ఆట పట్టించకండి. ఎవరైనా దీన్ని నమ్ముతారా" అని ఆయన అన్నారు.

తర్వాత జీనైన్ నివసిస్తున్న రిటైర్మెంట్ హోమ్‌లో వాళ్లిద్దరూ కలుసుకున్నారు.

చిత్రం శీర్షిక కేటీ రాబిన్స్, జీనైన్

"నేనెప్పుడూ రాబిన్స్ గురించే ఆలోచించేదాన్ని. బహుశా అతనొస్తాడని అనుకునేదాన్ని. అతడి గురించి ఎప్పుడూ అడుగుతుండేదాన్ని" అని ఆయన జీనైన్ తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జీనైన్ స్వగ్రామంలోనే రాబిన్స్ నియమితుడయ్యారు. కానీ ఆయన తర్వాత అక్కణ్నుంచి హుటాహుటిన వెళ్లిపోవాల్సి వచ్చింది.

"రాబిన్స్ ట్రక్కులో వెళ్లిపోయినప్పుడు బాగా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. యుద్ధం ముగిసినా అతడు అమెరికాకు వెళ్లిపోవద్దని ఆశించా" అని జీనైన్ చెప్పారు.

రాబిన్స్‌కు దూరమైన తర్వాత, జీనైన్ పెళ్లి చేసుకొన్నారు. ఆమెకు ఐదుగురు సంతానం కలిగారు.

రాబిన్స్ అమెరికాలోనే ఇంత కాలం ఎందుకు ఉండిపోయాడని, వెంటనే ఫ్రాన్స్‌కు ఎందుకు తిరిగి రాలేదని జీనైన్ ప్రశ్నించారు. అతడు వెంటనే వచ్చేసి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు.

రాబిన్స్ అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు కుటుంబం ఉంది.

రాబిన్స్, జీనైన్ ఇద్దరూ వీరి జీవిత భాగస్వాములను కోల్పోయారు. మళ్లీ ఏదో ఒక రోజు తామిద్దరం కలుసుకుంటామని వీళ్లు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)