క్రికెట్ ప్రపంచ కప్ 2019: ‘పాకిస్తాన్‌ ఓడిపోతే వారి సెమీస్ ఆశలు గల్లంతే’ - బీబీసీతో సునీల్ గావస్కర్

  • 15 జూన్ 2019
సునీల్ గావస్కర్

భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌పై భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వ్యాఖ్యాత సునీల్ గావస్కర్‌ బీబీసీ ప్రతినిధి వినాయక్ గైక్వాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ..

ఈ మ్యాచ్ గురించి మీరు ఏం అనుకుంటున్నారు?

ఈ మ్యాచ్ జరగాలని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మాంచెస్టర్ వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఈ మ్యాచ్ భారత్ కంటే పాకిస్తాన్‌కు ఎక్కువ ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్తాన్‌ సెమీ ఫైనల్స్ చేరుకోవడంపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే, భారత జట్టుపై మాత్రం అభిమానుల అంచనాల భారం ఉంది. వాతావరణం సహకరిస్తే, మనం అద్భుతమైన మ్యాచ్ చూడొచ్చు.

ఇంగ్లండ్‌లో విపరీతంగా వర్షం కురుస్తోంది. ఐసీసీ మాత్రం లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించలేదు. దీనిపై మీరేమంటారు?

ప్రతిరోజూ కనీసం ఒక మ్యాచ్ జరుగుతోంది. కాబట్టి ప్రతి మ్యాచ్‌కూ రిజర్వ్ డే పెట్టడం కష్టం. ఒకవేళ వర్షం వల్ల రద్దయిన మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా పడితే ఆ రోజు మూడు మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావొచ్చు. దీనివల్ల సమస్యలు తలెత్తవచ్చునని ఐసీసీ భావించి ఉండొచ్చు. గతంలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు వాతావరణ సమస్య రాలేదు. అప్పుడు వాతావరణం బాగుంది.

భారత జట్టు గురించి ఏమనుకుంటున్నారు? ఈ జట్టు ప్రపంచకప్‌ను సాధించగలదా?

భారత్‌కు మంచి టీం ఉంది. కానీ, నా ఫేవరెట్ టీం మాత్రం ఇంగ్లండ్. ఆ జట్టులో అన్ని రకాల ప్లేయర్లూ ఉన్నారు. పైగా, ఆ జట్టు తమ సొంత గడ్డపై ఆడుతోంది. ఒకవేళ భారత్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్స్‌కు చేరితే మబ్బులతో నిండిన ఈ వాతావరణం కీలకమవుతుంది. అప్పుడు సొంత గడ్డపై ఆడుతున్న జట్టుకే మ్యాచ్ గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాతావరణానికి ఆ జట్టులోని వారంతా అలవాటు పడి ఉంటారు కాబట్టి.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే రోజు వాతావరణం ఎలా ఉండొచ్చు?

పగటిపూట ఎండలో ఆడటాన్ని భారత జట్టు ఇష్టపడుతుంది. ఒకవేళ ఎండ లేకపోతే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాతావరణానికి బాగా అలవాటు పడిన జట్లు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మాత్రమే. అందుకే ఆ రెండు జట్లపై తలపడటం మిగతా వాళ్లకు కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)