క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఇంగ్లండ్‌లో ఎండా కాలంలో వానలు ఎందుకు కురుస్తున్నాయి?

  • 15 జూన్ 2019
మైదానంలో వర్షం Image copyright Getty Images

మాంచెస్టర్‌లో ఈ రోజు సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. నిజానికి రోజంతా ఎండ కాసింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత, లైవ్ బులెటిన్ల ముగిశాక సాయంత్రం 6:30 గంటల సమయానికి నేను బీబీసీ మరాఠీ ఫేస్‌బుక్ లైవ్ మొదలు పెట్టబోతున్నాను. అప్పుడు వచ్చింది వాన. ఆ రోజు కోసం నేను కన్న కలలు, ఆలోచనలను.. ఒక్కసారిగా తుడిచిపెట్టింది.

రెండు రోజులుగా విపరీతంగా ప్రయాణం. ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానయానం. ఖండాలు దాటుతూ.. ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిస్తున్న రెండు నగరాల మధ్య ప్రయాణిస్తూ. చాలా అలసటగా ఉంటుందంటే నమ్మండి. కానీ మనం కలలు కన్న మ్యాచ్ రాబోతోందన్న ఆనందం ముందు ఏదీ అసాధ్యంగా కనిపించదు.

ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ తలపడుతున్న మ్యాచ్ కోసం ఈ రోజు నేను నాటింగామ్ నుంచి మాంచెస్టర్ వచ్చాను.

పదహారో తేదీన ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఇది సూపర్ సండేగా మారింది. ఇంగ్లండ్ వాతావరణం.. వరుసగా రెండో రోజు కూడా నన్ను నిరుత్సాహపరచరాదని నిర్ణయించుకుంది.

వానా.. వానా.. వెళ్లిపో...

ఈ రోజు ఉదయం నిద్ర లేచినపుడు నేను ముంబయిలో ఉన్నట్లు, వర్షాకాలం ఆరంభమైనట్లు అనిపించింది. కానీ వెంటనే ఇది ముంబయి కాదని.. నాటింగామేనని నాకు తెలిసివచ్చింది.

నాటింగామ్‌లో నిన్నటి నుంచీ వర్షాలు ఆగలేదు. నేను, నా వీడియో జర్నలిస్ట్ కెవిన్ ఈ రోజు ఉదయం మాంచెస్టర్ వెళ్లటానికి రైలు ఎక్కినపుడు.. అదే బోగీలో ప్రయాణిస్తున్న ఒక భారతీయ కుటుంబం తారసపడింది.

అఖిల్, జ్యోతి, వాళ్ల ఇద్దరు కొడుకులు.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించటానికి వెళుతున్నారు.

నాకు ఆ వార్త చెప్పింది - నిజానికి అది శుభవార్త - అఖిల్. ''మాంచెస్టర్‌లో వర్షం కురవటం లేదు'' అని చెప్పాడతడు. అతడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే.. అతడు ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడో నేను అనుభూతిచెందగలిగాను.

ఈ ప్రపంచ కప్ టోర్నీలో వర్షం ఓ పెద్ద ఆటంకంగా మారింది. ఆటలు తుడిచిపెట్టుకుపోతుండటం అభిమానులను చాలా నిరుత్సాహ పరుస్తోంది.

మేం మ్యాచ్ గురించి, వర్షం గురించి మాట్లాడుకుంటున్నాం. కెవిన్ ఒక వార్త చెప్పాడు. ఈసారి అది శుభవార్త కాదు.

బ్రిటిష్ పౌరుడైన కెవిన్ చాలా మర్యాదగా ఇలా ఇన్నాడు: ''మాంచెస్టర్‌లో ఈ రోజు వర్షం పడటం లేదని మీరు చాలా సంతోషంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ రేపు, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత భారీ వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు చెప్పారు.''

అంతే... అఖిల్ ముఖం మీద నవ్వులు, సంతోషం, ఆశలు అన్నీ ఆవిరైపోయాయి.

సరిగ్గా ఎనిమిది గంటల తర్వాత నా పరిస్థితీ అదే. ఈ రోజు వర్షం పడకపోవటంతో ఇండియా, పాకిస్తాన్ అభిమానులు కాస్త ఊరట పొందారు. వాతావరణ నిపుణుల అంచనాలు తలకిందులవ్వాలని వారు ఆశిస్తున్నారు. వారి ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

ప్రపంచ కప్ టోర్నీని నిర్వహించే కాలం, వేదికలను తప్పుగా ఎంచుకుందని ఐసీసీ మీద సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. కానీ ఇంగ్లండ్‌లో ఇలా ఎందుకు జరుగుతుందనేది తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.

ఇంగ్లండ్‌లో వాతావరణం ఇంతగా ఎందుకు మారుతుంది? ఎలా మారుతుంది?

''బ్రిటిష్ పౌరుడు ఎవరితోనైనా మాటలు కలపాలంటే వాతావరణం గురించి మాట్లాడటం మొదలుపెడితే చాలు'' అని కెవిన్ నిన్న నాకు ఓ ఐడియా ఇచ్చాడు.

ఈ రోజు దానిని అమలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ వాతావరణ సూత్రం గురించి నాకు అర్థమయ్యేలా కెవిన్ కన్నా ఇంకెవరు చెప్పగలరు?

ఇంగ్లండ్ ఒక ద్వీపదేశం. చుట్టూ నాలుగు వేర్వేరు ప్రాంతాలుంటాయి. ఎగువున ఉత్తరాన ఆర్కిటిక్, పశ్చిమాన అంట్లాంటిక్ మహాసముద్రం ఉంటే.. తూర్పున యూరప్ ఖండం, దిగువున దక్షిణాన ఉష్ణమండల ఆఫ్రికా ఖండం ఉంటాయి.

వేర్వేరు ప్రాంతాల నుంచి విభిన్న గాలులు వస్తూ ఇంగ్లండ్‌పై విహరిస్తుంటాయి. ఈ వాయు ప్రవాహాలన్నీ ఒక దానితో ఒకటి ఢీకొంటూ వాతావరణాన్ని అనిశ్చితంగా మారుస్తుంటాయి. ఏ వాయువు బలం ఎక్కువగా ఉంటే ఆ వాయువుకు సంబంధించిన వాతావరణం కనిపిస్తుంది.

మామూలుగా అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేసవి కాలం నడుస్తోంది. కానీ.. పశ్చిమ, ఉత్తర వాయువులు పరస్పరం ఢీకొంటుండటం వల్ల వర్షాలు పడుతూ, వాతావరణం చలిగా ఉంది.

వాస్తవంగా చెప్తే.. ఏది ఏ కాలం అనేదానితో నిమిత్తం లేదు. ఇంగ్లండ్‌లో వర్షాలనేవి నరంతరం. ఇక్కడి జనం ఎప్పుడూ గొడుగులు చేతపట్టుకుని తిరగటానికి ఇదే అసలు కారణం.

ఆదివారం వర్షం పడుతుందా?

ప్రస్తుతం మాంచెస్టర్‌లో వర్షం పడుతోంది. శనివారం కూడా వర్షం కొనసాగుతుందని వాతావరణ అంచనాలు చెప్తున్నాయి. అయితే.. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పొడిగా ఉండేలా కనిపిస్తోంది.

ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కానీ.. కేవలం చినుకులు పడతాయా, లేక కుండపోత కురుస్తుందా అన్నది ఎవరూ నిర్ధారించి చెప్పటం లేదు.

షాహిద్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఈ ఉదయం ఒక ముఖ్యమైన అంశం చెప్పాడు. అతడు లండన్‌లో పుట్టి పెరిగాడు. కానీ ఆయన కుటుంబం ఇస్లామాబాద్ నుంచి వలస వచ్చింది.

''ఏం జరిగినా సరే.. ఈ మ్యాచ్‌ను ఐసీసీ నిర్వహించాలి. ఒకవేళ 50 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే 20 ఓవర్లే ఆడాలి. కానీ మ్యాచ్ జరగాలి'' అన్నది అతడి అభిప్రాయం.

''ఆట కొనసాగాల్సిందే...'' అంటుంటారు. కానీ మాంచెస్టర్‌లో వర్షం ఆడుకుంటోంది. వానదేవుళ్లు కనుకరిస్తారా? లేదా? ఇండియా - పాకిస్తాన్ అద్భుతమైన ఆటతో అలరించగలరా? లేదా? అన్నది కాలమే చెప్పగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)